ప్రధాన రహదారిపై కోతకు గురైన అప్రోచ్ రోడ్
మంచిర్యాల – నిర్మల్ మధ్య నిలిచిన రాకపోకలు
హైదరాబాద్: భారీ వరదల మూలంగా నిర్మల్ – మంచిర్యాల ప్రధాన రహదారిపై మామడ మండలం న్యూసాంగ్వి వద్ద అప్రోచ్ రోడ్ కోతకు గురైన ప్రాంతాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ… రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసి దారి మళ్ళించాలని అధికారులను ఆదేశించారు. రహదారికిరువైపులా బారీకేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ రహదారి గుండా ప్రయాణించే వారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయని, నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో నిర్మల్ జిల్లాలో చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయన్నారు. వివిధ ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం కావడంతో రాకపోకలకు అక్కడక్కడ ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెంట కలెక్టర్ ముశ్రఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బొర్కడే, ఇతర అధికారులు, ప్రజాప్రతినిదులు ఉన్నారు.