Sunday, December 22, 2024

ఘోర విషాదం

- Advertisement -
- Advertisement -

ఒడిశాలోని బాలాసోర్ లో శుక్రవారం సాయంత్రం సంభవించిన రైలు ప్రమాదం తీవ్రతను, దానివల్ల కలిగిన మానవ విషాదాన్ని వివరించడానికి మాటలు చాలవు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ కూడా అంగీకరించారు. మాటలకందని విషా దమని, అన్ని కోణాల్లో దర్యాప్తుకి ఆదేశించామని, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు. వ్యవస్థలను మరింత సురక్షితం చేయవలసి ఉన్నదన్నారు. మృతుల సంఖ్య 288అని, గాయపడినవారు 747 మంది అని శనివారం సాయంత్రానికి అందిన సమా చారం తెలియ జేస్తున్నది. దీనిని బట్టి మృతుల సంఖ్య భారీగా పెరిగే సూచనలే కనిపిస్తు న్నాయి. ఈ శతాబ్దిలో ఇదే అతి పెద్ద ప్రమాదం. అంతే కాదు, బ్రిడ్జి కూలిపోయి రైలు నదిలో పడిపోవడం వంటి ప్రమాదం కాదిది. విద్రోహ చర్య అనుకోడానికీ తగిన ఆధారా లేమీ ఇంతవరకు బయట పడలేదు. ప్రధాని మాటలను బట్టే ఇది భద్రతా వ్యవస్థ లోపం వల్ల జరిగిందని స్పష్ట పడుతున్నది. సిగ్నల్ వ్యవస్థలో జరిగిన పొరపాటు, నడుస్తున్న రైళ్లను ముంద స్తు హెచ్చరికతో అప్రమత్తం చేయగల కవచ్ వ్యవస్థ ఆ ప్రాంతంలో లేకపోవడం వంటివి కారణాలని బోధపడుతున్నది.

మెయిన్ లైన్‌లోని కోరోమండల్ ఎక్స్‌ప్రెస్‌కు సిగ్నల్ ఇచ్చి వెనక్కు తీసుకోడంతో అది లూప్ లైన్‌లోకి వెళ్లిందని, అప్పటికే అక్కడున్న గూడ్స్‌ను అది డీకొన్నదని, దానితో కోరోమం డల్ బోగీలు ఒరిగి పోయి పూర్తిగా పక్కకు పడిపోయాయని అదే సమయంలో దూసుకొస్తున్న బెంగళూరు -హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్ప్రెస్ ఆ బోగీల పైకి ఎక్కేయడంతో ఇంతటి ఘోర ప్రమాదం సంభవించినట్టు స్పష్టపడుతున్నది. ఈ మధ్య చెప్పుకోదగిన భారీ రైలు ప్రమాదాలు జరగడం లేదు. ఇది ఊరట అనుకుంటున్న సమయంలో మన విశ్వాసాన్ని వమ్ము చేస్తూ ఈ ప్రమాదం సంభవిం చింది. సరిదిద్దుకోవలసిన లోపం చాలా లోతైనదేనని గుర్తు చేసింది. ప్రమాదం జరిగినప్పుడు కోరో మండల్ ఎక్ప్రెస్ గంటకు 120కిలో మీటర్లకు మించిన వేగంతో ప్రయాణం చేస్తున్నది. అందువల్ల దాని 21బోగీలు పట్టాలు తప్పి పూర్తిగా పక్కకు పడిపోయాయి. అలాగే అదే సమయం లో దూసుకొచ్చిన బెంగళూరు -హౌరా సూపెర్ ఫాస్ట్ రైలు బోగీలు రెండు, పట్టాలు తప్పాయి. కోరో మండల్ ఎక్ప్రెస్‌కు ఇచ్చిన వెంటనే సిగ్నల్ ను వెనక్కు తీసుకోడం ఎలా జరిగింది, అందుకు మానవ లోపమా, సాంకేతిక లోపమా, ఏది కారణం? సిగ్నళ్ళను నిత్యం తాజాగా సర్వ సన్నద్ధంగా ఉంచడం లేదా, ఈ అత్యంత ప్రధానమైన లైన్ లో కవచ్ రక్షణ వ్యవస్థను ఎందుకు నెలకొల్పలేక పోయారు? కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చి తొమ్మిదేళ్లు అయింది. వచ్చీ రాగానే రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్ లో కలిపేసింది.

అంతటితో ఆగకుండా రైల్వేను ప్రైవేటు పరం చేసే యావలోనే కాలమంతా గడిపేసింది. బ్రిటిష్ హయాం నాటి మౌలిక సదుపాయాలు, ట్రాక్, సిగ్నలింగ్ తదితర వ్యవస్థల ఆధునికీకరణ వైపు ఎంత మేర దృష్టి సారించిందో తెలియదు. జరగబోయే దర్యాప్తుల్లో ఈ వ్యవస్థల ఆధునికీకరణ ఎంత వరకు వచ్చింది, ఈ లైన్ లో కవచ్ ను ఎందుకు ఏర్పాటు చేయలేదు అనే అంశాలపై లోతుగా దృష్టి సారించాలి. ఒక్క ప్రాణం పోతేనే విలవిలాలడిపోతామే, ఇన్నివందలమంది అకాల బలవన్మరణం, ఇన్నిన్ని వందలమంది గాయ పడడం, ఆ దృశ్యాలను చూస్తుంటే కడుపు తరుక్కుపోతున్నది. సురక్షితంగా ఆహ్లాదంగా ప్రయాణం చేసి సకాలంలో గమ్యాలకు చేరుకోడానికి రైలు ఎక్కే ప్రయాణికులు మృత్యు ముఖంలోకి జారు కోడం అత్యంత హృదయవిదారకం. దూరాన్ని జయిస్తున్నాం, కాని మృత్యువును అధిగమించ లేకపోతున్నాము. మానవ లోపాలవల్లే ఇది జరుగుతున్నది. ఎంత తొందరగా గమ్యం చేరామన్న దానికంటే ఎంత సురక్షితంగా చేరామన్నదే ప్రధానం కావాలి. దేశంలో రైళ్ల సంఖ్య పెరుగుతు న్నంత వేగంగా మార్గాల సంఖ్య పెరగడం లేదు. మొత్తం 1219 లైన్ సెక్షన్లలో 40 శాతం పూర్తి స్థాయికి మించి వినియోగానికి గురవుతున్నాయి, అలాగే పాసెంజర్ రైళ్ళ, సరకు రవాణా రైళ్ళ సంఖ్య కూడా విశేషంగా పెరిగిపోయింది.

ఇది ప్రమాదావకాశాలను పెంచుతున్న అంశమే. వొక ప్రమాదానికి దారి తీసిన కారణాలు మళ్లీ మళ్లీ తలెత్తకుండా చూడాలి. కేంద్రం నిరుద్యోగాన్ని తరిమి కొట్టడంలో ఘోరంగా విఫలమైంది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు అప్పగించడానికి రచించుకొన్న వ్యూహంలో ప్రధాన భాగంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకొంటున్నది. ఖాళీలను భర్తీ చేయడం మానుకొన్నది. తక్కువ శ్రమ శక్తితో ఎక్కువ పని చేయించే ఎత్తుగడను అమలు చేస్తున్నది. ప్రమాదావకాశాలున్న రైల్వే వంటి విభాగాల్లోనైనా ఈ వ్యూహానికి సందు లేకుండా చేసి ఉండాల్సింది. రైల్వే లో ఏ ఏ శాఖలో ఎన్ని ఉద్యోగ ఖాళీలున్నాయో ప్రజలకు తెలియ జేయ వలసి వున్నది. బ్రిటన్, జపాన్ వంటి కొన్ని దేశాల్లో అతి తక్కువ రైలు ప్రమాదాలు సంభవిస్తాయని వాస్తవ గణాంకాలు చెబుతున్నాయి. మన దేశంలో అటువంటి స్థితిని ఎందుకు సుసాధ్యం చేసుకోలేక పోతున్నాం? అక్కడి మాదిరిగా అమిత వేగంగా వెళ్లే రైళ్లను ప్రవేశ పెట్టి కీర్తి కిరీటాలు ధరించాలని చూసే పాలకులు, ప్రమాదాలను పరిమితం చేసుకోడం పట్ల సైతం దృష్టి సారించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News