చెన్నై: చెన్నైలో ఎడతెరిపి లేని వర్షాలకు రిజర్వాయర్ల నుంచి వరద నీరు ముంచెత్తడంతో నగరంలోను, పరిసర ప్రాంతాల్లోను రోడ్లన్నీ జలమయమై అనేక రోడ్లు, సబ్వేలలో ట్రాఫిక్ బంద్ అయింది. అనేక చోట్ల ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. బస్సుసర్వీసుకు ఆటంకం కలుగుతోంది. కెకె నగర్‌లోని రాజమన్నార్ సలై వరద నీటితో నిండిపోయింది. మాడ్లీ, రంగరాజపురం సబ్‌వేలు ట్రాఫిక్ లేకుండా మూసివేశారు. ప్రధానమైన జిఎస్టి రోడ్డుతోసహా మేడిపాక్కమ్, ప్రాంతాల్లో రెండు అడుగుల ఎత్తున నీరు నిల్చి ఉంది. వరదనీటితోపాలు పురుగులు, క్రిమి కీటకాలు ఇళ్లల్లోకి వస్తున్నాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఏయే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆపేశారో, ఎక్కడ ట్రాఫిక్ మళ్లిస్తున్నారో సిటీ పోలీసులు సూచిస్తున్నారు. మేడవాక్కమ్ నుంచి షోలింగనల్లూరు ట్రాఫిక్ కామాక్షి మెమోరియల్ ఆస్పత్రి వైపు మళ్లించినట్టు చెప్పారు. వలసరావక్కమ్ లో ట్రాఫిక్‌ను తిరువల్లూరు సలై పాయింట్ వద్ద మూసివేసి కేశవర్ధని మీదుగా ఆర్కాట్ రోడ్డు వరకు ట్రాఫిక్‌ను మళ్లించినట్టు చెప్పారు.
వాణీమహల్ నుంచి బెంజి పార్కు హోటల్ వరకు ట్రాఫిక్‌ను రద్దు చేసి హబిబుల్లా రోడ్డు, రాఘవయ్య రోడ్డు మీదుగా మళ్లించారు. కేకెనగర్ ఆస్పత్రి ముందు అన్నా మెయిన్ రోడ్డులో డ్రెయిన్ వాటర్ పనులకు వెసులుబాటు కోసం ఉదయం థియేటర్ జంక్షన్ మీదుగా ట్రాఫిక్‌ను వ్యతిరేక దిశలో మళ్లిస్తున్నారు. అదే విధంగా ఉదయం జంక్షన్ వద్ద కాశీ పాయంటు నుంచి వచ్చే భారీ వాహనాలను అన్నా మెయిన్ రోడ్డు నుంచి అశోక్ పిల్లర్ మీదుగా మళ్లిస్తున్నారు. చెన్నై నగర ప్రజలకు మంచినీరు సరఫరా చేసే పూండి, చెంబరామ్బక్కమ్ రిజర్వాయర్లు నుంచి అతధికంగా 10,500 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నట్టు అధికారులు చెప్పారు. చెన్నైలో సాధారణ వర్షపాతం 61.16 సెంమీ కాగా అక్టోబర్ 1 నుంచి నవబంర్ 28 వరకు చెన్నైలో 109.76 సెంమీ వర్షపాతం కురిసింది. అంటే అత్యధికంగా 79 శాతం వర్షపాతం నమోదైంది.