Thursday, January 16, 2025

లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలి

- Advertisement -
- Advertisement -

గ్రామ సభల ద్వారా అర్హులను గుర్తించాలి : సిఎస్ శాంతి కుమారి
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న నాలుగు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితా ఈనెల 21 నుండి నిర్వహించే గ్రామ సభలలో ఆమోదం పొందాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ఈనెల 26న ప్రారంభించనున్న ందున ఇందుకు సంబంధించిన కార్యాచరణపై సిఎస్ బుధవారం జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ ఈ నాలుగు ప్రతిష్టాత్మక పథకాలకు లబ్దిదారుల ఎంపికలో ఏవిధమైన అపోహలకు తావివ్వకూడదని స్పష్టం చేశారు. ఈ పథకాలన్నీ నిజమైన అర్హులకే దక్కేలా పకడ్భందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

రైతు భరోసాకు సంబంధించి భూముల వివరాలను రెవిన్యూ శాఖ ద్వారా వ్యవసాయ శాఖకు పంపడం జరిగిందని, సాగు యోగ్యంకాని భూములను క్షేత్ర స్థాయిలో తనిఖీ నిర్వహించాలని అన్నారు. సంయుక్త సందర్శనలు నిర్వహించి, గ్రామసభల్లో వ్యవసాయ యోగ్యం కాని భూముల వివరాలు ప్రదర్శించి, చదివి వినిపించి ఆమోదం పొందాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి, ఉపాధిహామీ పథకంలో కనీసం 20 రోజులు పనిచేసిన భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాల జాబితాను, గ్రామ సభల్లో ప్రకటించి ఆమోదం పొందాలని సిఎస్ తెలిపారు. రేషన్ కార్డుల మంజూరీకి రూపొందించిన లబ్ధిదారుల ముసాయిదా జాబితా గ్రామసభల్లో ఆమోదం పొందాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విషయంలో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా లబ్ధిదారుల ముసాయిదా జాబితాను గ్రామాలలో ప్రదర్శించాలన్నారు.

గ్రామీణ ప్రాంతాలలో గ్రామపంచాయతీల వారిగా, పట్టణ ప్రాంతాల్లో వార్డుల వారిగా సభలు నిర్వహించాలని సిఎస్ శాంతి కుమారి కలెక్టర్‌లకు సూచించారు. జిహెచ్‌ఎంసి పరిధిలో లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున లబ్ధిదారుల జాబితా ఎంపిక, డాటా ఎంట్రీ, క్షేత్ర స్థాయి వెరిఫికేషన్ తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిహెచ్‌ఎంసి కమీషనర్ ను ఆదేశించారు. ఇప్పటివరకు ఈ నాలుగు పథకాలకు సంబంధించి క్షేత్ర స్థాయి పరిశీలన, ప్రత్యేక బృందాల ఏర్పాటు, ముసాయిదా జాబితా తయారీ, డేటా ఎంట్రీ ఏర్పాట్లు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు చేసిన ప్రత్యేక శ్రద్ధని సిఎస్ అభినందించారు. ఈ నాలుగు పథకాల అమలుకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక అనుగుణంగా అమలయ్యేలా సంబంధిత కార్యదర్శులు పర్యవేక్షించాలని సిఎస్ శాంతి కుమారి ఆదేశించారు. ఈ టెలి కాన్ఫరెన్స్‌లో రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డి.ఎస్. చౌహాన్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి బుద్ధప్రకాష్, పంచాయితీ రాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, అన్ని జిల్లాల కలెక్టర్లు, జిహెచ్‌ఎంసి కమిషనర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News