మనతెలంగాణ/ హైదరాబాద్ : బిఎస్‌సి- ఏరోనాటిక్స్, బిఎస్‌సి- ఏవియేషన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీ కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు ఏవియకాన్స్ సంస్థ అధిపతి వి. సత్యభూషణరావు తెలిపారు. శుక్రవారం బేగంపేట్‌లో గ్రీన్‌పార్క్‌లో జరిగిన కార్యక్రమంలో ఏవియేషన్ శిక్షణలో హైదరాబాద్‌లో అగ్రగామిగా ఉన్న ట్రాన్స్ ఏవియాకాన్స్, సింగపూర్‌కు చెందిన ఎంబ్రీ రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీతో కలిసి సంయుక్త ఏవియేషన్ మేనేజ్‌మెంట్‌లో రెండు బ్యాచిలర్స్ డిగ్రీలను అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూలై నుంచి ఈ కోర్సులతో పాటు మరో ఏడు ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఏవియేషన్-సంబంధిత కెరీర్‌లలో పనిచేయాలనుకునే విద్యార్థుల కోసం ఈ డిగ్రీ కోర్సులను రూపొందించారని తెలిపారు. ఈ కార్యక్రమం ఏవియేషన్ అక్రిడిటేషన్ బోర్డ్ ఇంటర్నేషనల్ (ఎఎబిఐ)చే గుర్తింపు పొందిందన్నారు. కోర్సులో 40 మందితో బ్యాచ్ ఏర్పాటు చేసి, ఈ శిక్షణను భారత్‌తో పాటు విదేశాల్లో ఇవ్వనున్నామని తెలిపారు. భారత్ ప్రపంచంలో తొమ్మిదో -అతిపెద్ద పౌర విమానయాన మార్కెట్‌గా ఉందని, 2030 నాటికి ఇది అతిపెద్ద ప్రపంచ మార్కెట్‌గా అవతరించబోతోందన్నారు.
విమానయాన పరిశ్రమ వృద్ధి , అభివృద్ధి నైపుణ్యం కలిగిన నిపుణుల లభ్యతపై ఎక్కువగా ఆధారపడి ఉందన్నారు. అవగాహన, సరైన మార్గదర్శకత్వం లేకపోవడంతోనాణ్యమైన విద్యకు సంబంధించిన ఖర్చు కారణంగా చాలా మంది యువకులకు విమానయానం విద్యకు దూరంగా ఉండాల్సి వస్తుందన్నారు. భారత్ విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందుబాటులో ఉంచే ప్రయత్నం చేశామని ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు వేయి మంది విద్యార్థులకు ఏవియకాన్స్ సంస్థ శిక్షణ నిచ్చిందని డైరెక్టర్ టీనా మెరీనా తెలిపారు. ఎంబ్రీ రిడిల్ ఏరోనాటికల్ యూనివర్శిటీ వందేళ్ల చరిత్ర కలిగి ఉందన్నారు. సమావేశంలో శిక్షణ అధిపతి అబిల్ అబ్రహం, ఆపరేషన్స్ డైరెక్టర్ కిరిట్ మానెక్ పాల్గొన్నారు.