Monday, December 23, 2024

రైలు ప్రమాద సంఘటనల కథనాలు.. 14 ఏళ్ల తర్వాత తల్లి పెద్దకర్మకు వచ్చి

- Advertisement -
- Advertisement -

కటక్ : ఒడిశా రైలు ప్రమాద ఘటనలో అనేక విషాద సంఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి. ఒడిశా లోని బాలేశ్వర్ ప్రాంతానికి చెందిన రమేశ్ జెన గత 14 ఏళ్లుగా చెన్నైలో ఉంటున్నాడు. తల్లి చనిపోవడంతో పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్గొనడానికి చెన్నై నుంచి బాలేశ్వర్ వచ్చాడు. తిరిగి చెన్నై వెళ్తుండగా కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. నాలుగు రోజుల క్రితం తల్లి పెద్దకర్మ జరిగింది. శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు చెన్నై వెళ్లాల్సిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో బయలు దేరాడు.

రాత్రి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైందని తెలుసుకుని రమేశ్ తమ్ముడు సురేష్ షాక్ తిన్నాడు. ఆరు గంటల వరకు తనతో గడిపిన తన అన్న అంతలోనే చనిపోవడం ఎక్కడా పాలుపోవడం లేక కన్నీళ్లు పెట్టుకున్నాడు. 14 ఏళ్ల తరువాత చెన్నై నుంచి తల్లి పెద్దకర్మకు బాలేశ్వర్ వచ్చిన తన అన్నయ్య ఆఖరి చూపులు కావడం తీరని విషాదంగా వెంటాడుతోంది. “ అన్న రమేశ్‌కు ఫోన్ చేయగా తీయలేదు. కాసేపటి తర్వాత మళ్లీ ఫోన్ చేయగా, రమేశ్ మృతి చెందినట్టు ఎవరో చెప్పారు. ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లగా మృతదేహాలను ఆస్పత్రికి తీసుకెళ్లారని చెప్పారు. అక్కడంతా వాకబు చేసి బాలేశ్వర్ జిల్లా ప్రధాన ఆరోగ్య కేంద్రానికి వెళ్లి అన్నయ్య మృతదేహం చూడగానే ప్రాణం ఆగినంత పనైంది” అని సురేష్ ఆవేదన చెందాడు.

మానవత్వం… రక్తదానం
బాలేశ్వర్ సమీపం లోని బహానగా బజార్ వద్ద రైళ్ల ప్రమాదంలో 238 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 900 మంది గాయపడ్డారు. వీరిని ప్రభుత్వ ఆస్పత్రి లోను, సమీప ఆస్పత్రుల్లోనూ చికిత్స చేస్తున్నారు. అయితే వీరికి రక్తం అవసరం అవుతుందని వందలాది మంది యువకులు శుక్రవారం రాత్రి బాలేశ్వర్ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. వీరంతా గంటల తరబడి వేచి ఉండి గాయపడిన వారికి రక్తదానం ఇస్తుండడం వారిలోని మానవత్వాన్ని చాటింది. అలాగే ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు చొరవ చూపించి ఎందరినో రక్షించగలిగారు. దాదాపు 200 నుంచి 300 మందిని కాపాడగలిగాం అని స్థానికుడు ఒకరు మీడియాకు చెప్పారు.

సహాయ చర్యలు
భారత సైన్యం రంగం లోకి దిగి బోగీల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసి వెంటనే ఆస్పత్రులకు తరలించడం జరుగుతోంది. ఈ మేరకు 200 అంబులెన్స్‌లు అక్కడ అందుబాటులో ఉన్నాయి. వీటిలో 167 వరకు 108 వాహనాలు కాగా, 20 కి పైగా ప్రభుత్వ అంబులెన్స్‌లు ఉన్నాయి. వీటితోపాటు 45 మొబైల్
హెల్త్ బృందాలు అక్కడ ఉన్నాయి. అదనంగా మరో 50 మంది వైద్యులు రంగంలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News