హైదరాబాద్ : ఎల్బీ స్టేడియంలో సిఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని సెంట్రల్ జోన్ డిసిపి శ్రీనివాస్ తెలిపారు. ఎల్బీ స్టేడియం 8వ గేట్ నుంచి ముఖ్యమంత్రి ఎంట్రీ ఉంటుందన్నారు. గ్రౌండ్ కిపాసిటీ మొత్తం 80 వేల మందికి అవకాశం ఉంటుందన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం కారణంగా స్టేడియం చుట్టు పక్కల ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు. సిసిటివి కెమెరాలతో బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎల్‌ఈడీ స్క్రీన్ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. దిల్లీ నుంచి వస్తున్న నేతలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. దాదాపు లక్షమంది స్టేడియానికి వచ్చే అవకాశం ఉందన్నారు. ట్రాఫిక్ పోలీసులు సూచించిన స్థలాల వద్ద వాహనాలు పార్కింగ్ చేసుకోవాలని కోరారు. పోలీసులకు సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగేందుకు సహాకరించాలని ప్రజలను కోరారు.
మరోవైపు స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు. మొత్తం మూడు వేదికలు ఏర్పాటయ్యాయి. ప్రధాన వేదికపైన సిఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వేదిక ఎడమవైపు ఎంఎల్‌ఎల కోసం ప్రత్యేక వేదిక ఏర్పాటైంది. కుడి వైపు వివిఐపిల కోసం వేదికను ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా 500 కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గొండు, డప్పు, ఒగ్గు, బోనాలు, షేరీ బ్యాండ్ కళాకారులతో రేవంత్‌కు ఘన స్వాగతం పలకనున్నారు. అమరుల కుటుంబాల కోసం 300 సీట్లతో ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటైంది. తెలంగాణ మేధావులు, ఉద్యమకారుల కోసం 250 సీట్లతో మరో గ్యాలరీ ఏర్పాటు చేశారు. అంతేగాకుండా 30 వేల మంది సాధారణ ప్రజలు కూర్చొనే విధంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్టేడియం బయట భారీ ఎల్‌ఇడి స్క్రీన్‌లు ఏర్పాటు చేయడంతో పాటు స్టేడియం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఎంపి పదవికి రాజీనామా
దిల్లీ పర్యటనలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, డికె శివకుమార్, కెసి వేణుగోపాల్ ను కలిసిన రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని ఆహ్వానం పలికారు. డికె శివకుమార్ తో రేవంత్ రెడ్డి మంగళవారం అర్ధరాత్రి దాదాపు గంటన్నర పాటు మంత్రివర్గ కూర్పుపై చర్చలు జరిపారు. ఎంపి పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి పార్లమెంట్‌లో పలు రాజకీయ పార్టీల ఎంపీలను కలుసుకున్నారు. పలువురు ఎంపిలు రేవంత్ కు స్వీట్ తినిపించి అభినందనలు తెలిపారు.