సామాన్యుల నుంచి కోటీశ్వరులకు అందుబాటులో ధరలు…
తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.చలపతిరావు
మనతెలంగాణ/హైదరాబాద్: కొవిడ్ రెండో దశ తగ్గిన నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయని, ఇది రియల్ ఎస్టేట్ రంగానికి మరింతగా ఊతమిచ్చిందని ట్రెడా (తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్) అధ్యక్షుడు ఆర్.చలపతిరావు పేర్కొన్నారు. సామాన్యుల నుంచి కోటీశ్వరులకు అందుబాటులో ఉండేలా ట్రెడా 11వ ప్రాపర్టీ షోను నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. అక్టోబర్ 01వ తేదీ నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే ప్రాపర్టీ షో ( హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ 1 అండ్ 3 హాల్)లో నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. అందులో భాగంగా దీనికి సంబంధించిన విషయాలను ఆయన హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొస్తున్న పలు సంస్కరణలతో వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది ముందుకొస్తున్నారని, అందులో భాగంగా నివాస స్థలాలు, ఇళ్లకు విపరీతమైన డిమాండ్ పెరిగిందన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న స్నేహ పూర్వక సంస్కరణలు, వినూత్న విధానాలు రాష్ట్ర గణనీయ అభివృద్ధికి దోహదం చేస్తున్నాయన్నారు.
11వ ప్రాపర్టీ షోలో 100కు పైగా బిల్డర్లు
డెవలపర్లు, బిల్డర్లు, ప్రమోటర్లతో కూడిన రియల్ ఎస్టేట్ కమ్యూనిటీచే నిర్వహించబడే ట్రెడా ప్రాపర్టీ షో అటు విక్రేతలకు, ఇటు కొనుగోలు దారులకు విస్తృతస్థాయిలో ఆస్తులను అమ్మేందుకు, కొనేందుకు అవకాశాలను తెలుసుకునేందుకు ఏకైక గమ్యస్థానంగా ట్రెడా ప్రాపర్టీ షో నిలవనుందన్నారు. 11వ ప్రాపర్టీ షోలో 100కు పైగా బిల్డర్లు, డెవలపర్లు, భవన నిర్మాణ సామగ్రి సరఫరాదారులతో పాటుగా పలు ఆర్థిక సంస్థలు, 120 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ అన్ని రంగాల్లోనూ బాగా వృద్ధి చెందుతోందన్నారు. పండుగ సీజన్ సమీపించిన నేపథ్యంలో తమకు నచ్చిన ఆస్తిని కొనేందుకు ప్రణాళిక రూపొందించుకోవడం, ఇన్వెస్ట్ చేయడం పరిశీలించేందుకు ఆశావహులకు ఇది చక్కటి సమయమన్నారు. అది స్వల్పకాలికంగానే గాకుండా దీర్ఘకాలికంగా వారికి లాభదాయకంగా ఉంటుందన్నారు.
డెవలపర్లు ఒకే వేదికపైకి: విజయసాయి
ప్రఖ్యాతి గాంచిన ‘ట్రెడా ప్రాపర్టీ షో’ మళ్లీ నగరానికి వచ్చిందని ట్రెడా వైస్ ప్రెసిడెంట్ విజయసాయి తెలిపారు. డెవలపర్లు అందరినీ ఒకే వేదికపైకి తీసుకువస్తుందన్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ రకాల ప్రాపర్టీలను ఒకే వేదికపై అందిస్తామన్నారు. 10 సంవత్సరాలుగా విజయవంతంగా ఈ ప్రాపర్టీ షోలను నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తమ సంస్థ 26 సంవత్సరాల క్రితం ఏర్పడిందని తాము అందరికీ అందుబాటు ధరల్లో నివాస గృహాలను అందించామని ఆయన తెలిపారు.
హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల అధిక నిర్మాణాలు: సునీల్ చంద్రారెడ్డి
హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల నివాస గృహాలకు సంబంధించి అధికంగా నిర్మాణాలు జరుగుతున్నాయని నైట్ ప్రాంక్ సంస్థ ఇచ్చిన నివేదికలో తెలిపిందని ట్రెడా జనరల్ సెక్రటరీ సునీల్ చంద్రారెడ్డి తెలిపారు. ఇళ్ల అమ్మకాల్లో 2020 కన్నా ఈ సంవత్సరం ఇప్పటికే అధిక వృద్ధిని హైదరాబాద్ సాధించిందన్నారు. ఇళ్లతో పాటు అపార్ట్‌మెంట్‌ల కొనుగోళ్లకు భారీగా డిమాండ్ పెరిగిందన్నారు.
800ల నుంచి 15,000ల ఎస్‌ఎఫ్‌టి…. శ్రీధర్‌రెడ్డి
తాము నిర్వహించే ప్రాపర్టీ షోలో 800ల నుంచి 15,000ల ఎస్‌ఎఫ్‌టి వరకు నిర్మాణాలకు సంబంధించి ప్రాపర్టీలు ఉన్నాయని, సుమారు రూ.30 లక్షల నుంచి కోటి పైచిలుకు ధరల్లో అవి లభిస్తాయని ట్రెడా ట్రెజరర్ శ్రీధర్‌రెడ్డి తెలిపారు.