Sunday, December 22, 2024

పాముకాటుకు వైద్యం లోటు

- Advertisement -
- Advertisement -

దేశంలో ఏటా 50,000 మంది పాముకాటుకు బలైపోతున్నారు. దాదాపు 21 దేశాలకు చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనం లో ప్రపంచంలో పాముకాట్లు ఏటా 50 లక్షలకు మించి ఉంటున్నాయి. వీటిలో 20 లక్షలు విషపూరితమైనవి కాగా, ఏటా 1.38 లక్షల వరకు మరణాలు సంభవిస్తున్నాయి. వాటిలో 64,100 మరణాలు భారత్‌లోనే కావడం గమనార్హం. అంటే ప్రపంచం మొత్తం మీద పాముకాటు మరణాల్లో 80% భారత్‌వే అని తేలింది. 70 శాతం మరణాలు బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి.

పాముకాటు వల్ల కలిగే మరణాలను, అంగవైకల్యాలను 2030 నాటికి 50 శాతానికి తగ్గించ గలిగేలా ప్రపంచ దేశాలు గట్టిగా కృషి చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. అయినా ఏం లాభం? ప్రజారోగ్య వ్యవస్థ వైఫల్యం వల్లనే ఇంతలా పాముకాటు మరణాలు కొనసాగుతున్నాయని స్పష్టమవుతోంది. ఇప్పటికీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాముకాటు విరుగుడు మందులు అందుబాటులో ఉండడం లేదు. యాంటీవీనమ్ (విషం విరుగుడు) డోస్‌లకు భారీ డిమాండ్ ఉంటోంది. 80% యాంటీవీనమ్ డోస్‌లను తమిళనాడులోని ఇరులా సహకార సంఘం నుంచి సేకరిస్తున్నారని తెలుస్తోంది. ఇక గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోనైతే రైతులు, వ్యవసాయ కార్మికులు నిత్యం పొలాల్లో పనులు చేస్తుండడం పరిపాటి. అలాంటి వారికి పాముకాటుకు నాటువైద్యమే దిక్కవుతోంది.

ఉదాహరణకు జులై 30 న తెలంగాణ నిర్మల్ జిల్లాలో 65 ఏళ్ల వృద్ధురాలు అలుగుల గంగవ్వ తన ఇంటిలోనే పాముకాటుకు గురై సరైన వైద్యం అందక మృతి చెందింది. దీన్ని బట్టి మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో పాముకాటుకు గురైన బాధితులకు ఏ విధంగా వైద్యం అందుతోందో చెప్పనక్కరలేదు. వాతావరణ మార్పులతోపాటు 28 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలున్న ప్రాంతాల్లో పాముకాట్లు సంఘటనలు తరచుగా ఉంటున్నాయని బిజెపి ఎంపి రాజీవ్ ప్రతాప్ రూడీ ఇటీవల లోక్‌సభలో ప్రస్తావించడం పాముకాటు మరణాల తీవ్ర సమస్యను ఎలా నివారించగలం అన్న చర్చను తెరమీదకు తెచ్చింది.అయితే ఈ మరణాలు చాలావరకు నివారించదగినవే. పాముకాటు అన్నది ప్రజారోగ్య సమస్య. భారత్‌లోనే కాదు అనేక స్వల్ప, మధ్యాదాయ దేశాల్లోనూ ఈ సమస్య పీడిస్తోంది. ప్రజారోగ్య సమస్యగా పాముకాటు మరణాలను ఇటీవల భారత్ ప్రభుత్వం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐసిఎంఆర్) ద్వారా గుర్తించింది. పాముకాటు మరణాల సంఖ్యను అంచనా వేయడానికి జాతీయ స్థాయిలో సర్వే చేపట్టింది. దీని వల్ల ఈ సమస్య తీవ్రత తెలుస్తుంది తప్ప సమస్య పరిష్కారం కాదు. పాముకాట్లపై కేవలం ప్రజల్లో అవగాహన కల్పిస్తే సరిపోదు.

మరణాల నివారణకు ఏం చర్యలు చేపట్టాలో ఆలోచించడం అవసరం. గ్రామీణ, గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా పాముకాటు చికిత్సకు కావలసిన ఔషధాలు, ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచాలి. గ్రామాల్లో పాములపై ఉన్న మూఢ నమ్మకాలను తొలగించే కార్యక్రమాలు చేపట్టాలి. మన దేశంలో 60 రకాలకు పైగా విష సర్పాలు మనుగడ సాగిస్తున్నాయి. ఈ సర్పాల్లో చాలా వరకు విషపూరితమైనవి కావు. వీటిపై ప్రజల్లో చాలా వరకు అవగాహన లేదు. అందుకనే పాము కనిపించగనే చంపుతున్నారు. విషసర్పాల విషంలో శరీర కణాలను విషపూరితం చేసే క్రిప్టో టాక్సిన్లు, ఎర్రరక్తకణాలను నాశనంచేసే హెమోటాక్సిన్లు, నాడీకణాలను నాశనం చేసే న్యూట్రోటాక్సిన్లు, కండరాలను నిర్జీవం చేసి పక్షవాతాన్ని కలిగించే విషపదార్థాలు ఉంటాయి. ఫలితంగా కణాలు నిర్వీర్యం అవుతాయి. ఎంజైములు కూడా విషం బారినపడి, కండరాలు విచ్ఛిన్నమై గాయాలు ఏర్పడతాయి.

అందుకనే పాముకాటుకు గురైన బాధితునికి తక్షణం వైద్యచికిత్స అందాలి. గ్రామాల్లో సరైన వైద్యం అందకపోతే నాటువైద్యాన్ని ఆశ్రయించకుండా సమీప ఆ స్పత్రులకు తక్షణం తరలించడం అవసరం. గ్రామాల నుంచి జిల్లా ఆస్పత్రులకు వెంటనే తరలించడానికి 108 సేవలను అందుబాటులో ఉంచాలి. ముఖ్యంగా పాముకాటుకు గురైనవారికి ‘స్వర్ణ కాలం’ (గోల్డెన్ అవర్స్) తొలి 3 గంటల వ్యవధిలో యాంటీ వీనమ్ డోస్ (విషం విరుగుడు) అందితే చాలా వరకు ప్రాణాలు కాపాడుకోగలం.కానీ అలా తక్షణ వైద్యం అందకనే ఏటా 60 వేల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. పర్యావరణ, భౌగోళిక పరిస్థితుల బట్టి పాముల విషం తీవ్రత భిన్నంగా ఉంటుందని వైద్య పరిశోధకులు చెబుతున్నారు. ఈ మేరకు స్థానిక పరిస్థితుల బట్టి ప్రాంతాలవారీగా యాంటీ వీనమ్‌ను తయారు చేయడం అవసరమని సూచిస్తున్నారు.కరోనా వ్యాక్సిన్లను ఎలా పంపిణీ చేశారో అదే విధంగా పాముకాటుకు యాంటీ వీనమ్‌ను ప్రజలకు అందించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News