మన తెలంగాణ/బంట్వారం : క్రిమి సంహారక మందులు, ఎరువులు, విత్తనాల ధరలు పెరుగుతుండగా మరోవైపు గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో సాంప్రదాయ పంటల సాగు కనిపించడంలేదు. పత్తి, కంది వంటి వాణిజ్య పంటలపైనే రైతులు ఆసక్తి చూపడంతో ఆహార ధాన్యాల సాగు తగ్గిపోతుంది. దాదాపుగా రైతులకు గల పంట పొలాలలో 70 శాతం పత్తి, కంది పంటలను సాగు చేస్తున్నారు. మిగిలిన రబీ సీజన్‌లో 10 శాతం తెల్లజొన్న,10 శాతం శనగ పంట,10 శాతం తెల్ల కుసుమలను సాగు చేస్తున్నారు. ఒకప్పుడు తెల్ల జొన్న, పచ్చజొన్న, రొర్రలు, రాగులు, తెల్ల కుసుమల వంటి పంటలను సాగు చేసేవారు. కానీ నేటి పరిస్థితులలో వాణిజ్య పంటలపై ఆసక్తితో సాంప్రదాయ పంటలపై ఆసక్తి పూర్తిగా తగ్గింది.
ఇలా ప్రతి గ్రామంలో ఆహార ధాన్యాల పంటసాగు తగ్గడంతో వీటికి కొరత ఏర్పడి ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గతంలో రైతుల ఇళ్ళల్లో జొన్నలు, కొర్రలు బస్తాలకొద్ది నిల్వ ఉంచుకునే వారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండాపోయింది. ఒకప్పుడు ఎక్కువ విస్తీర్ణంలో సాగైన తెల్ల కుసుమ ప్రస్తుత పరిస్తితులలో ఎక్కడా కనిపించడంలేదు. జొన్న, శనగ పంట మాత్రం అక్కడక్కడ కొంతమేరకు సాగవుతుందని రైతులు అంటున్నారు. సాంప్రదాయ పంటలను ప్రభుత్వం ప్రోత్సహించని పక్షంలో భవిష్యత్తులో కనుమరుగయ్యే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు.