Friday, November 22, 2024

మెట్రో రైల్ రెండో దశతో ట్రాఫిక్ కష్టాలకు చెక్ !

- Advertisement -
- Advertisement -

ఈ ప్రాజెక్టు పూర్తయితే మరో 8 లక్షల మందికి సౌకర్యం

మన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో రైల్ రెండవ దశ ప్రాజెక్ట్ కు లైన్ క్లియర్ అయింది. దీంతో నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడనుంది. సిటీ విస్తరిస్తున్న కొద్దీ ట్రాఫిక్ రద్దీ పెరగటంతో ఇప్పుడున్న మెట్రోను ఇతర మార్గాలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అందుకు సంబంధించిన డిపిఆర్ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. రూ.24,269 కోట్ల అంచనాలతో చేపట్టే మెట్రో రెండో దశకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం రాగానే పనులు మొదలు పెట్టి రాబోయే నాలుగు సంవత్సరాలలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది.

హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశలో మూడు కారిడార్లలో 69 కిలోమీటర్లు విజయవంతంగా సేవలందిస్తోంది. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో రూ.22 వేల కోట్ల తో నిర్మించారు. ప్రస్తుతం రోజుకు దాదాపు 5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. రెండో దశ అందుబాటులోకి వస్తే సిటీలో రోజుకు మరో 8 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తారు. మెట్రో రైల్ మొదటి దశ అమలైనప్పుడు హైదరాబాద్ దేశంలోనే ఢిల్లీ తర్వాత 2వ స్థానంలో నిలిచింది. గత ప్రభుత్వం ఏడేండ్లుగా మెట్రో విస్తరణను పట్టించుకోలేదు. ఈలోపు మిగిలిన నగరాలన్నీ రెండో, మూడో దశ నిర్మాణ కార్యక్రమాలు కూడా పూర్తి చేశాయి. గత ప్రభుత్వం నిర్వాకంతో ఒకప్పుడు 2వ స్థానంలో ఉన్న హైదరాబాద్ ఇప్పుడు దేశంలో 9వ స్థానానికి పడిపోయింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కత్తా వంటి పెద్ద నగరాలతో పాటు, పూణే, నాగపూర్, అహ్మదాబాద్ లాంటి చిన్న నగరాలు కూడా మెట్రో విస్తరణలో హైదరాబాద్ ను అధిగమించాయి.

గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఏడేండ్లు ఆలస్యం చేయటంతో తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం కూడా భారీగా పెరిగి పోయింది. ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచే కొత్త ప్రభుత్వం మెట్రో విస్తరణపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న మార్గాలతో పాటు అన్ని ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మెట్రోను విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రెండవ దశలో అయిదు కారిడార్లలో 76.4 కిలో మీటర్ల మేరకు మెట్రో విస్తరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనికి సంబందించిన డిపిఆర్ (డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్) పూర్తయింది. ప్రస్తుతం మూడు కారిడార్లు ఉన్నాయి,

రెండో దశ లో ప్రతిపాదించిన కొత్త 5 కారిడార్ లు :

నాలుగో కారిడార్ : నాగోల్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు (36.8 కి.మీ)
అయిదో కారిడార్ : రాయదుర్గ్- నుండి కోకాపేట్ నియోపొలిస్ వరకు (11.6 కి.మీ)
ఆరో కారిడార్ : ఎంజిబిఎస్- నుండి చంద్రాయన్ గుట్ట వరకు (7.5 కి.మీ)
ఏడో కారిడార్ : మియాపూర్- నుండి పటాన్‌చెరు వరకు (13.4 కి.మీ)
ఎనిమిదో కారిడార్ : ఎల్ బి నగర్- నుండి హయత్ నగర్ వరకు (7.1 కి.మీ.)
మెట్రో రెండవ దశను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పాటు పిపిపి విధానంలో చేపడుతాయి. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.24,.269 కోట్లు. అందులో 30 శాతం అంటే రూ.7,313 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, 18 శాతం అంటే రూ.4,230 కోట్లు కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తుంది. మిగతా 52 శాతం నిధులను రుణాలతో పాటు పిపిపి విధానంలో సమకూర్చుకుంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News