మన తెలంగాణ/హైదరాబాద్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా కొనసాగుతోంది. ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు సామాన్యులతో పాటు ప్రముఖులు సైతం ముందుకు వస్తున్నారు. తమ వంతుగా మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా హైదరాబాద్ లక్డీకాపూల్‌లో నిలోఫర్ సమీపంలోని ఎమ్‌ఎన్‌జె ఆసుపత్రి ఆవరణలో రిటైర్డ్ ఐఏఎస్, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు రామ్ చంద్ తేజావత్ 68వ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో మొక్కను నాటించారు. అలాగే వృక్షవేదం పుస్తకం, ఎకో గణేష్ విగ్రహాన్ని ఆయనకు అందజేశారు. ఇక ఆయన పుట్టినరోజు సందర్భంగా 350 మంది క్యాన్సర్ పేషెంట్లకు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించడం సంతోషకరమని ఆయన కొనియాడారు. మానవాళి మున్ముందు జీవనానికి గ్రీన్ ఇండియా కార్యక్రమం చాలా ఉపయోగకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ కమిషనర్ శంకర్ నాయక్, గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాజ్ కుమార్, ఎస్ ఆర్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ ఎండి రామ్ నాయక్ పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలి: సిటిమార్ మూవీ డైరక్టర్ సంపత్ నంది
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బంజారాహిల్స్ కెబిఆర్ పార్క్‌లో సిటిమార్ మూవీ డైరెక్టర్ సంపత్ నంది సినిమా కబడ్డి టీంతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సినీ దర్శకులు సంపత్ నంది మాట్లాడుతూ ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. నేడు తమ సినిమా విడుదల సందర్భంగా ఏదైనా మంచి కార్యక్రమం చేయాలన్న ఉద్దేశ్యంతో ప్రకృతికి మేలు కలిగేలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మొక్కలు నాటామని ఇదొక మంచి శుభపరిణామంగా భావిస్తున్నామని సంపత్ నంది అన్నారు. తెలంగాణలో అటవీశాతం 4 శాతం పెరిగిందని అది ఇంకా పెరగాలి అని ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణానికి మేలు చేయాలి అని సంపత్ నంది కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని ప్రకృతికి మేలు చేసేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలి అని ఆర్టిస్టులు హారిక, హాసిని అన్నారు. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటే అవకాశం కలిగించినందుకు ఎంపి సంతోష్ కుమార్‌కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్ ఎంజె.అక్బర్, డిఎఫ్‌ఓ జోజి, ఇతర అధికారులు, కెబిఆర్ పార్క్ సిబ్బంది పాల్గొన్నారు.