Wednesday, January 22, 2025

ఎదురెదురుగా ఢీకొన్న రైళ్లు..36మంది దుర్మరణం

- Advertisement -
- Advertisement -

తెంపీ: గ్రీస్‌లో మంగళవారం రాత్రి ఘోర రైలుప్రమాదం జరిగింది. అధికవేగంతో ఎదురెదురుగా వచ్చిన రెండురైళ్లు నేరుగా ఒకదాన్ని ఒకటి ఢీకొట్టడంతో 36మంది దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటనలో 85మంది గాయపడ్డారని బుధవారం తెలిపారు. ఏథెన్స్ నుంచి థెసాలోని వెళుతున్న ప్యాసింజర్ రైలులో వందలాదిమంది ప్రయాణిస్తున్నారు. వీరిలో సెలవులకు ఇంటికి వెళుతున్న యూనివర్సీటీ విద్యార్థులు కూడా ఎక్కువగా ఉన్నారు. ఈ రైలు తెంపీ సమీపంలో ఎదురుగా వస్తున్న కార్గో రైలును ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి మూడు బోగీల్లో మంటలు చెలరేగగా మరికొన్ని బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న భద్రతాసిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బాధితుల మృతదేహాలు 40మీటర్లు దూరంలో లభ్యమయ్యాయని భద్రతాసిబ్బంది తెలిపినట్లు ప్రభుత్వ మీడియా సంస్థ ఈఆర్‌టి తెలిపింది. ఏథెన్స్‌కు ఉత్తరాన 380కిలోమీటర్లు (285మైళ్లు) దూరంలో ఉన్న తెంపీ పట్టణానికి సమీపంలో ప్రమాదం జరిగింది. మూడు బోగీల్లో మంటలు చెలరేగాయి.దీంతో పలువురు ప్రయాణికులు రైలు కిటికీల నుంచి బయటపడి ప్రాణాలు దక్కించుకున్నారు. ప్యాసింజర్ రైలులో ఉన్న 350మందిలో చాలామంది గ్రీస్‌లోని కార్నీవాల్ నుంచి తిరిగి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిత్సాటకిస్ ప్రమాద స్థలాన్ని సందర్శించి కోలుకోవడానికి చర్యలు వేగవంతం చేయాలని కోరారు. మృతులను గుర్తించి ప్రభుత్వ తరఫున బాధిత కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు.

ఇటువంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రీస్ ప్రభుత్వం బుధవారం నుంచి మూడురోజులు సంతాప దినాలను ప్రకటించింది. కాగా ప్రమాదంలో మరణించినవారిలో 8మంది రైల్వే ఉద్యోగులు కూడా ఉన్నారు. వీరిలో కార్గో రైలుకు చెందిన ఇద్దరు డ్రైవర్లు, ప్యాసింజర్ రైలులోని డ్రైవర్లు ఉన్నారని గ్రీక్‌రైల్ రోడ్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ యన్నిస్ నిట్సాస్ తెలిపారు. క్షతగాత్రులు 66మంఇ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వీరిలో ఆరుగురు ఇంటెన్సివ్‌కేర్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.బాధితుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోందని అగ్నిమాపక సేవా ప్రతినిధి వాసిలిస్ వర్తకోయనిస్ తెలిపారు. ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడిన 200మందికి పైగా ప్రయాణికులను 130కిలోమీటర్ల దూరంలో ఉన్న థెస్సలోనికి బస్సుల్లో తరలించారు.

ప్రమాదానికి కారణాన్ని అధికారులు స్పష్టంగా వెల్లడించలేదు. అయితే సమీపంలోని లారిస్సా నగర స్టేషన్‌మాస్టర్‌ను దర్యాప్తులో భాగంగా బుధవారం అరెస్టు చేశారు. మరో ఇద్దరిని విచారించేందుకు అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News