హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ ఇంజనిర్స్ అసోసియేషన్(టిఈఈఎ) భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని ప్రభాకర్ రావు ట్రాన్స్ కో, జెన్ కో సిఎండీ అన్నారు. నూతనంగా నిర్మిస్తున్న భవనానికి ప్రొఫెసర్ జయశంకర్ భవనంగా పేరు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. ఈరోజు ఒక శుభదినం, ఈ భవనాన్ని వచ్చే దసరా లోపు పూర్తి చేసుకోవాలని ఆశిస్తున్నానన్నారు. గత వారంలో దేశవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది కానీ.. రాష్ట్రంలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేశామన్నారు. మన పక్క రాష్ట్రంలో కూడా విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని, కానీ రాష్ట్రంలో ముందస్తు చర్యల వలన ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. సిఎం కెసిఆర్ మార్గనిర్దేశం, మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో రైతాంగానికి, వినియోగదారులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు తగ్గినప్పటికీ రాష్ట్రంలో ముందుగానే బొగ్గును సమకూర్చుకున్నామని, దానితో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని ప్రభాకర్ రావు తెలిపారు.
Transco and Genco CMD Prabhakar Rao speech