అమరావతి: మంగళగిరి ప్రజల ప్రేమను ఎప్పటికి మరచిపోలేనని ఎపి మంత్రి నారా లోకేష్ తెలిపారు. మంగళగిరి ‘మన ఇల్లు- మన లోకేష్’ తొలిదశ కార్యక్రమం చివరిరోజుకు చేరిందన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..3 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలపై పంపిణీ కార్యక్రమం నేటితో పూర్తయిందని చెప్పారు. మంగళగిరిలో ఏడాదిలో 3 వేల మందికి ఇళ్ల పట్టాలు, పేదలకు రూ. వెయ్యి కోట్ల విలువైన భూమి ఇచ్చామని తెలియజేశారు. మంగళగిరి.. అన్నిరంగాల్లో ముందుండేలా చూసే బాధ్యత నాది అని వెల్లడించారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వందపడకల ఆస్పత్రి నిర్మిస్తామని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సొంతనిధులతో 26 కార్యక్రమాలు చేపట్టామని, రాబోయే కాలంలో మంగళగిరి పూర్తిగా మారబోతోందని సూచించారు. దేశంలోనే నెం.1గా ఉండేలా మంగళగిరిని మారుస్తామని చెప్పారు. మంగళగిరి నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. వంద పడకల ఆస్పత్రిని ఏడాదిలో పూర్తి చేస్తామని, ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా 100 పడకల ఆస్పత్రిని నిర్మిస్తామని లోకేష్ స్పష్టం చేశారు.