- Advertisement -
తమిళనాడు సిఎం స్టాలిన్
చెన్నై: తాను వెళ్లే మార్గంలో పౌరుల వాహనాలను నిలిపివేయొద్దని తమిళనాడు పోలీసులను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఆదేశించారు. అందుకు తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించాలని అధికారులను ఆదేశించారు. దాంతో, స్టాలిన్ కాన్వాయ్‌లో గతంలో 12 వాహనాలుండగా, వాటిని 6కు తగ్గించామని ఓ సీనియర్ అధికారి తెలిపారు. తాను ప్రయాణిస్తున్న సమయంలో ప్రజలకు అసౌకర్యం కలిగించొద్దని స్టాలిన్ ఆదేశించారని ఆ అధికారి తెలిపారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ కారణంగా ఓ న్యాయమూర్తి వాహనాన్ని నిలిపివేసిన సంఘటనపై వారం రోజుల క్రితం మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దానిపై వివరణ ఇవ్వాలని ఆ రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే స్టాలిన్ తన కాన్వాయ్‌ను తగ్గించుకున్నట్టుగా భావించాలి.
- Advertisement -