Sunday, April 13, 2025

నేతల లొసుగులకు సోషల్ మీడియా ముసుగు

- Advertisement -
- Advertisement -

ఏది జర్నలిజం, ఎవరు జర్నలిస్టులు, మీడియా అంటే ఏమిటి, మీడియాకు నిర్వచనం ఏమిటి, ఎవరెవరు మీడియా కిందికి వస్తారు? అనే అంశాలమీద చాలా రోజులుగా చర్చ జరుగుతున్నది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ వేదిక నుంచి ‘జర్నలిస్టులు ఎవరో నిర్వచించండి’ అని జర్నలిస్టు పెద్దలను కోరిన తర్వాత కొందరు ప్రముఖులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. అపరిమితమైన స్వేచ్ఛ ఏ మీడియాకి ఉండదు అనే మాట అందరూ చెబుతున్నారు, అయినా సరే జరగాల్సిన నష్టం జరిగిపోతున్నది. సమాజంలో.. ముఖ్యంగా స్త్రీలపట్ల జరుగుతున్న దుష్ప్రచారం, వ్యక్తిత్వ హననం మీడియాగా చలామణి అవుతున్న సోకాల్డ్ సోషల్ మీడియాలోనే ఎక్కువగా జరుగుతున్నది. గతవారం చెన్నైలో జరిగిన ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ జాతీయ కార్యవర్గ సమావేశాలను జ్యోతి వెలిగించి ప్రారంభించిన ప్రముఖ సినీనటి, సామాజిక కార్యకర్త, ఎఐఎడిఎంకె నాయకురాలు గౌతమి మీడియాకు, మీడియాగా చలామణి అవుతున్న సోషల్ మీడియాకు ఉన్న తేడాను అద్భుతంగా వివరించారు.

‘రోజూ పొద్దున లేస్తే పళ్ళు తోముకున్న దగ్గరనుంచి రాత్రి పడుకునే వరకు వ్యక్తిగత జీవితంలో జరిగే విషయాల దగ్గరనుంచి మొదలుపెట్టి ఏది పడితే అది మాట్లాడటం, రాయటం చేస్తున్న ఒక వేదికను మీడియా అని ఎలా అంటారు? ఒక సమాచారాన్ని సేకరించి దానిలోని నిజానిజాలను తరచి చూసి క్షుణ్ణంగా పరిశీలించి వాస్తవాలను నిగ్గు తేల్చి పత్రికల్లో ప్రచురించి ప్రజలకు సమాచారాన్ని చేరవేసేది జర్నలిజం అవుతుంది తప్ప నోటికి ఏది వస్తే అది మాట్లాడటం, మెదడుకు ఏది తోస్తే అది రాసేసి జనం మీదికి వదలడం జర్నలిజం కాబోదు. దీనిగురించి మీరంతా ఈ రెండు రోజుల సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని ఆమె సూచించారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న రాజకీయపక్షం గొడుగు కింద కూర్చుని ఒక ప్రబుద్ధుడు మీడియా పేరిట మాజీ ముఖ్యమంత్రి మీద, ఆయన భార్యా పిల్లల మీద చేసిన దుర్మార్గమైన వ్యాఖ్యలు శరవేగంగా ప్రచారంలోకి వచ్చాయి.

ఆ మనిషి ఒక యూట్యూబర్. అతను ఈమాటలు మాట్లాడింది మరొక యూట్యూబ్ ఛానల్లో. అతనికి కానీ, ఆ యూట్యూబ్ ఛానల్‌కు కానీ మీడియా అని చెప్పుకునే అర్హత లేదు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పక్షానికి ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ఇటువంటి పలు యూట్యూబ్ ఛానళ్లను, ఈ ప్రబుద్ధుడి వంటి పలువురు యూట్యూబర్లను పెంచి పోషిస్తున్నది. ఇది ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఒక అధికారపక్షం మాత్రమే చేస్తున్నదనడానికి కూడా లేదు. ఈ జాడ్యం దేశంలోని పలు రాజకీయపక్షాలకు అంటుకుని చాలా కాలమైంది. తమను వ్యతిరేకించే రాజకీయవేత్తలను నిందించడానికి, నీచంగా చిత్రించడానికి, పలుచన చేయడానికి, అపఖ్యాతిపాలు చేయడానికి చాలా రాజకీయపక్షాలు ఇదే పని చేస్తున్నాయి. ఇటీవలే హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబంమీద అవాకులు చవాకులు పేలిన వ్యక్తి మాటల్ని ప్రసారం చేసిన ఇద్దరు మహిళల అరెస్టు సందర్భంగా.. రాజకీయపక్షాలు ఎలా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సోషల్ మీడియా పేరుతో లెక్కలేనన్ని యూట్యూబ్ ఛానళ్ళను, యూట్యూబర్లను పెంచి పోషిస్తున్నాయో మనం మాట్లాడుకున్నాం.

వీళ్లంతా యూట్యూబ్‌లో ఇన్‌ఫ్లుయన్సర్లనే పేరిట, జర్నలిస్టులనే పేరిట రాజకీయ నాయకుల ప్రయోజనాలను కాపాడేందుకు ఒక చిన్న క్యాబిన్, ఒక కెమెరా సిద్ధం చేసుకుని రంగంలోకి దిగిపోతున్నారు. మరికొంతమంది మరింత అసభ్యమైన భాష, కంటెంట్ వాడుతూ గాసిప్స్, రెచ్చగొట్టే సమాచారాలతో సమాజంలో మతాలు, కులాలు, మనుషుల మధ్య ఘర్షణలకు కూడా కారణం అవుతున్నారు.ఈ ధోరణిని నియంత్రించడమెలా అనే విషయంపై రాజకీయపక్షాలన్నీ కూర్చుని మాట్లాడుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారంలో అప్రతిష్టపాలు అవుతున్నది, పరువు పోగొట్టుకుంటున్నది రాజకీయ పార్టీలే కాబట్టి వాళ్ళే కూర్చుని మాట్లాడుకుంటే బాగుంటుంది. అయితే అది సాధ్యమయ్యే పనిలా కనిపించడం లేదు. తమ ప్రత్యర్థులను నీచంగా చిత్రించడానికి, వారిని, ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులను అప్రతిష్టపాలు చేయడానికి, ముఖ్యంగా స్త్రీలను కించపరచడానికి జరుగుతున్న ఈ ఘోరాన్ని ఆపడానికి ఎవరూ ముందుకు రావడం లేదు, ఆలోచించడం లేదు. ఇలాంటి జాడ్యం ఇటీవల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి భార్యాబిడ్డల గురించి అసభ్యకరంగా మాట్లాడిన యూట్యూబర్ ఒక్కడికే పరిమితం కాలేదు.

ముఖ్యంగా స్త్రీలను పలుచనచేసి మాట్లాడే హక్కు తమకు సంపూర్ణంగా ఉందని చాలామంది రాజకీయ నాయకులు అనుకుంటూ ఉంటారు. భాష కొంచెం అటుఇటుగా ఉన్నా, భావం మాత్రం అంతిమంగా స్త్రీలను కించపరచడం, వారి నైతికతకు సంబంధించిన అంశాలమీద దిగజారుడు మాటలు మాట్లాడటం పరిపాటిగా మారింది.
ఫలానా నాయకుడి కుటుంబాలకు చెందిన మహిళలపై అసభ్యంగా మాట్లాడడం, గాసిప్స్ ప్రచారం చేయడం ద్వారా ఆ రాజకీయ నాయకుడిని మానసికంగా, నైతికంగా ఘోరంగా అవమానించి దెబ్బకొట్టడం వారి వ్యూహం. నేరుగా నాయకుడిని విమర్శించలేని స్థితి ఉన్నప్పుడల్లా వాళ్ళ కుటుంబసభ్యులపైన పడతారు. స్త్రీలను పురుషాధిపత్య సమాజం ఇండిపెండెంట్ వ్యక్తులుగా చూడదు. పితృస్వామ్యం వాళ్లని పురుషుడి ఆస్తిలో భాగంగా పరిగణిస్తుంది. ఇది అత్యంత సున్నితమైన, వ్యక్తిగతమైన ప్రైవేట్ అంశంగా పురుషుడికి ఉంటుంది. కాబట్టే ఆ కీలకమైన ఆయువుపట్టు మీద దెబ్బకొట్టడం, లైంగికం గా దాడి చేయడం పురుషాధిపత్య సమాజం వేల ఏళ్ళుగాఎప్పుడూ చేస్తున్నదే.

‘కారు గ్యారేజ్‌లో ఉండాలి, మహిళలు ఇంట్లో ఉండాలి. అప్పుడే అవి బాగుంటాయి’ అని మాట్లాడిన రాజకీయ నాయకుడిని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పదవి అయిన శాసనసభ స్పీకర్‌గా ఒక రాజకీయ పక్షం కొనసాగిస్తుంది. ‘ఆడపిల్ల కనిపిస్తే ముద్దైనా పెట్టాలి లేదా ఇంకేమైనా చేయాలి’ అని మాట్లాడే ఒక సినిమా నటుడు వరుసగా శాసనసభకు ఎన్నికవుతూ ఉంటాడు. ఆ పార్టీ ఆయనకు టికెట్ ఇస్తుంది, ప్రజలు ఆయనను ఎన్నుకుంటూ ఉంటారు. ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన దళిత బహుజన వర్గాలకు చెందిన ఒక ప్రముఖ నాయకురాలిని ఒకడు వేశ్య అంటాడు. ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని కలలుగన్న ఒక నాయకుడు (ప్రస్తుతం ఆయన జీవించి లేరు) లైంగిక అత్యాచారం జరిపినా, మరణశిక్ష వేయకూడదు అని వాదించడంకోసం లడకే లడకే హై, గల్తీ హో జాతి హై అంటాడు.

ఆయన మహిళా రిజర్వేషన్లను కూడా వ్యతిరేకించినవాడు. పశ్చిమ బెంగాల్లో ఒక రాజకీయ పక్షం నాయకుడు మరో వామపక్ష స్త్రీలందరిపైనా లైంగిక అత్యాచారం చేయడానికి తన కార్యకర్తలని పంపిస్తానంటాడు. సినీ రంగంలో ప్రఖ్యాతి చెందిన ఒక నటి రాజకీయాల్లో చేరితే ఆమె లోదుస్తులు చూశానని మాట్లాడే కుత్సిత రాజకీయ నాయకులు మనకు తారసపడతారు. ‘నన్ను ఎన్నుకున్నట్టయితే ఈ నియోజకవర్గంలో రోడ్లను ఫలానా అందాల నటి చెక్కిళ్లలాగా మెరిపిస్తా’నంటాడు మరో ప్రబుద్ధుడు. ఒకవేళ ఆ స్త్రీలే రాజకీయాల్లోకి వస్తే వారిని ఉద్దేశించి వాడే భాష కూడా ప్రత్యేకమే. వాళ్ళని లైంగికంగా వేధించడం, సంబంధాలు అంటగట్టి వ్యక్తిత్వ హననం చేసి, మొత్తంగా రాజకీయరంగంనుండే పారిపోయేలా చేస్తారు. లేదా పురుషాధిపత్యాన్ని అంగీకరించి, లొంగి ఉండేలా వాళ్లని తయారు చేసేందుకు ప్రయత్నిస్తారు.

ఇదంతా కూడా మనం మీడియా అని మాట్లాడుకుంటున్న వ్యవస్థలలో పత్రికలుగాని, కొంతమేరకు 24 గంటల న్యూస్ ఛానళ్ళు గానీ ప్రచారం చేస్తున్నవి కావు. ఇటువంటిదంతా ఏ స్వీయ నియంత్రణ కానీ, చట్టాలు కానీ లేని సామాజిక వేదిక (మాధ్యమాల)ల కారణంగా జరుగుతున్నది. ఉదాహరణకు ఒక సంఘటన జరుగుతున్న చోటికి లేదా ఒక సమాచారం తమకు అందినప్పుడు ఒక పత్రికా విలేఖరి, ఒక న్యూస్ ఛానల్ ప్రతినిధి, ఒక యూట్యూబర్ వెళ్ళినట్లయితే ఆ పత్రికా విలేఖరి తను సేకరించిన సమాచారాన్ని తీసుకొచ్చి వార్తగా రాసి పత్రిక ఆఫీసులో ఇస్తే దాన్ని సరిదిద్ది అది ఉచితమో కాదో తేల్చి, వార్తకు పనికొస్తుందో లేదో నిర్ణయించి ప్రచురించే వాళ్ళు ఉంటారు. చానల్లో కూడా దాదాపు అదే జరుగుతుంది. మరి యూట్యూబర్ల సంగతేమిటి? వాళ్లు చూసి, సేకరించిన సమాచారాన్ని ప్రచారంలోకి తీసుకురావచ్చునా లేదా అనే విషయాన్ని ఎవరు నిర్ణయించాలి? అవతలివాడికి స్వేచ్ఛ ఉంది మాట్లాడాడు కాబట్టి ఇవతల వీడికి దాన్ని ప్రచారం చేసే హక్కు ఉందని ఎవరైనా మాట్లాడితే ఇప్పటికే ఇటువంటి ధోరణి వల్ల భ్రష్టుపడుతున్న సమాజం మరింత దుర్భరంగా తయారు కావడం ఖాయం.

ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా జరిగిన సంఘటన విషయానికి మళ్ళీ వస్తే మాజీ ముఖ్యమంత్రి కుటుంబం మీద దుర్మార్గమైన వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ పైన అక్కడి ప్రభుత్వం కేసు పెట్టి అరెస్టు చేసినట్టు వార్తలు వచ్చాయి. అభినందించాల్సిందే. కానీ, అంతటితో ఆగకుండా ఆ ధోరణి అతనిలో, అతనిలాంటి వాళ్ళలో ఎందుకు పెరిగిపోతున్నది, ఎవరి అండ చూసుకొని ఇటువంటి వాళ్ళు చెలరేగిపోతున్నారు? అన్న విషయాలను లోతుగా పరిశీలించి, అవాకులు చవాకులు పేలి తమ ప్రత్యర్ధుల మీద బురదచల్లి, వాళ్ళను అప్రతిష్ఠపాలు చేయడం కోసం తామే పోషిస్తున్న ఆ దుకాణాలను మూసేస్తే బాగుంటుంది.
మాజీ ముఖ్యమంత్రి కుటుంబ ప్రతిష్ఠను దిగజార్చే నీచానికి ఒడిగట్టిన ఈ యూట్యూబర్‌కు ఇది కొత్త కాదు. గతంలో అతను ప్రతిపక్షానికి సంబంధించిన మహిళా నాయకురాళ్ల పట్ల, ఎంతో కాలంగా జర్నలిజం వృత్తిలో ఉండి, విశ్లేషకులుగా జనంలోకి వెళ్లి మాట్లాడుతున్న, వివిధ మాధ్యమాల్లో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న, సమాజంలో ప్రతిష్ఠ కలిగిన పెద్ద మనుషుల మీద కూడా అనుచితంగా వ్యాఖ్యలు చేయడం అనేది ఈ యూట్యూబర్‌తో సహా పలువురికి అలవాటుగా మారిపోయింది. ఈ ధోరణి మార్చడం ఎలా అంటే కొమ్మల్ని నరికితే సరిపోదు, ఈ విషవృక్షాన్ని కూకటి వేళ్ళతో సహా పెకలించివేయాలి. లేకపోతే, ఈ సంస్కృతి మొత్తం సమాజ విలువల పతనానికి దారితీస్తుంది.

రాజకీయ వ్యవస్థ ఆలోచనలో మార్పు రావాలి. అంతవరకు ఇవి సాగుతూనే ఉంటాయి. అందుకే దీని గురించి కేవలం ప్రజలు, మీడియా ఆలోచిస్తే సరిపోదు. మొత్తం రాజకీయ వ్యవస్థ ఈ ధోరణి గురించి మాట్లాడాలి. రాజకీయ నాయకులు ఏ కారణాలతో ఇలాంటి ధోరణిని ప్రోత్సహించినా అది తప్పే. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఈ విలువల పతనాన్ని ఆపేందుకు అన్ని రాజకీయ పక్షాలూ ప్రయత్నం చేయాలి. సమాజంలో స్త్రీల గురించి నీచంగా, నిందాపూర్వకంగా ఎవరూ మాట్లాడని స్థితి తీసుకురావడానికి మన రాజకీయ వ్యవస్థ పని చెయ్యాలే తప్ప అధికారమే పరమావధి, ఏ విలువలతో పని లేదు అని ఎవరైనా అనుకుంటే.. అది వాళ్ళ ఖర్మ.

amar devulapalli

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News