అన్ని దానాల కన్నా అవయవదానం ఎంతో మహోన్నతమైనది. గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు వంటి కీలకమైన అవయవాలను కోల్పోయి చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న అభాగ్యులకు అవయవ దానం జరిగితే వారికి పునర్జన్మ లభించినట్టే. అవయవ మార్పిడికి సంబంధించి 1994 నాటి చట్టానికి సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2014 లో తీసుకొచ్చిన టిహెచ్‌ఒటిఎ తోటా ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హూమన్ ఆర్గన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్) చట్టాన్ని అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గత సోమవారం శాసనసభలో ఆమోదించడం గొప్ప విశేషం.
దీని వల్ల అవయవ దానాలు, మార్పిడులు ఎలాంటి అడ్డంకులు లేక వేగంగా ముందుకు సాగడానికి మార్గం ఏర్పడింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిర్వహిస్తున్న ఈ జీవన్‌దాన్ కార్యక్రమం ఇప్పుడు విస్తరణకు నోచుకుంటోంది. అయితే ఈ పేరు కొనసాగుతుందో లేక మారుతుందో చెప్పలేం కానీ ఇది స్టేట్ ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ (ఎస్‌ఒటిఒ సోటో) గా రూపాంతరం చెందుతుంది. ఆయా రాష్ట్రాల పరిధిలో నేషనల్ ఆర్గన్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రోగ్రామ్ విధానాల కింద అవయవ దాతలు, గ్రహీతల వివరాలతో రిజిస్ట్రీ నిర్వహిస్తారు.
కావలసిన వారికి అవయవాల కేటాయింపు, తదితర విధులను పక్కాగా అమలు చేస్తారు. ఈ సోటో కీలక బాధ్యతలు దాతలు, గ్రహీతల రికార్డులను పక్కాగా నిర్వహించడమే కాదు అవయవ మార్పిడి సక్రమంగా జరిగేలా అజమాయిషీ చేస్తారు. దీనికి తగ్గట్టు రాష్ట్రంలో అవయవ మార్పిడి కేంద్రాలని నిర్వహిస్తారు. బ్రెయిన్ డెడ్ రోగుల విషయంలో సంబంధిత కుటుంబ సభ్యులను ఒప్పించి, అవయవ దానం ప్రోత్సహిస్తారు. కావలసిన అవయవాలను సేకరించే బాధ్యత తీసుకుంటారు. అలాగే అవయవ దాతలు, గ్రహీతల మధ్య అనుసంధానం బలోపేతం చేస్తారు. ఇప్పుడు రాష్ట్రం లో అవయవ సేకరణ కేంద్రాలు ఎక్కువగా ఏర్పాటవుతాయి. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ సౌకర్యం ఉన్న ప్రైవేట్, జిల్లా ఆస్పత్రులు అవయవాలను సేకరించి భద్రపర్చవచ్చు. ‘తోటా’ వల్ల ఇది వరకు ఉండే నిబంధనలు కొన్ని సరళీకృతం అయ్యాయి.
బ్రెయిన్ డెడ్ అయిన లేదా మరణించిన వారి నుంచి అవయవాలను సేకరించి, మార్పిడి చేసేందుకు వీలుగా నిబంధనల్లో మార్పులు జరిగాయి. ఒక కుటుంబంలోని సభ్యులు ఎవరైనా అవయవ దానం చేయడానికి తోటా అనుమతిస్తుంది. కొన్ని రకాల జన్యుపరమైన సమస్యల వల్ల పిల్లలకు కాలేయ మార్పిడి చేయాల్సి వచ్చినప్పుడు వారి తాతలు, అమ్మమ్మలు సులువుగా కాలేయ దానం చేయవచ్చు. 1995 నాటి నిబంధనల ప్రకారం బ్రెయిన్‌డెడ్‌ను ప్రకటించే అధికారం న్యూరోసర్జన్లు, న్యూరోఫిజీషియన్లకు మాత్రమే ఉండేది. ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం ఫిజీషియన్, సర్జన్, ఇంటెన్సివిస్ట్, అనస్థీషియన్ కూడా బ్రెయిన్ డెడ్‌ను ప్రకటించడానికి అర్హులు. అలాగే అవయవాలను అక్రమ రవాణా లేదా అక్రమ మార్పిడి చేస్తే రూ. 5 వేలు వరకు జరిమానా, మూడేళ్ల వరకు జైలుశిక్ష విధించేవారు.
ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం జరిమానా రూ. కోటి వరకు, జైలుశిక్ష పదేళ్ల వరకు పెంచారు. గతంలో అవయవ దానం అంటే చనిపోయిన వారి కళ్లు దానం చేయడం మాత్రమే అనుకునేవారు. కానీ పదేళ్లలో ప్రజల్లో అవగాహన పెరగడంతో కళ్లతోపాటు ఇతర అవయవ దానాలు కూడా పెరిగాయి. 2020 నుంచి అవయవ దానం చేసిన వారిని పరిశీలిస్తే 41 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వారే ఎక్కువగా ఉన్నారు.గత ఐదేళ్లలో 41 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు వారు 187 మంది అవయవ దానం చేశారు. 51 నుంచి 60 ఏళ్ల లోపు వారు 190 మంది, 61 నుంచి 70 ఏళ్ల వయసు వారు 88 మంది ఉన్నారు. అవయవ దానం చేసిన యువకుల్లో 21 నుంచి 30 ఏళ్ల లోపు వారు 149 మంది, 31 నుంచి 40 ఏళ్లలోపు వారు 140 మంది ఉన్నారు.
1 నుంచి 10 ఏళ్ల లోపు వారు ఆరుగురు, 11 నుంచి 20 ఏళ్ల లోపు వారు 64 మంది ఉన్నారు. 71 నుంచి 78 ఏళ్ల లోపు వారు 36 మంది ఉంటే, 81 ఏళ్లు పైబడినవారు 2020 లో ఇద్దరు, 2023లో ఒక్కరు తమ అవయవాలను దానం చేశారు. 2020 నుంచి అవయవ దానం చేసిన 863 మందిలో మహిళలు 672 మంది కాగా, పురుషులు కేవలం 191 మంది మాత్రమే ఉండడం గమనార్హం. దేశం మొత్తం మీద అవయవ మార్పిడిలో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది.తమిళనాడులో మిలియన్ జనాభాకు 1.9% వంతున అవయవ మార్పిడి ఉంటోంది. ఇది జాతీయ సగటు 0.65 శాతం కన్నా ఎక్కువ. తెలంగాణలో కూడా దీనిపై చైతన్యం పెరిగింది. ఏటా 700 సగటుతో అవయవ మార్పిడి కేసులు నమోదవుతున్నాయి. గత పదేళ్లలో రాష్ట్రంలో అవయవ దానం చేసిన వారి సంఖ్య 1594 వరకు ఉంది.
అవయవ మార్పిడి ద్వారా గత పన్నెండేళ్లలో 6 వేల మంది పునర్జన్మ పొందారు. ఈ ఆరు వేల మందిలో అత్యధికంగా 2394 మందికి కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు జరగ్గా, 1462 మందికి కాలేయం (లివర్) మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. 2013 నుంచి రాష్ట్రంలో గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు కూడా జరుగుతున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 218 మందికి గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు జరగ్గా, 2017, 2022లో వరుసగా, 32, 31 వంతున గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. ఇంకా అవయవ మార్పిడి కోసం రాష్ట్ర ప్రభుత్వ జీవన్‌దాన్ కార్యక్రమం కింద 3823 మంది నమోదు చేసుకున్నారు. దీనిని బట్టి రాష్ట్రంలో అవయవ మార్పిడిపై ప్రజల్లో అవగాహన పెరిగిందని చెప్పవచ్చు.