మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న రేవంత్ రెడ్డికి తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) శుభాకాంక్షలు తెలిపింది.ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుండడం హర్షణీయమని ‘ట్రెసా’ అధ్యక్ష కార్యదర్శులు , వంగ రవీందర్ రెడ్డి, కె.గౌతమ్ కుమార్‌లు అన్నారు.నూతన ప్రభుత్వం ఉద్యోగుల హక్కుల రక్షణకు , ప్రజల సంక్షేమానికి పాటు పడుతుందని వారు ఆకాక్షించారు.కొత్త ప్రభుత్వం రెవెన్యూ శాఖను పటిష్టపరిచి, గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థను పునరుద్దరించి, రెవెన్యూ ఉద్యోగుల విధులను వికేంద్రీకరించి ప్రజలకు సత్వర సేవలు అందే విధంగా కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ట్రెసా నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
టీడబ్ల్యూజేఎఫ్ శుభాకాంక్షలు
తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎంపికైన టీపీసీసీ రేవంత్ రెడ్డికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ శుభాకాంక్షలు తెలిపింది. ఈనెల 7న ప్రమాణస్వీకారం చేయనున్న సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన మంత్రివర్గానికి కూడా ఫెడరేషన్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎం. సోమయ్య, బి. బసవపున్నయ్య తెలిపారు. కాంగ్రేస్ ప్రభుత్వంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కావాలని వారు ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. ప్రధానంగా జర్నలిస్టులకు ఇండ్ల స్తలాలు ఇవ్వాలని , హెల్త్ కార్డులు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
టీజీటీఏ శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న రేవంత్ రెడ్డికి రాష్ట్ర తహసీల్దార్ అసోసియేషన్స్ (టిజిటిఏ) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రాములు శుభాకాంక్షలు తెలిపారు. సిఎంగా రేవంత్ రెడ్డి పేరును కాంగ్రేస్ పార్టీ అధిష్టానం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం చేపట్టే పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో తమ వంతు పాత్ర పోషిస్తామన్నారు.