ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపు
న్యూఢిల్లీ: ఖద్దరును జాతీయ వస్త్రంగా పరిగణించాలని, ఖద్దరు దుస్తులనే ధరించడం ద్వారా దాని వాడకాన్ని ప్రోత్సహించాలని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ముందుకు వచ్చి ఖద్దరు వాడకంపై విస్త్రృతంగా ప్రచారం చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్(కెవిఐసి) ఆధ్వర్యంలో ఆజా కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మంగళవారం నాడిక్కడ నిర్వహించిన ఖాదీ ఇండియా క్విజ్ కాంటెస్టును ప్రారంభించిన సందర్భంగా వెంకయ్య నాయుడు ప్రసంగిస్తూ ఖద్దరు వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఖద్దరు తయారీకి విద్యుత్ అవసరం కాని ఏ రకమైన ఇంధనం కాని అవసరం లేదని ఆయన తెలిపారు. వస్త్రాలలో పర్యావరణహిత ప్రత్యామ్నాయాల కోసం ప్రపంచం అన్వేషిస్తున్న వేళ ఆ అవసరాన్ని ఖద్దరు మాత్రమే తీర్చగలదని ఆయన అన్నారు. యూనిఫారాల కోసం ఖద్దరు వస్త్రాన్ని ఉపయోగించే విషయాన్ని విద్యా సంస్థలు పరిశీలించాలని ఆయన పిలుపు ఇచ్చారు.