హైదరాబాద్: నకిలీ ఆవాలు విక్రయిస్తున్న వ్యాపారిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్, షాహినాయత్‌గంజ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి భారీ ఎత్తున నకిలీ ఆవాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… నగరంలోని బేగంబజార్‌కు చెందిన భగవాన్ లాల్ పాండే జ్యోతి ఎంటర్‌ప్రైజెస్ పేరుతో ఫిష్ మార్కెట్‌లో వ్యాపారం చేస్తున్నాడు. అక్కడ నకిలీ ఆవాలను విక్రయిస్తున్నాడు.
స్థానికంగా లభించే ఆవాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని ప్రాసెస్ చేయకుండానే వాటికి బ్లాక్ డైవేసి ఎంఓఆర్ బ్రాండ్ లోగో వేసి స్థానికంగా ఉన్న కిరాణాషాపులు, హోల్ సేల్ షాపులకు విక్రయిస్తున్నాడు. గత కొంత కాలం నుంచి ఇలాగే చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో దాడి చేసి పట్టుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు కోసం షాహినాయత్‌గంజ్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.