Sunday, December 22, 2024

పండుగపూట విషాదం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఇటిక్యాల : జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల పరిధిలోని బీచుపల్లి జాతీయ రహదారి 44పై శనివారం తెల్లవారుజామున గంటలకు ప్రైవేటు ట్రావెల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో షార్ట్ సర్యూట్‌తో చెలరేగడంతో ఒక మహిళ సజీవ దహనం కాగా, మరో ఏడుగురు గాయపడగా క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించా రు. మృతి చెందిన మహిళను హైదరాబాద్‌కు చెందిన మాలతి (40)గా పోలీసులు గుర్తించారు. ఎస్‌పి రుతురాజ్ వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుంచి 32 మం ది ప్రయాణికులు ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్ చేసుకోగా, వీరితో పాటు ఐదుగురు ఆరాంఘర్ చౌరస్తా వద్ద బస్సు ఎక్కారు. ఇద్దరు డ్రైవర్లతో చిత్తూరుకు బయల్దేరిన బస్సు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో రెండో డ్రైవర్ బస్సు నడుపుతున్నాడు.

బీచుపల్లి దాటిన తరువాత పదవ బెటాలియన్ సమీపంలో బస్సు ఎన్‌హెచ్ 44 రోడ్డు ఎడమ వైపునకు అదుపుతప్పి పడిపోయింది. సమాచారం అందుకున్న ఇటిక్యాల పోలీస్ స్టేషన్ బ్లూ కోట్స్ కె. ప్రవీణ్, వరదరాజు, హైవే సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. యస్‌ఐ అశోక్, అలంపూర్ సిఐ వేంకటేశ్వర్లు, డిఎస్‌పి కార్యాలయానికి సమాచారం అందించారు. బస్సులో ప్రయాణిస్తున్న 36 మందిని పోలీసు సిబ్బంది రక్షించారు. ఈలోగా షార్ట్ సర్కూట్‌తో మంటలు చెలరేగడంతో అందులో మహిళ ఇరుక్కుని సజీవ దహనమైంది. హైవే పోలీసులు ప్రమాదం జరిగిన ఘటన స్థలానికి వెంటనే చేరుకుని ప్రయాణికులను ప్రమాదం నుండి కాపాడడం వల్ల ప్రాణ నష్టాన్ని నివారించగలిగారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. విషయం తెలుసుకున్న ఎంఎల్‌ఎ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ నేతలతో కలసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News