ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా
సహాయక కేంద్రాలు
మనతెలంగాణ/హైదరాబాద్: రైళ్ల రాకపోకల రద్దుతో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ఈ రైళ్లలో రిజర్వేషన్ చేసుకున్న వారికి సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. అదనంగా అన్ని ప్రధాన స్టేషన్లలతో పాటు సాధారణ మార్గాల్లో మాత్రమే కాకుండా మళ్లీంచిన మార్గాల్లో కూడా ఈ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. వీటిలో సికింద్రాబాద్ , హైదరాబాద్, విజయవాడ, నిజామాబాద్, వరంగల్, కాజీపేట, కరీంనగర్, ఖమ్మం, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్, రామగుండం, ఒంగోలు, సామర్లకోట, రాజమండ్రి స్టేషన్‌లలో సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
సికింద్రాబాద్ (040-27801111/27786666), కాజీపేట (08702576430), విజయవాడ (0866-2576924), గూడూర్ (7815909300) మొదలైన ముఖ్యమైన స్టేషన్‌లలో ఈ హెల్ప్‌లైన్ నెంబర్లు ఏర్పాటు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికుల సమాచారం కోసం రైళ్ల రాకపోకల మార్పు గురించి అన్ని స్టేషన్‌లలో తరచుగా పబ్లిక్ అనౌన్స్‌మెంట్‌లు చేయనున్నట్టు వారు తెలిపారు. దీంతోపాటు రద్దు అయిన ప్రయాణికులకు ఛార్జీలు వాపసు చేయనున్నట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది.
పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్న జిఎం
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రైళ్ల రాకపోకలను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, అన్ని భద్రతా చర్యలను సక్రమంగా చేపట్టాలని ఆయన అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ప్రయాణికులకు కనీస అసౌకర్యం కూడా కలగకుండా చూడాలని సాధారణ రైలు కదలికల్లో ఏవైనా మార్పుల గురించి ప్రయాణికులకు సకాలంలో సమాచారం అందించాలని ఆయన సూచించారు. వివిధ స్థాయిల్లోని అధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జనరల్ మేనేజర్ ఆదేశించారు.