Monday, December 23, 2024

రెండు వారాల్లో ఎన్నికల సిబ్బందికి శిక్షణ పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

ఎన్నికల్లో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు చేపట్టాలి: సీఈవో వికాస్‌రాజ్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పీఓలు, ఏపీఓలకు మినహా అన్ని రకాల శిక్షణలను రెండు వారాల్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాస్టర్ ట్రైనర్లను ఆదేశించారు. డీఎల్‌ఎంటీల కోసం తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో వచ్చిన అనుభవాన్ని తమ శక్తి మేరకు వినియోగించుకుని, పొరపాట్లు జరగకుండా ఎన్నికలు నిర్వహించేలా చూడాలని సూచించారు. డేటా ఎంట్రీ, స్ట్రాంగ్ రూమ్‌ల నుండి ఇవిఎంలు, వివిపాట్ల తరలింపు, పోలింగ్ తర్వాత వాటిని మళ్లీ సరైన స్థలంలో సురక్షితంగా ఉంచడం, ఎంసిసి రిపోర్టింగ్, వెబ్‌కాస్టింగ్ వంటి కొన్ని కీలకమైన అంశాల శిక్షణలో ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి దాని విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నది క్షేత్ర స్థాయిసిబ్బంది, కింది స్థాయిలో సబార్డినేట్ సిబ్బందిని అన్ని రకాలుగా సన్నద్ధం చేయాలని సూచించారు.

అవసరమైన సమాచారం, మార్గదర్శకాలను ఇప్పటికే ముద్రించి పంపిణీ చేయడం జరిగిందని, ఎన్నికలు ముగిసే వరకు అన్ని స్థాయిలలోని వ్యక్తులందరికీ అవసరమైనప్పుడు తన వైపు నుండి సహాయ సహకారాలు, ఇతరత్రా మార్గదర్శకాలను అందిస్తామని భరోసా ఇచ్చారు. ఎన్నికలను సజావుగా, సక్రమంగా నిర్వహించేందుకు ప్రతి పనిని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అడిషనల్ సిఇఓ, జాయింట్ సిఇఓ కూడా మాస్టర్ ట్రైనర్‌లకు వారి మార్గదర్శకాలను, సలహాలు, సూచనలను అందించారు. రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది ఓటర్లతో ఎన్నికల నిర్వహణ వంటి భారీ కార్యక్రమానికి ముందుగా శారీరకంగా, మానసికంగా సంసిద్ధంగా ఉండటం, అలాగే నిర్వహణలో ఎవరి పాత్ర ప్రాముఖ్యత గురించి వారు తెలుసుకుని ఉండాలంటూ తొలుత డిప్యూటీ సిఇఓలు అబ్దుల్, హరి సింగ్ శిక్షకులకు అవగాహన కల్పించారు.

ఎన్నికల నిర్వహణ బృందం పాత్ర, పోలింగ్ రోజు ఏర్పాట్లు, పోలింగ్ స్టేషన్ నిర్వహణపై కృష్ణ కుమార్, హెచ్.ఎం వివరించారు. ఎంసిసి, ఎంసిఎంసి, పెయిడ్ న్యూస్, ఈ-రోల్ మొదలైన వాటిపైసాయి రామ్, ఆర్డీఓ విశదీకరించగా,వెంకట్ రెడ్డి ఆర్డీఓ- జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళిక, వల్నరబిలిటీ మ్యాపింగ్‌పై చాలా అంశాలను వివరించారు. ఖర్చుల పర్యవేక్షణపై ఎన్. వెంకట్ పలు విషయాలను బోధించారు. ఇవిఎం, వివిపాట్, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన, పోస్టల్ బ్యాలెట్,ఇటిపిబిలు మొదలైన అంశాల నిర్వహణను ఆర్డీఓ రాజేశ్వర్ వివరించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలపై వినయ్ కుమార్ ఎన్.టి సమగ్ర అవగాహన కల్పించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News