సినిమా మోజు.. ఒక్కో సారి పలు అనర్థాలకు దారితీస్తుంది. కాగా, ఛావా సినిమా చూసిన జనం అసిర్ గఢ్ కోటలో గుప్తనిధుల కోసం పలుగూ , పారా పట్టుకుని పరుగులు పెడుతున్నారు. అక్కడ గుప్తనిధులు ఉన్నాయనే పుకార్లే ఇందుకు కారణం. అది 15వ శతాబ్ది కోట.. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కు 20-22 కిలోమీటర్ల దూరంలో పాడుపడిన కోట.. చావా చిత్రం పుణ్యమాఅని ఈమధ్య సందర్శకుల తాకిడి పెరిగింది. మరి కొందరికి ఆశపుట్టింది. ఆక్కడ తవ్వితే గుప్త నిధులు లభిస్తాయేమోనన్న ఆశతో బ్యాటరీ లైట్లు, సెల్ ఫోన్ కాంతిలో రాత్రిళ్లు తవ్వకాలు చేస్తూ, నిధులకోసం గాలిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కార్యాచరణకు సిద్ధమైంది.
ఈమధ్య కొందరు బంగారు నాణేలకోసం తవ్వకాలు జరుపుతున్నట్లు తన కు తెలిసిందని బర్హాన్ పూర్ జిల్లా కలెక్టర్ హర్ష సింగ్ తెలిపారు. ఆ ప్రాంతంలో పర్యటించి, పరిస్థితి సమీక్షించాలని, వెంటనే నిధుల తవ్వకాలు నిలిచిపోయేలా చూడాలని సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ ను కోరినట్లు తెలిపారు. ఒకవేళ ఎవరికైనా.. బంగారు నాణేలు దొరికితే,, అవి పురావస్తు శాఖ కే చెందుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎవరికైనా ఏమైనా బంగారు నాణేలు కానీ, ఏవైనా విలువైన వస్తువులు దొరికినా అవి ప్రభుత్వం ఆస్తి అని స్పష్టం చేశారు. ఇటీవల చాలా మంది అసిర్ గఢ్ కోటకు వస్తున్నారని.. తవ్వకాలు జరుపుతున్నారని తాను స్థానిక అధికారులకు చెప్పినట్లు స్థానిక నివాసి వసీన్ ఖాన్ తెలిపారు. ఈ తవ్వకాలకు సంబంధించిన వీడియోలు ఈ మధ్య సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం విశేషం