వైద్య పరికరాలు, సిబ్బంది ఏర్పాటుకు వైద్యశాఖ కసరత్తు
ప్రతి దవఖానకు ముగ్గురు చొప్పన వైద్యసిబ్బంది నియామకం
దవఖానల పెంపుతో హర్షం వ్యక్తం చేస్తున్న నగరవాసులు
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో పేద ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకు 300 బస్తీ దవఖానలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రకటనను వైద్యశాఖ అధికారులు అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఉగాది పండగ వరకు మరో 34 బస్తీదవఖానలు ఏర్పాటు చేసి రోగులకు వైద్య సేవలందించేకు సిద్దమైతున్నట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. తగిన స్దాయిలో సిబ్బంది, వైద్య పరికరాలు ఏర్పాటు చేస్తున్నట్లు, జీహెచ్‌ఎంసీ కొత్త దవఖానలకు సంబంధించిన స్దల సేకరణ చేసి వైద్యశాఖకు అప్పగించడంతో వసతులు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. రాజధాని నగరంలో బస్తీదవఖానలు మంచి ఫలితాలు ఇవ్వడంతో త్వరలో శివారు మున్సిపాలిటీల్లో కూడా పేదలకు వైద్యం చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఇటీవలే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటన చేశారు.
బస్తీదవఖానలు పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్నాయని మరో పక్క వైద్యులు చెబుతున్నారు. వీటికి తోడు డయాగ్నస్టిక్ హబ్‌లు ప్రారంభించి వివిధ పరీక్షలు చేస్తుండటంతో కార్పొరేట్ ఆసుపత్రులపై జనం వెళ్లడం లేదంటున్నారు. బస్తీదవఖానలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తే వైద్యసేవల్లో దేశంలోనే తెలంగాణ మొదటి స్దానంలో ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు. గ్రేటర్‌లో ప్రస్తుతం 256 దవఖానలు సేవలందిస్తుండగా, త్వరలో ప్రారంభించే దవఖానలు అందుబాటులోకి వస్తే గ్రేటర్ పరిధిలో బస్తీదవఖానల సంఖ్య 290కి చేరుకుంటుంది. వీటి ద్వారా రోజుకు 4500 నుంచి 5000మందికి వైద్య చికిత్సలు అందించే అవకాశముందని ఆసుపత్రులు మెడికల్ ఆఫీసర్లు పేర్కొంటున్నారు.
ఒక బస్తీ దవఖానల్లో వైద్య చేసేందుకు ఒక డాక్టర్, స్టాప్ నర్సు, అటెండర్ విధులు నిర్వహిస్తారని, త్వరలో ఏర్పాటు చేయబోయే బస్తీ దవఖానల కోసం 102 మంది సిబ్బంది నియమిస్తునట్లు వారిని ఒప్పంద పద్దతిన తీసుకోనున్నట్లు వెద్యాధికారులు వెల్లడించారు. అదే విధంగా వ్యాధి నిర్దారణ కోసం ప్రస్తుతం 08 డయాగ్నస్టిక్ హబ్‌ల ద్వారా రక్త నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తున్నాయని తెలిపారు. మరో 08 డయాగ్నస్టిక్ హబ్‌లు కూడా వీలైనంత త్వరగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరిస్తున్నారు. కరోనా మూడు వేవ్‌ల్లో బస్తీదవఖానలు కరోనా టెస్టులు, రోగులకు కిట్‌లు అందజేసి, ఎంతోమంది ప్రాణాలు నిలిపినట్లు దవఖానల వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు. ప్రతి ఆసుపత్రికి అదనంగా మరో ఇద్దరు సిబ్బందిని నియమిస్తే రోజుకు 100మందికిపైగా రోగులకు సేవలందించే వీలుంటుందని తెలిపారు.