న్యూఢిల్లీ :“ అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్పేడెక్స్ రాకెట్ వెళ్లాల్సిన అదే కక్షలో ఇతర ఉపగ్రహాలు అనుసంధానం చెందడం వల్ల ఈ పరిస్థితికి దారి తీసింది. దీంతో ప్రయోగం రెండు నిమిషాలు ఆలస్యమైంది. రాత్రి 9.58 గంటలకు బదులుగా 10 గంటల 15 సెకన్లకు రీషెడ్యూల్ చేశాం” అని ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ వెల్లడించారు. ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థకు ఆయన ఇంటర్వూ ఇచ్చారు. అయితే కక్షలో ఇలా జరిగి, ప్రయోగం ఆలస్యం కావడం ఇదే తొలిసారి కాదు.
2023లో చంద్రయాన్ 3 మిషన్‌ను కూడా కొన్ని నిమిషాల పాటు వాయిదా వేయాల్సి వచ్చింది. స్టార్‌లింగ్‌కు చెందిన కొన్ని ఉపగ్రహాలు ఈ దారిలో వస్తున్నట్టు ఇస్రో లోని నిపుణులు గుర్తించారు. ప్రస్తుతం స్టార్‌లింక్ సముదాయానికి చెందిన 7 వేల ఉపగ్రహాలు భూమి కక్షలో దిగువ భాగంలో ఉన్నాయని తెలిపారు. చాలాకాలంగా ఈ భారీ నక్షత్రరాశులు అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్‌కు కారణమవుతున్నాయని వివిధ అంతరిక్ష సంస్థల శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా … అంతరిక్ష వ్యర్థాల కారణంగా ఉపగ్రహాలకు భారీ ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
ఇదిలా ఉండగా సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్వీ సీ60 నింగిలోకి దూసుకెళ్లనుంది. స్పేడెక్స్ ప్రయోగం ద్వారా ఛేజర్, టార్గెట్ ఉపగ్రహాలను పీఎస్‌ఎల్వీ సి60 ప్రవేశ పెట్టనుంది. ఈ రెండు ఉపగ్రహాల బరువు 440 కిలోలు. ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభమైన తరువాత అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ప్రయోగాన్ని రెండు నిమిషాలు ఆలస్యంగా రీషెడ్యూల్ చేశారు.