ఈ కేంద్రం ద్వారా వచ్చే నాలుగేళ్లలో 50 వేల మంది యువతకు శిక్షణ
ఎంఎస్ ఎంఈ కొత్త విధానంలో మహిళలు, దళితులకు ప్రాధాన్యత
ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్ లో తైవాన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు
తెలంగాణా ఐటీ, పరిశ్రమల శాఖ, తైవాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వైపాక్షిక ఒప్పందపై సంతకాలు
మన తెలంగాణ / హైదరాబాద్ : అహ్మదాబాద్ లోని ఎంట్రెప్రెన్యూర్ షిప్ డెవలప్‌మెంట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఇడిఐఐ) భాగస్వామ్యంతో తెలంగాణాలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల శిక్షణ కేంద్రం ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం ఆసక్తితో ఉందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. మంగళవారం ఇడిఐఐ డైరెక్టర్ జనరల్ డా. సునీల్ శుక్లా మంత్రిని కలిసి తమ సంస్థ చేపట్టనున్న కార్యక్రమాలకు సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించారు. ఈ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ, వివిధ సంస్థల భాగస్వామ్యంతో ఒక కన్సార్టియం నెలకొల్పుతుందని శ్రీధర్ బాబు తెలిపారు. దేశంలో ఇడిఐఐ శిక్షణ కేంద్రాలు 17 రాష్ట్రాల్లో ఇప్పటికే ఏర్పాటయ్యాయని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణాలో ఏర్పాటు చేసే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల శిక్షణ కేంద్రం ద్వారా వచ్చే నాలుగేళ్లలో 50 వేల మంది యువతకు మధ్య, చిన్న,తరహా, సూక్ష్మ పరిశ్రమలు నెలకొల్పేందుకు అవగాహన, శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తామని ఆయన వివరించారు. ఏటా కనీసం 5 వేల మంది సొంతంగా ఉపాధి కల్పించుకునేలా, శిక్షణ తర్వాత 6 నెలల వరకు ఇడిసి సహకారం అందిస్తుందని చెప్పారు. కోవిడ్ సమయంలో అమ్మకాలు లేక నష్టపోయిన ఎంఎస్ ఎంఈ లకు ఆర్థిక సహకారం అందించి కోలుకునేలా చేస్తామని శ్రీధర్ బాబు వెల్లడించారు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థల తరహాలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓఎన్ డీసీ ప్లాట్ ఫాం ద్వారా ఉచితంగా మార్కెంటింగ్ చేసుకోవచ్చని తెలిపారు. బేటీలో ఇడిఐఐ గోవా ఎంట్రప్రెన్యూర్ షిప్ డెవలప్ మెంట్ సెంటర్ ఇన్ ఛార్జి డా. అబ్దుల్ రజాక్ కూడా పాల్గొన్నారు.
ఎంఎస్ ఎంఈ కొత్త విధానంలో మహిళలు, దళితులకు ప్రాధాన్యత : రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మధ్య, చిన్న తరహా, సూక్ష్మ పరిశ్రమల (ఎంఎస్ ఎంఈ) విధానంలో మహిళలు, వెనకబడిన తరగతుల వారు, దళిత పారిశ్రామిక వేత్తలకు నిర్దేశించిన ప్రయోజనాలు అందేలా చూడాలని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచించారు. మంగళవారం నాడు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన రాష్ట్ర స్థాయి జిల్లా పరిశ్రమల కేంద్రాల జనరల్ మేనేజర్ల సమావేశంలో ప్రసంగించి కొత్త పాలసీ అమలుకు సంబంధించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేసిన ఎంఎస్‌ఎంఈ కొత్త విధానం హ్యాండ్ బుక్ ను ఆవిష్కరించారు.
ఇందులో ఎంఎస్ ఎంఈ పథకాల వివరాలు, ప్రభుత్వ రాయితీలు, రుణాలు పొందేందుకు ఉండాల్సిన అర్హతలు, దరఖాస్తు చేసే విధానంతో సహా అన్ని వివరాలు ఉన్నాయని శ్రీధర్ బాబు వెల్లడించారు. పరిశ్రమల ఏర్పాటులో వృద్ధి సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ఎంఎస్ ఎంఈ ల అధికారులు సమన్వయంతో పనిచేయలని ఆదేశించారు. బీసీ లు ప్రధాన లబ్దిదారులుగా ఉన్న పిఎం విశ్వకర్మ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని సూచించారు. మరో పదేళ్లలో రాష్ట్ర బడ్జెట్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు పరిశ్రమల శాఖదే కీలక బాధ్యత అని ఆయన చెప్పారు. రాష్ట్రంలో క్లస్టర్ల అభివృద్ధి కోసం, కేంద్ర ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకోవడంపై పరిశ్రమల శాఖ అధికారులు దృష్టి పెట్టాలన్నారు. జైకా మద్ధతుతో చేపడుతున్న ఎంఎస్‌ఎంఈ పథకాలు గరిష్ట స్థాయిలో కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని శ్రీధర్ బాబు కోరారు. ఎంఎస్‌ఎంఈ కోసం అందుబాటులో పలు స్కీములు, మార్కెటింగ్ పద్ధతులు, శిక్షణకు సంబంధించిన పలు అంశాలపై కేంద్ర, రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు.
రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ డా. మల్సూర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన, సమీక్షా సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎస్. స్వామినాథన్, రామానంద శుక్లా, గౌరి మోన్వాని, ఆర్. శ్రీనివాస్, రవివర్మ, బావయ్య తదితరులు పాల్గొన్నారు. కొత్త ఎంఎస్ ఎంఈ విధానం అమలుపై జిల్లా పరిశ్రమ కేంద్రాల జిఎంలతో ఏర్పాటు చేసిన సమావేశంలో లో హ్యాండ్ బుక్‌ను మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లో పరిశ్రమల శాఖ అదనపు డైరెక్టర్ రాజ్ కుమార్, కేంద్ర ఎంఎస్ ఎంఈ రీజనల్ హెడ్ శ్రీనివాసరావు, పరిశ్రమల శాఖ కమిషనర్ డా. మల్సూర్, కేంద్ర ప్రభుత్వ ఎంఎస్ ఎంఈ అడిషనల్ కమిషనర్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ లో తైవాన్ ఇండస్ట్రియల్ పార్క్ : తైవాన్ నుంచి పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా తెలంగాణా ఐటీ, పరిశ్రమల శాఖ, తైవాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థలు ద్వైపాక్షిక సహకార ఒప్పందపై సంతకాలు చేశాయి. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుంది. మంగళవారం రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీజీఐఐజీ) కార్యాలయంలో ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీ విష్ణవర్ధన్ రెడ్డి, టీసీసీ ఉపాధ్యక్షుడు సైమన్ లీ మధ్య ఈ ఎంఓయూ జరిగింది.
తైవాన్ నుంచి పెట్టుబడులను రాబట్టేందుకు టీసీసీ హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. తైవాన్ కంపెనీలు రాష్ట్రంలోకి ప్రవేశించడంలో టీసీసీ కీలక మాధ్యమంగా నిలుస్తుంది. హైదరాబాద్ లో తైవాన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం ఇప్పటికే రూపకల్పన జరిగింది. మార్కెట్ ఎంట్రీ అధ్యయనాలు, పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహిచడం, తెలంగాణాను అంతర్జాతీయంగా ప్రమోట్ చేయడం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో ఇండియా -తైపీ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ మన్హర్ సింగ్ యాదవ్ పాల్గొన్నారు.