Friday, January 10, 2025

పెరిగిన విదేశీ వాణిజ్య లోటు

- Advertisement -
- Advertisement -

దేశ ఎగుమతి, దిగుమతులకు సంబంధించిన తాజా గణాంకాలను పరిశీలిస్తే ఎప్పటి మాదిరిగానే మూడడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కిగానే రుజువవుతున్నది. 202223 ఆర్థిక సంవత్సరంలో మన ఎగుమతులు 6.3% పెరిగి దిగుమతులు 16.5% ఎక్కువ కావడమే ఇందుకు రుజువు. పెరిగిన ఎగుమతుల విలువ 447.46 బిలియన్ డాలర్లు కాగా, ఎక్కువైన దిగుమతుల కిమ్మత్తు 714 బిలియన్ డాలర్లు. అత్యవసరమైన సరకుల దిగుమతి కోసం తీసిన గోతిలో సగాన్ని మాత్రమే పెరిగిన ఎగుమతులు పూడ్చగలిగాయి. ఆ మిగిలిన సగం గొయ్యి దేశ వాణిజ్య లోటును మరింత పెంచింది. వాణిజ్య లోటు 202223లో మొత్తమ్మీద 40% పెరిగింది. ఇది 266 బిలియన్ డాలర్లు. సేవల రంగంలో పెరగగల ఎగుమతుల విలువ కారణంగా 202223 వాణిజ్య లోటు 122 బిలియన్ డాలర్ల వద్ద ఆగవచ్చునని ప్రభుత్వ వర్గాలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అప్పటికీ లోటు నుంచి బయటపడి మిగులులో అడుగు పెట్టే అవకాశం బొత్తిగా లేదు.

మూలుగుతున్న నక్కపై బండరాయి పడినట్టు ఈ ఏడాది వరుసగా ఫిబ్రవరి, మార్చి నెలల్లో మన ఎగుమతులు క్షీణించిపోయాయి. మార్చిలో ఈ పతనం 13.9 శాతం. అలాగే మార్చిలో దిగుమతులు కూడా 7.5% తగ్గడం స్వల్ప మాత్రపు ఊరట. దేశం నుంచి విరివిగా జరుగుతూ వచ్చిన భారీ యంత్రాలు, యంత్ర పరికరాల ఎగుమతులు పడిపోడం ఆందోళనకరమైన విషయం. అలాగే 202223 ఆర్థిక సంవత్సరంలో చైనాకు మన దేశం నుంచి వెళ్ళిన ఎగుమతులు 28% మేరకు పతనం కావడమూ బాధాకరమైన పరిణామమే. 202123 ఆర్థిక సంవత్సరంలో చైనాతో మన వాణిజ్య లోటు 72 బిలియన్ డాలర్లు వుండగా, 202223లో అది 83 బిలియన్ డాలర్లకు పెరిగిపోయింది. అదే సమయంలో చైనా నుంచి దిగుమతులు ఎక్కువైపోయాయి. మన దేశం నుంచి చైనా చేసుకొన్న దిగుమతులు తగ్గిపోయాయి. ఇది మనకు తగిలిన మరో ఆర్థిక శరాఘాతం. రష్యన్ క్రూడాయిల్ మనకు చవకగా లభిస్తున్నందున అక్కడి నుంచి దిగుమతులు భారీగా అంటే 369 శాతానికి పెరిగిపోయాయి.

ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యన్ క్రూడాయిల్, గ్యాస్ కొనుగోళ్ళపై అమెరికా, యూరపు దేశాలు ఆంక్షలు విధించినందున అది మనకు, చైనాకు చవకగా ఆయిల్‌ను అమ్ముతున్నది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొంటున్న ఇండియా అలా దిగుమతి చేసుకొంటున్న చవక క్రూడాయిల్‌ను రిలయెన్స్ వంటి ప్రైవేటు కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నది. అవి అలా అందివచ్చిన క్రూడాయిల్‌ను శుద్ధి చేసి నాణ్యమైన ఆయిల్‌ను యూరపు దేశాలకు అమ్ముకొంటున్నాయి. ఏ విధంగా వచ్చిన ప్రయోజనం నుంచైనా దేశ ప్రజలకు ఒక్క పైసా మేలు కూడా జరగకుండా చూడడంలోనే ప్రధాని మోడీ ప్రభుత్వం తన ప్రతాపాన్ని చాటుకొంటున్నది. ఆ విధంగా 202223 ఆర్థిక సంవత్సరంలో ఇండియా నుంచి పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతి 40% పెరిగింది. అలాగే ఎలెక్ట్రానిక్ సామగ్రి ఎగుమతులు కూడా 50% ఎక్కువయ్యాయి. ఇంకా బియ్యం, రసాయనాలు, ఔషధాల పెరిగాయి. రష్యా చవకగా క్రూడాయిల్‌ను అందించడం, మొత్తమ్మీద అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధర పరిమితంగా వుండడం వల్ల మన దిగుమతుల బిల్లు ఒక విధంగా హద్దుల్లోనే వుందని చెప్పవచ్చు.

ఎగుమతుల్లో ప్రపంచ దేశాల్లో కెల్లా చైనా మొదటి స్థానంలో వుంది. 2021లో దాని మొత్తం ఎగుమతుల విలువ 3.36 ట్రిలియన్ డాలర్లంటే ఎగుమతుల్లో దానికి మనకి ఏనుగుకి ఎలుకకు వున్నంత తేడా సుస్పష్టం. ఈ లోపాన్ని దాటి మన ఎగుమతులను విశేషంగా పెంచుకుంటే గాని మన దేశం నిజమైన అభివృద్ధిని సాధించినట్టు కాబోదు. చైనాతో పోటీపడి దేశంలో తయారీ రంగాన్ని శరవేగంగా అభివృద్ధి పరచాలని ప్రధాని మోడీ వేసుకొన్న పథకం ఆచరణలో ఎప్పటికీ రుజువు కావడం లేదు. కొవిడ్ కాలంలో చైనాని వదిలిపెట్టి వెళ్ళదలచుకొన్న బహుళ జాతి కంపెనీలు తమ కార్యకలాపాలను మన దేశానికి తరలిస్తాయని పెట్టుకొన్న ఆశలు కూడా ఫలించలేదు. వాటి పెట్టుబడులను అత్యధిక స్థాయిలో ఆకట్టుకోడానికి ప్రధాని మోడీ ప్రభుత్వం మేకిన్ ఇండియా వ్యూహాన్ని రూపొందించింది.

విదేశీ బడా కంపెనీల పెట్టుబడులను రప్పించడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌లో బాగా డిమాండ్ వున్న వాటి సరకుల తయారీని ఇక్కడి నుంచే జరిపించాలని ఈవ్యూహం ఉద్దేశించింది. తద్వారా 10 కోట్ల అదనపు తయారీ రంగ ఉద్యోగాలను కల్పించవచ్చని ఆశించింది. అప్పుడు స్థూల దేశీయోత్పత్తి 25% పెరుగుతుందని అనుకొన్నారు. కాని ఆచరణలో మేకిన్ ఇండియా దారుణంగా చతికిలపడిపోయింది. బిజెపి పాలకుల దృష్టి దేశ ప్రజల్లో మతపరమైన చీలికలు తెచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలన్న దాని మీదనే వున్నంత కాలం ఆర్థిక, సామాజిక రంగాల్లో దేశం బాగుపడే అవకాశాలే వుండవు. ఇకనైనా వారు తమ వైఫల్యాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News