Friday, December 20, 2024

గచ్చిబౌలిలో 90 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః కొద్ది రోజులు ట్రాఫిక్ జాంలతో నరకం చూసిన వాహనదారులు, సైబరాబాద్ పోలీసులు తీసుకున్న చర్యలతో ఊపిరిపీల్చుకున్నారు. ఉద్యోగులు వారి కార్యాలయాలకు ఎలాంటి ఇబ్బందులు పడుకుండా సాఫీగా వెళ్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో వాహనదారులు గతకొంత కాలం నరకం చూశారు. గచ్చిబౌలి ఫ్లైఓవర్ నుంచి శిల్పా లేఔట్ వరకు ఫ్లైఓవర్ నిర్మిస్తుండడంతో పోలీసులు 90 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కొండాపూర్ ప్రాంతంలో చాలా ఐటి కంపెనీలు ఉండడంతో ఉద్యోగులు రోజు వచ్చి పోతుంటారు. ఇది వరకు ఐటి కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వడంతో ఇంటి వద్ద ఉండి విధులు నిర్వర్తించేవారు. దీంతో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఇబ్బందులు రెండేళ్ల నుంచి ఎదురు కాలేదు.

ఇటీవలి కాలంలో ఐటి కంపెనీలు తిరిగి ఆఫీసులకు రావాల్సిందిగా ఆదేశించడంతో ఉద్యోగులు ప్రతి రోజు వస్తున్నారు. దీంతో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం సమయంలో ట్రాఫిక్ జాంలు ఏర్పడుతున్నాయి. దీనికి తోడు గచ్చిబౌలి జంక్షన్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో అటువైపు వెళ్లే ఉద్యోగులు తిరిగి వెళ్లిల్సా ఉండడంతో సైబర్ టవర్స్, రాదుర్గ్‌మెట్రో, రహేజా, రాయదుర్గం పోలీస్ స్టేషన్, టి హబ్ తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాంలు ఏర్పడుతున్నాయి. ఆంక్షలు విధించిన మొదట్లో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను గాడిలో పెట్టేందుకు సరిపోకపోవడంతో, లా అండ్ ఆర్డర్ పోలీసులను ట్రాఫిక్ విధుల్లో నియమించారు. అయినా కూడా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో గంటల తరబడి ట్రాఫిక్‌లో వాహనదారులు చిక్కుకున్నారు.

వెంటనే మేల్కొన్న సైబరాబాద్ పోలీసులు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ క్లియర్ కోసం చర్యలు తీసుకున్నారు. కొన్ని జంక్షన్లను మూసివేయగా, కొన్ని యూటర్న్‌లను ఎత్తివేశారు. రాయదుర్గం నుంచి టి హబ్‌కు వెళ్లే వారి కోసం బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ కింద యూటర్న్ ఏర్పాటు చేసి అక్కడి నుంచే ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. అలాగే బయోడైవర్సిటీ వద్ద ఉన్న జంక్షన్‌ను మూసివేసి కేవలం సైబర్ టవర్స్ నుంచి వచ్చే వాహనాలను గచ్బిబౌలి వైపు వెళ్లనిస్తున్నారు. ఇక్కడ జంక్షన్ మూసి వేయడంతో సమీపంలోని ట్రాఫిక్ ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగుతోంది. గచ్బిబౌలి ఫ్లైఓవర్ కింద ఉన్న యూటర్న్ మూసివేసి సిగ్నల్ నుంచి వెళ్లేలా చేశారు. అంతేకాకుండా ఎక్కడికక్కడ యూటర్న్‌లు ఓపెన్ చేయడమే కాకుండా వన్ వేలు చేయడంతో ట్రాఫిక్ గాడిలోపడింది. దీంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించినా కూడా ట్రాఫిక్ జాంలు లేకుండా వాహనదారులు సాఫీగా ముందుకు పోతున్నారు.

సిపి ఎంట్రీతో మారిన సీన్…
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో రోజు గంటల కొద్ది ట్రాఫిక్ జాం ఏర్పడుతుండడంతో సిపి స్టిఫెన్ రవీంద్ర ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పర్యటించారు. హైదరాబాద్‌కు కీలకమైన సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటే మంచిదికాదని వెంటనే రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర రద్దీ ఉన్న సమయంలో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. ట్రాఫిక్ సిబ్బందికి వాహనాలు సజావుగా ముందుకు సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలు గురించి వివరించారు. గచ్చిబౌలి జంక్షన్‌ను మూసివేసినా దాని ప్రభావం మిగతా ప్రాంతాలపై పడకుండా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ సిబ్బందిని ఆదేశించారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు నిరంతరం పనిచేసి, వాహనదారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News