తోపులాటలో సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ మృతి
హైదరాబాద్ : ప్రజాగాయకుడు గద్దర్ అంత్యక్రియల్లో విషాదం చోటు చేసుకుంది. కడసారి చూపుకోసం వచ్చిన అభిమానులతో ఆల్వాల్‌లోని గద్దర్ ఇంటివద్ద తోపులాట జరిగింది. ఈ తోపులాటలో గద్దర్‌కు అత్యంత ఆప్తుడిగా పేరున్న సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ మృతి చెందారు. భారీగా తరలివచ్చిన అభిమానులను పోలీసులు నియంత్రించడంలో పోలీసులు నియంత్రించలేక పోయారు. దీంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో జహీరుద్దీన్ అలీ ఖాన్ కింద పడిపోయి ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయ్యారు. వెంటనే ఆయన్ను సమీపంలోని ప్రాథమిక చికిత్సా కేంద్రానికి తరలించగా ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
జహీరుద్దీన్ అలీ ఖాన్ గద్దర్‌కు అత్యంత సన్నిహితుడు. గద్దర్ అంత్యక్రియలకు హాజరై ఎల్‌బి స్టేడియం నుండి పార్థివదేహంతో పాటే వాహనంలో ఆల్వాల్ ఇంటివ్దకు చేరుకున్నారు. అయితే ఇంటి వద్ద కిక్కిరిసిన జనం మధ్య ఆయన కిందపడిపోయారు. ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. కార్డియాక్ అరెస్ట్‌తోనే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ప్రముఖుల సంతాపం
దిగ్భ్రాంతికి గురిచేసింది : రేవంత్ రెడ్డి
సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జాహిరుద్దీన్ అలీఖాన్ అకాల మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఉర్దూ జర్నలిస్టుగా, సామాజిక ఉద్యమ కారుడిగా తెలంగాణ లో మంచి గుర్తింపు పొందిన జహీరుద్దీన్ అలీఖాన్ మరణం తెలంగాణకు తీరని లోటని నివాళులర్పించారు.
ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
ఉర్దూ పత్రికా రంగానికి తీరని లోటు : పొన్నాల
సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జాహిరుద్దీన్ అలీఖాన్ అకాల మరణం పట్ల మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం ఉర్దూ పత్రికా రంగానికి తీరని లోటని అన్నారు.
దిగ్భ్రాంతికి గురిచేసింది : అల్లం నారాయణ
ప్రముఖ ఉర్దూ దిన పత్రిక సియాసత్, మేనేజింగ్ ఎడిటర్, జహీరుద్దీన్ అలీ ఖాన్ ఆకస్మిక మరణం పట్ల, మీడియా అకాడమీ చైర్మన్, అల్లం నారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా ఆయన నిర్వహించిన పాత్ర ప్రత్యేకమైందని కొనియాడారు. లౌకికవాదానికి కట్టుబడ్డ జహీరుద్దిన్ ఒక అభ్యుదయవాది అని పాత బస్తీ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహించి ఆయన చెరగని ముద్ర వేశారని అన్నారు. దేశంలోని ఉర్దూ జర్నలిజానికి ఆయన మరణం తీరని లోటని అన్నారు. జహీరుద్దీన్ తెలంగాణ మీడియా అకాడమీ తొలి గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు. అకాడమీ నిర్వహిస్తున్న ‘జర్నలిస్టుల సంక్షేమ నిధి ‘ కమిటీ లో కూడా ఆయన సభ్యులు. మీడియా అకాడమీ నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు, ఇతర కార్యక్రమాల విధి విధానాలు రూపొందించడంలో వారి సలహాలు ఉపయోగపడ్డాయని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాధ సానుభూతి తెలిపారు.
దాసోజు సంతాపం
సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ ఆకస్మిక మృతిపట్ల బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత రాత్రి ఎల్‌బి స్టేడియంలో గద్దరన్న భౌతిక కాయానికి నివాళులర్పించే సమయంలో ఆయనతో తాను సంభాషించానని గుర్తు చేసుకున్నారు. జహీరుద్దీన్ మీడియాలో కీలక పాత్ర పోషించారని దాసోజు శ్రవణ్ అన్నారు. ఆయన మృతిపట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేవారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.