Monday, January 20, 2025

విచారణ ప్రక్రియ మొత్తం వీడియో కాన్ఫరెన్స్ లోనే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేసుల దర్యాప్తు, విచారణ ప్రక్రియల మొత్తం వేగవంతం చేయడానికి డిజిటలీకరించడానికే కేంద్రం ప్రాధాన్యం కల్పించింది. ఎఫ్‌ఐఆర్, కేసు డైరీ, అభియోగపత్రం, తీర్పు, ఇలా అన్నింటినీ ఇక డిజిటలీకరించడం వాటిలోని ఓ ప్రధానాంశం. ఇక కోర్టులు నిర్వహించే అన్ని ప్రక్రియల్లోనూ సాంకేతికతను ఉపయోగించే వెసులుబాటు కల్పిస్తారు. ఇప్పటివరకూ నిందితుల హాజరు మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతోంది. ఇక క్రాస్ ఎగ్జామినేషన్ సహా మొత్తం విచారణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపేందుకు వీలుంటుంది. ఇందుకోసం 2027 లోపు దేశ వ్యాప్తంగా అన్ని కోర్టులనూ కంప్యూటరీకరించనున్నారు. తాజా బిల్లుల్లో పొందుపరిచిన నిబంధనల గురించి కేంద్రహోం మంత్రి అమిత్‌షా లోక్‌సభలో చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే .

కాగితాలు అక్కర్లేదు…
తాజా భారతీయ న్యాయసంహిత( బిఎన్‌ఎస్ ), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత( బిఎన్‌ఎస్‌ఎస్ ) , భారతీయ సాక్షా (బిఎస్) బిల్లుల్లో దస్తావేజుల పరిభాషను విస్తరించాం. ఎలక్ట్రానిక్, డిజిటల్ రికార్డు, ఈమెయిల్, సర్వర్, కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, ఎస్‌ఎంఎస్, వెబ్‌సైట్, డివైజ్‌లో లభించే మెయిల్, మెసేజ్‌లకు చట్టబద్ధత కల్పించాం. వీటిని న్యాయస్థానాల్లో అందించొచ్చు. అందువల్ల కాగితాలు సమర్పించాల్సిన అవసరం తప్పుతుంది.
వీడియోగ్రఫీ తప్పనిసరి…
సోదాలు, తనిఖీలు నిర్వహించేటప్పుడు , జప్తు చేసేటప్పుడు , వీడియోగ్రఫీ తప్పనిసరి. కేసులో ఆ వీడియోగ్రఫీ భాగమవుతుంది. ఇలాంటి రికార్డింగ్ లేకుండా చలాన్, ఛార్జిషీట్లు వేస్తే వాటికి విలువ ఉండదు.

విస్తృతంగా ఫోరెన్సిక్ వినియోగం
నేరాల నిరూపణ ఇప్పటిదాకా చాలా తక్కువగా ఉంది. దాన్ని పెంచడానికి ఫోరెన్సిక్ సైన్సును విస్తృత స్థాయిలో ఉపయోగించాలని నిర్ణయించాం. మూడేళ్ల తరువాత ఏటా 33 వేల మంది ఫోరెన్సిక్ సైన్స్ నిపుణులను తయారు చేస్తాం. నేర నిరూపణను 90 శాతం పైకి తీసుకెళ్లాలని సంకల్పించాం. అందువల్ల ఏడేళ్లకు పైబడి శిక్షలు పడే ప్రతి కేసు లోనూ నేర స్థలాన్ని ఫోరెన్సిక్ సైన్స్ బృందం తప్పనిసరిగా సందర్శించాలన్న నిబంధనను తీసుకొస్తున్నాం. దానివల్ల శాస్త్రీయ ఆధారాలు లభిస్తాయి . కాబట్టి కోర్టులోనేర నిరూపణ సులభమవుతుంది. భవిష్యత్తులో ప్రతి జిల్లాలో మూడు మొబైల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తాం.

సివిల్ సర్వెంట్లపై ఫిర్యాదులొస్తే…
ఇన్నాళ్లూ సివిల్ సర్వెంట్లకు వ్యతిరేకంగా ఫిర్యాదులు వచ్చినప్పుడు ప్రభుత్వ అనుమతి లేకుండా విచారణ జరిగేది కాదు. అనుమతుల ప్రక్రియ ఏళ్ల తరబడి ఆలస్యమయ్యేది. దానివల్ల విచారణలో జాప్యం చోటు చేసుకొని , సివిల్ సర్వెంట్లతోపాటు మరికొందరు లబ్ధి పొందేవారు. దీన్ని నివారించడానికి సివిల్ సర్వెంట్ల ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇస్తున్నదీ లేనిదీ 120 రోజుల్లోపు కచ్చితంగా చెప్పేయాలన్న నిబంధన తెస్తున్నాం. ఒకవేళ ఆ లోపు స్పందన రాకపోతే అనుమతి వచ్చినట్టుగానే భావించి విచారణ నిర్వహించవచ్చు.ఎస్పీ స్థాయిలో ఎవరైనా అధికారి కేసు విచారణ ప్రారంభిస్తే , వారు డీజీపీ స్థాయికి వెళ్లినా, వారే వచ్చి సాక్షం చెప్పాల్సిన పరిస్థితి ఇప్పుడుంది. ఆ నిబంధనను మారుస్తున్నాం. ప్రస్తుతం ఎవరు ఎస్పీగా ఉన్నారో వారే ఫైల్ చూసి సాక్షం చెప్పేలా నిబంధన తీసుకొస్తున్నాం. దానివల్ల విచారణలో జాప్యం తగ్గుతుంది.

నేరస్థులు పారిపోయినా వారి పరోక్షంలోనూ విచారణ నిర్వహించడానికి వీలు కల్పిస్తున్నాం. వారికి శిక్ష విధించే నిబంధన చేర్చాం. దావూద్ ఇబ్రహీం లాంటి నేరస్థులకు దీనివల్ల శిక్షలు పడతాయి. ఆ తీర్పును సవాల్ చేయాలంటే వారు తప్పనిసరిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి ఉంటుంది.పోలీస్ స్టేషన్లలో వాహనాలు ఏళ్ల తరబడి పడి ఉండే పరిస్థితి ఇకపై రాబోదు. కేసు పరిష్కారమయ్యే దాకా వేచి చూడకుండా, సంఘటన జరిగిన వెంటనే ఆ వాహనాలను వీడియోగ్రఫీ చేసి సర్టిఫైడ్ కాపీని కోర్టులో జమ చేయొచ్చు. వాహనాలను అక్కడి నుంచి తొలగించేయొచ్చు. దీనివల్ల పోలీస్ స్టేషన్లు స్వచ్ఛంగా మారుతాయి.
చిన్న చిన్న నేరాల్లో సమాజ సేవను శిక్షగా విధించే నిబంధనను తొలిసారి తీసుకొస్తున్నాం. అంతర్రాష్ట్ర, వ్యవస్థీకృత నేరాల ముఠాలకు ప్రత్యేక కఠిన శిక్ష విధించడానికి కొత్త నిబంధనను తీసుకొచ్చాం.చిన్నచిన్న కేసుల్లో సమ్మరీ ట్రయల్ పరిధిని విస్తరించాం.

రూ. 20 వేల వరకు , 3 ఏళ్ల వరకు శిక్షలు పడే కేసులను సమ్మరీ ట్రయల్ కిందికి తెచ్చాం. దానివల్ల 40 శాతం కేసులు సెషన్ కోర్టు పరిధి నుంచి బయటపడి కింది కోర్టులకు వెళ్తాయి. తొలిసారి నేరానికి పాల్పడిన అండర్‌ట్రయల్ నిందితులు తమకు పడే శిక్షలో 1/3 వ వంతు శిక్షాకాలం పూర్తి చేసి ఉంటే కోర్టు వారికి బెయిల్ ఇవ్వొచ్చు. జీవితఖైదు, మరణశిక్ష పడే అవకాశం ఉన్న అండర్‌ట్రయల్స్‌కి ఇది వర్తించదు. పదేళ్లకు మించి శిక్ష పడే కేసుల్లో పేరు మోసిన నేరగాళ్లకు విదేశాల్లో ఆస్తులు ఉంటే వాటిని జప్తు చేయొచ్చు. డిశ్చార్జి పిటిషన్లు అన్నీ ఒకేసారి వేసుకోవాల్సి ఉంటుంది. ఒకదాని తరువాత మరొకటి దాఖలు చేయడానికి వీలుండదు. ఇక కేసుల విచారణలో రెండు సార్లకు మించి వాయిదాలు ఇవ్వరు.
ఉగ్రవాద నిర్వచనం ఇదీ…
భారత భద్రత, ఐక్యత, సమగ్రతలకు ముప్పు కలిగించాలన్న ఉద్దేశంతో భారత్‌లో గానీ, ఏదైనా ఇతర దేశాల్లో గానీ చర్యలకు ఉపక్రమించేవారు… సాధారణ జనాన్ని లేదా ఒక వర్గం ప్రజలను భయపెట్టేందుకు ప్రయత్నించేవారు… ప్రజాజీవనాన్ని అస్తవ్యస్తం చేసేందుకు ప్రయత్నించేవారు… వీరంతా ఉగ్రవాదులే..

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News