ట్రాఫిక్ వలంటీర్ల శిక్షణ తరగతులు ప్రారంభం
సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి శ్రీనివాస రావు
హైదరాబాద్: ట్రాఫిక్ వలంటీర్ల సేవలు మరువలేనివని సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి శ్రీనివాస రావు అన్నారు. సైబరాబాద్ పోలీసులు, ఎస్‌సిఎస్‌సి ఆధ్వర్యంలో చేపట్టిన ట్రాఫిక్ వలంటీర్ల శిక్షణ కార్యక్రమాన్ని కమిషనరేట్‌లో శనివారం ట్రాఫిక్ డిసిపి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ విధులు నిర్వర్తించేందుకు ఐటి ఉద్యోగులు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఉద్యోగులు, హౌస్ వైఫ్‌లు స్వచ్ఛందంగా ట్రాఫిక్ విధులు నిర్వర్తించేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. వలంటీర్లకు ముందు ముందు మరింత సహకారం అందిస్తామని తెలిపారు. ట్రాఫిక్ వలంటీర్లకు మరింత గుర్తింపు ఇచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఎస్‌సిఎస్‌సి జనరల్ సెక్రటరీ కృష్ణ ఏదుల మాట్లాడుతూ తాను 2006 నుంచి ట్రాఫిక్ వలంటీర్లగా పనిచేస్తున్నానని తెలిపారు. వలంటీర్ రోల్‌ను తాను ఎంజాయ్ చేస్తున్నానని తెలిపారు. ట్రాఫిక్ వలంటీర్లు తమ ఆసక్తిని ఇలాగే కొనసాగాలని ఎస్‌సిఎస్‌సి జాయింట్ సెక్రటరీ వెంకట్ అన్నారు.