Wednesday, January 22, 2025

ఏమి దర్జా.. రోడ్డు కబ్జా..

- Advertisement -
- Advertisement -

Traffic Police to remove abandoned vehicles

రోడ్లను మింగుతున్న వాహనాలు..
కుంచించుకుపోతున్న దారులు
నెలల తరబడి దర్జాగా రోడ్లపైనే కార్లు
సొంత జాగీరులా యజమానులు
జనాలకు దారి దొరకని దుస్థితి
అత్యవసరవేళ దిక్కుతోచని పరిస్థితి

పాతబస్తీలోని ప్రధాన, అంతర్గత రోడ్లను అక్రమ పార్కింగ్ కబ్జా చేస్తోంది. వాహనాలు క్రమేణ రోడ్లను మింగేస్తున్నాయి. దారులు మూసుకుపోతున్నాయి. రోడ్లకు ఇరువైపుల ఇష్టాను సారం వాహనాలను నిలుపుతున్నారు. సొంత జాగీరులా వ్యవహరిస్తున్నారు. నెలల తరబడిగా కదలవు మెదలవు. వాటి యజమానులు పట్టించుకోరు. దీంతో ఆమార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. కనీసం నడవలేని పరిస్థితి నెలకొంటోంది. కొంత మంది ఇళ్లు ఒకచోట ఉంటే వారి వాహనం మరోచోట నిలుపుతున్నారు. కదలక మెదలక దుమ్ముకొట్టుకుపోతున్నాయి.

చాంద్రాయణగుట్ట: అత్యవసర పరిస్థితుల్లో అగ్నిమాపక, 108 వంటి వాహనాలు రాలేకపోతున్నాయి. ఇదేమంటే గొడవకు దిగుతున్నారు. ఇలా నెలలు, ఏళ్ళ తరబడిగా స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కార్డన్ సెర్చ్, చబుత్రా సెర్చ్ మాదిరి పోలీసులు అక్రమ పార్కింగ్ సెర్చ్ చేపడితే గాని కొంత వరకైనా ఈ సమస్యకు పరిష్కారం లభించదంటున్నారు. ఈ క్రమంలో చార్మినార్ ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌పై సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది. ఇలాంటివి పాతనగరమంత తరచూ నిర్వహించి, సం బంధిత వాహన యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

దర్జాగా రోడ్లపై పార్కింగ్..

కొంత మంది వాహనదారులు తమ ఇళ్ళలో సరియైన పార్కింగ్ లేక కార్లను, ఇతర వాహనాలను రోడ్లపైనే నిలుపుతున్నారు. దీంతో రోడ్డు ఇరుకై ఆ మార్గంలో రాకపోకలు సాగించే వాహనాలకు అంతరాయం కలుగుతోంది. కొన్ని సందర్భాలలో ట్రాఫిక్ జామ్‌లకు కారణమవుతున్నాయి. గొడవలు జరుగుతున్నాయి. కోవిడ్ కారణంగా గత రెండేళ్ళలో సొంత వాహనాల వాడకం పెరిగింది. ముఖ్యంగా కార్లు అధికమైయ్యాయి. వీటిలో కొత్తవాటి కంటే పాతవే ఎక్కువగా ఉంటున్నాయి. తక్కు వ ధరకు సెకండ్ హ్యాండ్ కార్లు లభిస్తుండటం వల్ల మ ధ్య తరగతి వర్గాలు ఎక్కువగా అటువైపు మొగ్గు చూ పారు. వాటిని కొనుగోలు చేసి తమ ఇళ్ళ ముందు నిలిపారు. నిలుపుతున్నారు. ప్రజా రవాణా, అద్దె వాహనాలకు దూరంగా ఉన్నారు. సొంత వాహనాలపై బారం వేశారు. పాతబస్తీలో ఇరవై, 18 అడుగుల రోడ్లు ఎక్కువగా ఉంటాయి. ఎక్కడైన 40, 30 అడుగుల రోడ్లుంటే ఇరువైపుల ప్రహరీలు, చబుత్రాల నిర్మాణాలు చేపట్టి వాటిని సగానికి తీసుకువస్తున్నారు. ఇలా అసలే ఇరుకు రహదారులు ఆపై ఇరువైపుల వాహనాల పార్కింగ్‌తో కుంచించుకుపోతున్నాయి. ఫలితంగా బస్తీవాసుల ఆ మార్గంలో రాకపోకలు సాగించలేని పరిస్థితి నెలకొంటుంది. నెలలు, ఏళ్ళ తరబడిగా వాహనాలను నిలుపుతున్నారు. దీని వల్ల కొన్ని పనిచేయకుండా దుమ్ముకొట్టుకుపోతున్నాయి.

అత్యవసర వేళ దారి దొరకదు..

అత్యవసర పరిస్థితుల్లో అగ్నిమాపక, అంబులెన్స్‌లు రాలేని పరిస్థితి నెలకొంది. ప్రధాన, అంతర్గత రోడ్లకు ఇరువైపు వాహనాల పార్కింగ్‌తో వాటి మధ్య నుండి ముందుకు వెళ్ళలేక వాటి డ్రైవర్లు చేతులెత్తేస్తున్నారు. దీంతో బాధితుల ఆందోళన అంతా ఇంతా ఉండటం లే దు. ముఖ్యంగా రాత్రివేళలో పరిస్థితి దారుణంగా ఉం టుంది. రోడ్లన్ని కార్లు, వాహనాల పార్కింగ్‌తో కనీసం నడవలేనిదంగా ఉంటున్నాయి. ఈ సమయంలో స్థానికులు పడే ఇబ్బందులు ఇన్నీ అన్నీ కావు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని చేతులపైనో, ఆటోలోనే అత్యవరస వాహనం వరకు తీసుకువెళ్ళాల్సి వస్తుంది. ఐనా సంబంధిత వాహనాల యజమానులలో మానవత్వం, చలనం కనిపించటం లేదు.

అక్రమ పార్కింగ్ సెర్చ్‌లతోనే..

పాతబస్తీలో శాంతిభద్రల పరిరక్షణకు, గుండా, రౌడీయిజాన్ని నిలువరించేందుకు పోలీసులు కార్డన్‌సెర్చ్, చబుత్రా సెర్చ్‌లతో సత్పలితాలు సాధించినట్లే రోడ్లపై తిష్టవేసిన వాహనాలపై అక్రమ పార్కింగ్ సెర్చ్‌లు నిర్వహించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సరియైన పత్రాలు లేకుండా నెలల తరబడి రోడ్లపై ఇష్టాను సారం వాహనాలను నిలుపుతున్న వారిపై చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. తమ స్వార్థం కోసం రోడ్లను కబ్జాచేసి దర్జా వెలగబెడుతున్నవారి ఆటలు కట్టించాలంటున్నారు. ఇటీవల చార్మినార్ ట్రాఫిక్ పోలీసులు పంచమొహల్లా ప్రాంతంలోని రోడ్లపై కొన్ని నెలల నుండి నిలిపిన వాహనాలను ప్రత్యేక క్రేన్ సహాయంతో తొలగించి కాచిగూడ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ పరిధిలోని డిస్పోజల్ షెడ్‌కు తరలించారు. ట్రాఫిక్ డీసీపీ పి.కరుణాకర్ పర్యవేక్షణలో సౌత్‌జోన్ ట్రాఫిక్ ఏసీపీ వి.శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో చార్మినార్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News