మన తెలంగాణ/హైదరాబాద్ : తిరుపతి జూపార్క్‌లో విషాదం చోటుచేసుకుంది. లయన్ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వ్యక్తిపై సింహం దాడి చేసి చంపే సింది. తిరుపతిలోని జూపార్క్ సందర్శనకు వెళ్లిన వ్యక్తి సెల్ఫీ కోసం లయన్ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లినట్లు తెలిసింది. సింహం అరుపులతో ఆ వ్యక్తి చెట్టు ఎక్కాడు. కానీ భయంతో అదుపు తప్పి కిందపడిపోయాడు. ఆ వ్యక్తిని గమనించిన సింహం అతడిపై ఒక్కసారిగా దూకి దాడి చేసింది. ఈ దాడిలో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం సింహం దాడిలో మృతి చెందిన మృతుడిని రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్ గుర్జర్‌గా గుర్తించారు. సింహాన్ని ఎన్‌క్లోజర్ కేజ్‌లో అధికారులు బంధించారు. సమాచారం అందుకున్న తిరుపతి రూరల్ పోలీ సులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై డిఎస్పీ శరత్‌రాజ్ జూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే సెల్ఫీ దిగడానికి సింహాల ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన సందర్శకుడు భయంతో చెట్టు ఎక్కి కింద పడినట్లు తెలుస్తోంది. సింహం నోటికి చిక్కడంతో బాధితుడి తల భాగాన్ని సింహం పూర్తిగా తినేసినట్లు తెలిసింది. రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్ గుర్జార్ వృత్తిరీత్యా డ్రైవర్ పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం హైదరాబాద్ నుండి టిక్కెట్ కొని బస్సులో తిరుపతి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతోనే నిషేదిత ప్రాంతమైన లయన్ ఎన్ క్లోజర్‌లోకి అతను దూకినట్లు జూ పార్క్ అధికారులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టమ్ నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు.
ఇంతకు ముందు కూడా ఇలాంటి సంఘటనలు
ఇలాంటి ఘటనలు ఇంతకు ముందు కూడా చాలానే జరిగాయి. హైదరాబాద్ జూలో కూడా ఒక వ్యక్తి ఇలానే పులి బోనులోకి వెళ్ళాడు. అయితే అదృష్టవశాత్తు అతని మీద పులి అటాక్ చేసే లోపే అతనిని జూ సిబ్బంది కాపాడారు. 2019 జనవరి 20న జిరాక్ పూర్ లో మొహేంద్ర చౌదరి జులాజికల్ పార్క్ లో 22 ఏళ్ల వ్యక్తిని సింహం ఇలానే చంపింది. పంజాబ్ రాష్ట్రంలోని మహేంద్ర చౌదరి జూపార్క్‌లో సింహల దాడిలో ఓ వ్యక్తి మరణించిన ఘటన 2019 జూన్ 21న జరిగింది. ఘనా దేశంలో, పాకిస్తాన్‌లో, బహవాల్ పూర్‌లో ఇలా చోట్ల సింహం కేజ్‌లోకి మనుషులు వెళ్ళడం చనిపోవడం చోటు చేసుకున్నాయి.
జూ పార్క్‌లో స్పష్టంగా నియమాలు ఉన్నా?
ప్రతీ జూపార్క్‌లో పులుల, సింహాలు, ఏనుగులు ఉన్న ఎన్‌క్లోజర్‌లోకి వెళ్ళొద్దని చాలా స్పష్టంగా రాస్తారు. ప్రతీ చోట వన్యప్రాణుల సంరక్షణ నియమాలు ఉంటాయి. అసలు వాటిని చూడ్డానికి వెళ్ళినప్పుడే గట్టిగా శబ్దాలు చేయొద్దని, అరవొద్దని, రెచ్చగొట్టే విన్యాసాలు చేయోద్దని చెబుతారు. అయినా కూడా మనుషులకు అత్యుత్సాహం ఆగదు. వాటిని రెచ్చగొట్టే పనులు చేస్తుంటారు. దానికి తోడు కొంతమంది వాటితో ఫోటోల కోసం ఎన్‌క్లోజర్ లోపలికి వెళతుంటారు. చివరకు ప్రాణాలు పోగొట్టుకుంటారు.