Friday, November 22, 2024

గచ్చిబౌలి జంక్షన్ మూసివేతతో హైటెక్‌సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః గచ్చిబౌలి జంక్షన్ నుంచి కొండాపూర్ వైపు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్ పనులకు ఆటంకం కలుగకుండా ఉండేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 90 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎస్‌ఆర్‌డిపి ప్రాజెక్ట్‌లో భాగంగా ఓఆర్‌ఆర్ నుంచి డైరెక్ట్‌గా కొండాపూర్‌కు వెళ్లేందుకు ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. దీంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కొండాపూర్ వైపు ఆఫీసులు ఉన్న ఉద్యోగులు చుట్టూ తిరిగి వెళ్లేందుకు గంటల కొద్ది ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నారు. అటువైపు వెళ్లాల్సిన వాహనాలు ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో హైటెక్ సిటీ నుంచి వెళ్లడంతో ప్రతి రోజు భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడుతోంది.

దీంతో ఐటి ఉద్యోగులు గంటల తరబడి రోడ్లపై ఉండాల్సి వస్తోంది. ఆఫీసులకు వెళ్లే వారు రెండు గంటల ముందు ఇంటి నుంచి బయలుదేరితేనే సరైన సమయానికి ఆఫీసులకు చేరుకునే పరిస్థితి నెలకొంది. పీక్ అవర్స్‌లో ఇటువైపు వెళ్లే వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా రోజులు రోడ్లను మూసివేయడంతో ఇబ్బందులు ముందుముందు ఎక్కువయ్యే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాయదుర్గం నుంచి గచ్చిబౌలి జంక్షన్ మీదుగా కొండాపూర్‌లోని ఐటి కంపెనీలకు వెళ్లే ఉద్యోగులు గతంలో సులభంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వెళ్లేవారు. ప్రస్తుతం ఆంక్షలు విధించడంతో శిల్పారామం నుంచి వెళ్లాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నారు.

ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువ కావడంతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర ఆంక్షలు అమలులో ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ జాయింట్ సిపి, డిసిపిలతో పర్యటించారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఆదేశించారు. ట్రాఫిక్ జాం కాకుండా చర్యలు తీసుకోవాలని, అలాగే సిబ్బందికి పలు సూచనలు చేశారు.
సివిల్ పోలీసులు విధుల్లోకి…
90 రోజులు గచ్చిబౌలి జంక్షన్ నుంచి కొండాపూర్ వైపు ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో హైటెక్ సిటీ సైబర్ టవర్స్ వైపు ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది, కార్లు బానెట్ టూ బానెట్‌గా వెళ్తున్నాయి. దీంతో గంటల కొద్ది వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నాయి. ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు ట్రాఫిక్ సిబ్బంది సరిపోకపోవడంతో లా అండ్ ఆర్డర్ పోలీసులను నియమించారు. రాయదుర్గం, మాదాపూర్, గచ్చిబౌలి పోలీసులు ట్రాఫిక్ విధులు నిర్వర్తించారు. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ విధులు నిర్వహించేందుకు వచ్చిన సివిల్ పోలీసులు ట్రాఫిక్‌ను పట్టించుకోకుండా మొబైల్ చూస్తూ గడిపారని, దీంతో తాము ఇబ్బందులు పడ్డామని వాహనదారులు ఆరోపించారు. దీంతో వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు మరింత పెరిగాయి.
ఐటి ఉద్యోగులతో సమావేశం…..
ఐటి కారిడార్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఐటి కంపెనీల ప్రతినిధుల నుంచి సలహాలు తీసుకున్నారు. పీక్ అవర్స్‌లో కొత్త ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని ఐటి కంపెనీల ప్రతినిధిలు కోరారు. చాలా మంది ఉద్యోగులు కార్లలో ఒకరే ఆఫీసులకు వస్తున్నారని, కార్ పూలింగ్ గురించి ఆలోచించాలని పోలీసులు కోరారు. దీనివల్ల కొంత వరకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News