గ్రేడింగ్‌లో అవకతవకలు జరిగాయంటూ ఉద్యోగుల ఆందోళన !
కొందరు సిఎస్‌ను తప్పుదారి పట్టించారు…
జోనల్ వ్యవస్థను వ్యతిరేకంగా ఈ బదిలీలు జరిగాయి: ఉద్యోగుల ఆరోపణ’
హైదరాబాద్: రాష్ట్ర వాణిజ్య శాఖలో భారీగా పదోన్నతులు, బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 71 మంది పేర్లతో కూడిన జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో 7మందికి అదనపు కమిషనర్లుగా, 24 మందికి ఉప కమిషనర్లుగా, 40 మందికి సహాయ కమిషనర్లుగా పోస్టింగ్‌లు ఇచ్చింది. అయితే ఈ బదిలీల్లో అవకతవకలు జరిగాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు, ఉన్నతాధికారులు ఆరోపిస్తున్నారు. జోనల్ వ్యవస్థను వ్యతిరేకంగా ఈ బదిలీలు జరిగాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై త్వరలో సిఎం కెసిఆర్‌కు ఫిర్యాదు చేస్తామని వారు పేర్కొంటున్నారు. అయితే ఈ శాఖలో జరిగిన బదిలీలను ప్రభుత్వం రాష్ట్ర స్థాయి పోస్ట్‌గా పరిగణలోకి తీసుకొని ఆర్‌డిఓ, డిఎస్పీలను బదిలీ చేసిన విధంగా జోనల్‌ను మార్చుతూ బదిలీ చేసింది. దీనివల్ల తమకు, తమ జిల్లాలకు అన్యాయం జరుగుతుందంటూ ఆయా జిల్లాల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
85 మంది సిటిఓలు రెండు రోజుల్లో బదిలీలు
ఈ శాఖలో పనిచేసే కొందరు ఉన్నతాధికారులు పదోన్నతులు, బదిలీలకు సంబంధించి సిఎస్‌ను తప్పుదారి పట్టించారని ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ శాఖలో ఉద్యోగుల పనితీరు ఆధారంగా గ్రేడింగ్‌ను ఇస్తారు. ఆ గ్రేడింగ్ ఆధారంగా వారికి బదిలీలను చేశారు. అయితే ఈ గ్రేడింగ్ కంప్యూటర్ ఆధారంగా ఉంటుంది. దీనికి ఇన్‌చార్జీగా వ్యవహారించే ఓ ఉన్నతాధికారి ఆయనకు నచ్చిన వ్యక్తులకు మంచి గ్రేడింగ్ ఇచ్చి మిగతా వారికి తక్కువ గ్రేడింగ్ ఇచ్చి బదిలీల్లో ఆయన అనునూయులకు మంచి పోస్టింగ్‌లను ఇప్పించుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి. సోమవారం సాయంత్రం 71 మందికి పోస్టింగ్‌లను ఇచ్చిన ప్రభుత్వం మంగళవారం మరో 85 మంది సిటిఓలతో మరో 20 మందికి పదోన్నతులు, బదిలీలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
71 మంది అధికారులకు పోస్టింగ్
రెండేళ్ల క్రితం పదోన్నతులు పొంది దీర్ఘకాలికంగా ఒకే చోట పనిచేస్తున్న వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పోస్టింగ్‌లు ఇచ్చింది. 7 అదనపు కమిషనర్లు, 24 మంది ఉప కమిషనర్లు, 40 మంది సహాయ కమిషనర్లకు మొత్తం 71 మంది అధికారులకు పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరితో పాటు మరో 85 మంది సిటిఓలను ప్రభుత్వం బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ రెండురోజుల్లో మొత్తం సుమారుగా 300ల మంది ఉద్యోగుల బదిలీలను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గడిచిన నాలుగైదు సంవత్సరాలుగా జిల్లాల్లో పని చేస్తున్న అధికారులను హైదరాబాద్‌కు ఇక్కడ పని చేస్తున్న ఉద్యోగులను జిల్లాలకు బదిలీ చేస్తూ సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏడుగురు అదనపు కమిషనర్‌లు…
ఏడుగురు అదనపు కమిషనర్‌లలో ఎకనామిక్ అడిట్ యూనిట్ అదనపు కమిషనర్‌గా ఎస్.వి.కాశీ విశ్వేశ్వర రావు, ఎన్‌ఫోర్స్‌మెంట్ అదనపు కమిషనర్లుగా ఎస్.జయకామేశ్వరి, సాయికిషోర్, ఆడిట్స్, జీఎస్టీ పాలసీ విభాగపు అదనపు కమిషనర్‌గా ఫణీందర్ రెడ్డి, లీగల్ విభాగపు అదనపు కమిషనర్‌గా ద్వారకానాథ్ రెడ్డి, ఎస్టాబ్లిష్‌మెంట్ అదనపు కమిషనర్‌గా వై.సునీతలను నియమించారు.
12 డివిజన్లకు 12 మంది డిప్యూటీ కమిషనర్లు
అదేవిధంగా రాష్ట్రంలోని 12 డివిజన్లకు 12 మంది డిప్యూటీ కమిషనర్లను, ముగ్గురిని అడిట్ డిసిలుగా, మిగిలిన వారిని కమిషనర్ కార్యాల యానికి బదిలీ చేశారు. డివిజన్‌ల వారీగా నియామకమైన 24 మంది వాణిజ్య పన్నుల శాఖ ఉప కమిషనర్‌లకు పోస్టింగ్‌లు ఇచ్చారు. వ్యాట్ ట్రైబ్యునల్ ఉప కమిషనర్‌గా శ్రీనివాసులు, మాదాపూర్ డివిజన్ ఉప కమిషనర్‌గా కె.గీత, అబిడ్స్ డిసిగా-జి.లావణ్య, మల్కాజిగిరి-కి శాంతకుమారి, సికింద్రాబాద్‌కు -వాసవి జగన్నాథం, పంజాగుట్ట-కు దీపారెడ్డి , వరంగల్-కు రాజేష్ కుమార్, సరూర్‌నగర్‌కు -పి.నాయనార్, హైదరాబాద్ రూరల్-కు రామకృష్ణారావు, చార్మినార్-కు అమర్ నాయక్, బేగంపేట్-కు శశిధరాచారి, నల్గొండకు- రాధాకృష్ణ, నిజామాబాద్-కు ఏడుకొండలు, ఆదిలాబాద్‌కు -టి.శ్రీనివాస్, పంజాగుట్ట అడిట్‌కు డిసి (ఏడిసి)గా సుధాకర్ రెడ్డి, సికింద్రాబాద్ అడిట్‌కు డిసి (ఏడీసీ)గా ఆనంద్‌కుమార్, హైదరాబాద్ రూరల్ ఏడిసిగా శ్రీలీలలను నియమించారు.