ఆమనగల్లు: ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీలు సహజమని ఆమనగల్లు సీఐ జె.వెంకటేశ్వర్లు అన్నారు. ఏ ఉద్యోగంలోనైనా బదిలీలు సహజమని, కాని తాను చేసిన పనితీరును బట్టి అక్కడ ప్రజల మనస్సులో ఉండిపోతారని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ పూలే జ్ఞాన గ్రంథాలయం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని కళ్యాణిగార్డెన్‌లో ఆమనగల్లు సీఐగా విధులు నిర్వర్తించి, ఇటీవల బదిలీపై వెళ్లిన సీఐ జాల ఉపేందర్‌కు సన్మాన, అభినందన సభను నిర్వహించారు.
కోఆర్డినేటర్ జి.సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు ఆమనగల్లు సీఐ జె.వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బదిలీపై వెళ్లిన ఉపేందర్‌ను ప్రజా సంఘాల నాయకులతో కలిసి పూలమాలలు, శాలువాలతో సత్కరించి అభినందించారు. గత రెండున్నర సంవత్సరాలుగా ఆమనగల్లు సర్కిల్‌లో ప్రజలకు ఎన్నో విశేష సేవలు అందించారని తెలిపారు. విధి నిర్వాహణలో ఉపేందర్ ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారని, ఉత్తమ పనితీరు కనభర్చి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నారని ఈ సందర్భంగా వక్తలు కోనియాడారు.
ఆయన భవిష్యత్తులో మరింత పేరు గడించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ పాత్రికేయులు సత్యనారాయణ, చింతలపల్లి సర్పంచ్ కోప్పు మంజుల యాదయ్య, మాజీ ఎంపీపీ రఘురాములు, ప్రముఖ సంఘసేవకుడు పాపిశెట్టి రాము, దరువుల శంకర్, డేవిడ్, దేవేందర్‌రావు, విఠాయిపల్లి రమేష్, వెంకటపురం శివ, శ్రీకాంత్, రమేష్, విజయ్, ప్రభాకర్, అగ్నిమాపక అధికారి కృష్ణమూర్తి, కృష్ణ, జనిగల గిరియాదవ్, శ్రీపాతి వెంకటేష్, తలకోండపల్లి ఎసై వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.