Saturday, December 21, 2024

రూ. 85 లక్షల విలువైన 338 కిలోల గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -

పెద్ద ఎత్తున గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న గంజాయి స్మగ్లర్‌ను వరంగల్ జిల్లా, హసన్‌పర్తి పోలీసులు, యాంటీ డ్రగ్స్ వరంగల్ విభాగం పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 85 లక్షల విలువైన 338 కిలోల గంజాయితోపాటు తరలిస్తున్న ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శుక్రవారం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా, వైరామవరం మండలం, పాతకోటకు చెందిన కిలో లక్ష్మీనారాయణ, మరో నిందితుడు అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన కిలో నారాయణ ఆదేశాల మేరకు ఈనెల 17న ఒడిశా రాష్ట్రం, చితరకొండ మండలానికి చెందిన నలుగురి నుంచి 338 కిలోల గంజాయిని 96 ప్యాకెట్లుగా మార్చి వాటిని ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ట్రాక్టర్ ట్రాలీ అడుగు భాగంలో రహస్యంగా ఒక డబ్బాను ఏరాపటు చేశాడు.

అందులో గంజాయి ప్యాకెట్లను భద్రపర్చి వాటిని ట్రాక్టర్లో ధారకొండి నుంచి కామారెడ్డి జిల్లా, భిక్కనూర్ మండలం నుంచి భద్రాచలం, ములుగు, హన్మకొండ, సిద్దిపేట మీదుగా చేరవేసే క్రమంలో పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు హసన్‌పర్తి ఎస్‌ఐ దేవేందర్‌రెడ్డి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అనంతసాగర్ క్రాస్ రోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు తనిఖీ చేశారు. ట్రాలీ అడుగు భాగంలో రహస్యంగా ఏర్పాటు చేసిన డబ్బాలో గంజాయి ప్యాకెట్లను గుర్తించిన పోలీసులు అక్రమ రవాణాకు పాల్పడుతున్న ట్రాక్టర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. కాగా, నిందితుడికి గంజాయి తీసుకురమ్మని చెప్పి వ్యక్తితో పాటు గంజాయి అందజేసిన వ్యక్తులు ఇద్దరు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. కాగా, గంజాయిని పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన యాంటీ డ్రగ్స్ వరంగల్ విభాగం ఎసిపి సైదులు, కాజీపేట ఎసిపి తిరుమల్, యాంటీ డ్రగ్స్ వరంగల్ విభాగం ఇన్‌స్పెక్టర్ సురేష్, హసన్‌పర్తి ఇన్‌స్పెక్టర్ వట్టె చేరాలు, ఎస్‌ఐలు దేవేందర్, రవితోపాటు ఇతర పోలీసు సిబ్బందిని సిపి అభినందించారు. ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డిసిపి షేక్ సలీమా, ఎసిపిలు దేవేందర్‌రెడ్డి, నందిరాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News