Wednesday, January 22, 2025

హరిత పన్ను చెల్లింపులో నిర్లక్ష్యం?

- Advertisement -
- Advertisement -

Transport Department take steps to ensure that motorists pay green tax

 

మనతెలంగాణ/హైదరాబాద్ : పదిహేను ఏళ్లు దాటిన వాహనాలను ఇంకా వాడుతున్నారా ? అయితే మీ చేతి చమురు వదిలినట్టే… కాలుష్య కట్టడిలో భాగంగా పదిహేను సంవత్సరాలు దాటిన వాహనాలను తుక్కు కింద మార్చుకోవాలని గతంలో కేంద్రం సూచించింది. అయినా చాలామంది వాటిని అలాగే వాడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆ వాహనాలకు సంబంధించి రీ రిజిస్ట్రేషన్ పెంపుతో పాటు హరిత పన్నును గతం కన్నా అధికంగా వసూలు చేయాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 15 సంవత్సరాలు దాటిన వాహనాల వివరాలను సేకరించడంతో పాటు ఆ వాహన యజమానులకు ఆర్‌టిఏ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 1.45 కోట్ల వాహనాలు ఉండగా వాటిలో 15 సంవత్సరాలు దాటిన వాహనాలు సుమారు 32 లక్షల వరకు ఉండగా, ఇందులో వ్యక్తిగత వాహనాలు 24 లక్షలు కాగా, వాణిజ్య వాహనాలు ఏడు లక్షలకు పైగా ఉన్నాయని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో 1.75 లక్షల పైచిలుకు వాహనాలు మాత్రమే హరితపన్ను చెల్లించారని మిగతా వాహనదారులు హరితపన్నును చెల్లించేలా రవాణా శాఖ అధికారులు చర్యలు చేపట్టినట్టుగా తెలిసింది. ఈ మధ్యనే కాలంచెల్లిన 600 పైచిలుకు బస్సులను నడపవద్దని ఆర్టీసికి ఆర్‌టిఏ అధికారులు నోటీసులు జారీ చేశారు.

15 ఏళ్లు దాటితే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి….

ప్రస్తుతం ఈ వాహనాలను రీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఖరీదైన వ్యవహారంగా మారింది. ఈనెల 01వ తేదీ నుంచి రీ- రిజిస్ట్రేషన్ ఫీజును కేంద్రం ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాలు 8 రెట్లుగా వసూలు చేస్తోంది. ప్రస్తుతం ద్విచక్ర వాహ నాల రీ -రిజిస్ట్రేషను రూ.300లు ఉండగా దానిని రూ.1,000లకు పెంచారు. కార్లకు రూ.600లకు బదులుగా రూ.5,000లు, దిగుమతి చేసుకున్న కార్లకు రూ.15,000కు బదులుగా రూ.40,000లను చెల్లించాల్సి ఉంటుంది. 15 ఏళ్ల రిజిస్ట్రేషన్ గడువు దాటిన వ్యక్తిగత వాహనాలను తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఆలస్యమైతే నెలకు రూ.300 చొప్పున అదనంగా ప్రభుత్వం వసూలు చేస్తోంది. వాణిజ్య వాహనాలకు మాత్రం నెలకు రూ.500లను వసూలు చేస్తారు. 15 ఏళ్లు దాటిన వాహనాలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రీ- రిజిస్ట్రేషన్ చేయించు కోవాల్సి ఉంటుంది. ఢిల్లీలో మాత్రం 15 ఏళ్లు దాటిన వాహనాలకు రీ- రిజిస్ట్రేషన్ చేయరు. వాటిని ఢిల్లీ రోడ్లపై తిప్పడం, పార్క్ చేయడం నేరమే.

ఫిట్‌నెస్ పరీక్షల చార్జీలు సైతం పెంపు

15 ఏళ్లు దాటిన పాత వాణిజ్య వాహనాల ఫిట్‌నెస్ పరీక్షల చార్జీలు కూడా ఈనెల 01వ తేదీ నుంచి పెరిగాయి. కార్లకు ప్రస్తుతం రూ.1,000 వసూలు చేస్తుండగా దానిని ఏకంగా రూ.7,000లకు పెంచారు. బస్సులు, ట్రక్కులకు రూ.1,500ల నుంచి రూ.7,500లకు పెరిగింది. వాణిజ్య వాహనాలు ఎనిమిదేళ్లు దాటితే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి. రీ -రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ చార్జీల పెంపుతో వాహనాల యజమానులు తమ పాత వాహనాలను తుక్కుకింద తరలించేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే తుక్కు కింద మార్చేందుకు వాహనాలను ఇవ్వడానికి సిద్ధమయ్యే వారు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. కాలం చెల్లిన వాహనాల నుంచి తాజాగా పెంచిన పన్ను సక్రమంగా వసూలైతే రాష్ట్ర రవాణా శాఖకు భారీగా అదనపు ఆదాయం సమకూరనుంది. వ్యక్తిగత వాహనాలకు ఒకసారి హరిత పన్ను చెలించి రిజిస్ట్రేషన్ పత్రాల్లో నమోదు చేసుకుంటే మళ్లీ అయిదేళ్ల వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తాజా పరిణామాల నేపథ్యంలో ఇక నుంచి వాహన తనిఖీలను చేయడంతో పాటు కాలుష్య పరీక్ష వాహన రిజిస్ట్రేషన్లకు సంబంధించి తనిఖీలను చేపట్టాలని ఆర్‌టిఏ అధికారులు నిర్ణయించినట్టుగా తెలిసింది.

హరిత రుసుము ఇలా

గత ఎనిమిది సంవత్సరాల్లో హరిత రుసుము ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం వివరాలు ఇలా…. 2014-,15 (రూ.2,98,44,645 కోట్లు), 2015,-16 (రూ.3,99,41,907), 2016-,17 (రూ.4,22,06,971 కోట్లు) 2017-,18 (రూ.4,16,54,350 కోట్లు), 2018-, 19 (రూ.4,56,34,200 కోట్లు), 2019,20 (రూ.5,15,20,700 కోట్లు), 2020,21(రూ.3,77,49,250 కోట్లు), 2021,22 (రూ.5,78,18,600 కోట్లు) వసూలు అయ్యింది.

15 సంవత్సరాలు దాటిన వాహనాలకు పెంచిన హరిత పన్ను (రూపాయల్లో)

వాహనం                 పాత పన్ను                        పెరిగిన పన్ను

ద్విచక్రవాహనం              300                           1,000

కారు                      600                             5,000

విదేశీ వాహనం           15,000                         40,000

ఫిట్‌నెస్ రుసుం

                            పాత పన్ను                     పెరిగిన పన్ను

ట్యాక్సీ                       1,000                            7,000

బస్సు, లారీ                 1,500                          12,500

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News