కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
మనతెలంగాణ/ హైదరాబాద్ : పిఎస్‌యుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, ఉద్యోగ చర్యలను ప్రజా క్షేత్రంలో ఎండగడుతామని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ( పి.ఎస్.యు) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అన్ని ట్రేడ్ యూనియన్స్ ఈ నెల 28, 29 వ తేదీల్లో నిర్వహించనున్న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెకు టిఆర్‌ఎస్ కార్మిక విభాగం సంపూర్ణంగా మద్దతు ఇవ్వనున్నట్లు వినోద్‌కుమార్ వెల్లడించారు. ఆదివారం మంత్రుల నివాసంలోని క్లబ్ హౌజ్‌లో సార్వత్రిక సమ్మె విజయవంతానికి అన్ని ట్రేడ్ యూనియన్స్ నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సన్నాహక సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సదస్సులో ఐఎన్‌టియుసి, ఎఐటియుసి, సిఐటియు, హెచ్‌ఎంఎస్, టిఆర్‌ఎస్‌కెవి, ఐఎఫ్‌టియు., టిఎన్‌టియుసి, ఐయుటియుటి, రైల్వే, బ్యాంక్, బిడిఎల్. హెచ్‌ఎఎల్, బిహెచ్‌ఇఎల్, పోస్టల్, బిఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్ పోర్ట్స్ ట్రేడ్ యూనియన్స్ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ లాభాలతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కుట్ర పూరితంగా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణను చేస్తోందన్నారు.
పిఎస్‌యుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, ఉద్యోగ చర్యలను ప్రజా క్షేత్రంలో ఎండగడుతామని వినోద్ కుమార్ పేర్కొన్నారు. పిఎస్‌యుల ప్రైవేటీకరణ చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. లాభాలతో నడుస్తున్న రైల్వే, బ్యాంకు,ఎల్‌ఐసి, పెట్రోలియం సంస్థలను ప్రైవేటీకరించే చర్యలు ఎంత మాత్రం సరికాదన్నారు. ఇన్సూరెన్స్ రంగంలో ఎల్‌ఐసికి పోటీగా ఎన్నో ప్రైవేటు సంస్థలు మార్కెట్ లో వచ్చినా నిలువలేదని, అలాగే పెట్రోలియం సంస్థలు బిపిసిఎల్, హెచ్‌పిసిఎల్, ఐఓసిలకు పోటీగా అనేక ప్రైవేటు సంస్థలూ మార్కెట్ లో వచ్చినా అవి కూడా నిలువలేక పోయాయని అన్నారు.
కేవలం ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఆచరణలో నిరూపణ అయ్యాయన్నారు. ట్రేడ్ యూనియన్స్ తలపెట్టిన దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని వినోద్‌కుమార్ ప్రజలు, ప్రజాస్వామ్యవాదులకు పిలుపునిచ్చారు. సదస్సులో టిఆర్‌ఎస్‌కెవి రాష్ట్ర అధ్యక్షుడు జి. రాంబాబుయాదవ్, పిఎస్‌యు. కార్మిక సంఘాల రాష్ట్ర కన్వీనర్ వీ. దానకర్ణా చారి, రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఎల్. రూప్‌సింగ్, వివిధ కార్మిక సంఘాల నాయకులు సంపత్‌రావు, వెంకటేష్, రియాజ్ అహ్మద్, బోస్, యాదవ్‌రెడ్డి, రామ్‌రాజ్, రామమూర్తి, సౌందరరాజన్, మానయ్య, రాఘవ రావు, భాస్కర్ రెడ్డి, జీవన్ కుమార్, సత్యనారాయణ, తిరుపతయ్య, బాపురావు పాల్గొన్నారు.