Sunday, April 13, 2025

ఆదివాసీలపై దమన కాండ

- Advertisement -
- Advertisement -

దేశవ్యాప్తంగా కోట్లాది మంద గిరిజనులను ప్రభావితం చేస్తున్న అటవీ హక్కుల చట్టం 2006కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై 2025 ఏప్రిల్ -2 న సుప్రీం కోర్టులో మరలా విచారణకు వచ్చింది. పిటిషన్‌దారులు చట్టం రాజ్యాంగ చట్టబద్ధతను ప్రశ్నించారు. భారత దేశంలోని అటవీ ప్రాంతం లో లేదా దాని సమీపంలో అనేక షెడ్యూల్డ్ తెగలతో సహా 25 కోట్ల మంది నివసిస్తున్నారు. వీరిలో 10 కోట్ల పైగా ఆదివాసీ గిరిజనులున్నారు. ప్రాచీన కాలంనుండి దేశంలోని గిరిజన వర్గాలు అడవులతో పెనవేసుకుని జీవిస్తున్నారు. వారి జీవన విధానం, ఉనికి అడవిపై ఆధారపడి ఉంది. అడవిపై గిరిజనుల హక్కులను వలస పాలకుల నుంచి నేటి దేశపాలకుల వరకు నిరాకరిస్తూనే ఉన్నారు.

భారతీయ అటవీ చట్టం 1927 , వైల్డ్ లైఫ్ (ప్రొటెక్షన్ ) యాక్ట్ 1972 ఏ ప్రాంతాన్నైనా రక్షిత అడవిగా లేదా గ్రామ అడవిగా ప్రకటించటానికి ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది. ఈ అధికారంతో జాతీయ ఉద్యానవనం, వన్యప్రాణుల అభయారణ్యం, టైగర్ రిజర్వు ఫారెస్టు ప్రాంతాలుగా ప్రకటించి గిరిజనులను ఆ ప్రాంతాలనుంచి తొలగించే చర్యలను పాలక ప్రభుత్వాల పూనుకుంటున్నాయి. పై పరిస్థితుల కారణంగా లక్షలాది మంది గిరిజనులు తమ సొంత భూమిలో, ఇళ్లలో ఆక్రమణదారులుగా ముద్రపడి వేధింపులు, బహిష్కరణలు మొదలైన వాటికి గురౌతున్నారు.

తరతరాలుగా అడవిపై ఉన్న తమ హక్కును కాలరాస్తున్న వలస పాలకులకు, వారి అడుగుజాడల్లో నడుస్తున్న దేశీయ పాలకులకు వ్యతిరేకం సుదీర్ఘకాలంగా చేసిన పోరాటాలు చేసిన ఫలితమే అటవీ హక్కుల చట్టం. ఈ చట్టాన్ని యుపిఎ ప్రభుత్వం 18- డిసెంబర్, 2006న పార్లమెంట్‌లో ఆమోదం పొందింది. 2007 డిసెంబర్, -31న ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టాన్ని గిరిజన హక్కుల చట్టం, గిరిజన భూమి చట్టం అని కూడ పిలుస్తారు. 1 జనవరి, -2008న ఈ చట్టం విధానపరమైన అంశాలను భర్తీ చేయటానికి గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ రూపొందించిన నోటిఫికేషన్ వెలువడింది. ఈ చట్టం ద్వారా అర్హత కలిగిన గిరిజనులకు 13 హక్కులు కల్పిస్తున్నట్లు చెప్పటం జరిగింది.

వీటిల్లో భూమి, అటవీ ఉత్పత్తులు, అడవుల నిర్వహణ మొదలగు అంశాలు ఉన్నాయి. చట్టయోగ్యమైన ప్రతి గిరిజన కుటుంబానికి 10 ఎకరాల అటవీ భూమికి చట్టబద్ధ హక్కులు ఇస్తారు. అటవీ భూమిసాగు చేస్తున్నట్లు గిరిజనులే నిరూపించుకోవాలి.చాలా మంది అమాయక గిరిజనులకు అలా నిరూపించుకునే ఆధారాలు ఉండవు. ఫలితంగా చాలా గిరిజన కుటుంబాలు భూమికి దూరమవుతాయి. చట్టంలో గిరిజనేతరులకు కూడా భూమిని పొందే అవకాశాలు కల్పించారు. ఫలితంగా గిరిజనులకు చెందాల్సిన భూములు గిరిజనేతురుల పరమవుతాయి.

అటవీ హక్కు చట్టం అమల్లోకి వచ్చినప్పుడు అటవీ పరిరక్షకులుగా చెప్పుకునేవారు, రిటైర్డ్ అటవీ శాఖ అధికారులు, అటవీ అధికారులు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు హైకోర్టు, సుప్రీం కోర్టులో అనేక పిటిషన్లు దాఖలు చేశారు. 2008 మార్చిలో వైల్డ్ లైఫ్ ఫస్ట్, నేచర్ కన్జర్వేషన్ సొసైటీ, టైగర్ రీసెర్స్ అండ్ కన్జర్వేషన్ ట్రస్, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లు కూడా ఉన్నాయి. పిటిషనర్లు చట్టం రాజ్యాంగబద్ధ్దతను సవాల్ చేశారు. 2015 జనవరిలో ఈ కేసులను వైల్డ్ లైఫ్ ఫస్ట్, ఇతరులు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇతరులు కలిసి విచారణ కోసం సుప్రీం కోర్టుకు బదిలీచేశారు. 2016లో అటవీ హక్కుల చట్టం కింద ఇప్పటివరకు భూ హక్కుల తిరష్కారానికి గురైన కుటుంబాలను, ఆ భూములనుంచి ఖాళీ చేయించటానికి ఎందుకు చర్యలు తీసుకోలేదని చట్ట వ్యతిరేకులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు.

దీనిపై సుప్రీం కోర్టు అన్ని రాష్ట్రాలను ఆదేశిస్తూ 13 ఫిబ్రవరి -2019న మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. భూహక్కుల తిరస్కరణకు గురైనవారిని తొలగించటానికి తీసుకున్నచర్యల గురించి కోర్టుకు తెలియచేయాలని ఆదేశించింది.సుప్రీం కోర్టు ఆదేశం ప్రకారం సాగు చేసుకుంటున్న 17 లక్షల గిరిజన కుటుంబాలు భూముల నుంచి తొలగించబడతారు.సుప్రీం కోర్టు నిర్ణయంపై గిరిజనుల్లో తీవ్రవ్యతిరేకత ఏర్పడింది. దేశవ్యాప్తంగా పెద్దఎత్తున గిరిజనులు ఆందోళనలు చేశారు. మోడీ ప్రభుత్వంపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేశా రు. ఫలితంగా గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ స్పందించటంతో సుప్రీం కోర్టు 28- ఫిబ్రవరి 2019న తన తొలగింపు ఉత్తర్వులపై స్టే విధించింది.

అటవీ హక్కుల చట్టాన్ని గిరిజనుల పోరాటాన్ని పక్కదారి పట్టించడానకే యుపిఎ ప్రభుత్వం చేసిందే గాని దాన్ని సక్రమంగా అమలు జరపాలన ఉద్దేశం లేకపోగా దాన్ని నీరుకార్చే విధంగా వ్యవహరించింది. మాజీ అటవీ అధికారులు, అటవీ శాఖ, కొన్ని స్వచ్ఛంద సంస్థలు చట్టానికి వ్యతిరేకంగా పిటిషన్లు వేయటం అందులో భాగమే. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా అటవీశాఖ చట్టానికి వ్యతిరేకంగా కోర్టుకు ఎలా వ్యతిరేక పిటిషన్ వేస్తారు. చట్టం వల్ల అడవులు నాశనమై, పర్యావరణం దెబ్బతింటుందని గగ్గోలు పెట్టే స్వచ్ఛంద సంస్థలు, కొందరు వ్యక్తులు అటవీ విధ్వంసానికి, పర్యావరణ కాలుష్యానికి బహుళజాతి సంస్థలు, బడా పారిశ్రామికవేత్తలే కారణమన్న వాస్తవాన్ని మరుగుపరుస్తూ వాటి దోపిడీకి మద్దతు పలుకుతున్నారు. గిరిజనులే అడవులకు రక్షణగా ఉన్న వాస్తవంపై దాడి చేస్తున్నారు.

దేశంలోని అడవుల స్థితిపై ఫిబ్రవరి 2019న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక ప్రకారం 201318 మధ్య 3,015 చ.కి. అటవీ భూమిని మైనింగ్, ఇతర ప్రాజెక్టుల కోసం మళ్లించారని, గిరిజనులు అడవులను నాశనం చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఇటీవల పర్యావరణ పరిరక్షణ చట్టాల్లో సడలింపు దేశవ్యాప్తంగా అడవుల వనరులు దోపిడీకి, భారీ నిర్మాణ ప్రాజెక్టులు పెరగటానికి దారితీసి అటవీ విస్తీర్ణత తగ్గటానికి కారణంగా ఉంది. భారతదేశం కూడా సంతకం చేసిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (సిఒపి పార్టీల సమావేశం), ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయుసిఎన్),సిబిడి, గ్లోబల్ బయోడైవర్సిటీ, చట్టంలో ప్రపంచ విధాన చర్చలు, అడవులు, జీవవైవిధ్య నిర్వహణ పాలన రక్షణ కోసం ఆదివాసీ సముదాయాలకు ఉన్న సాంప్రదాయ హక్కులను బలోపేతం చేయాలని పిలుపు ఇచ్చాయి.

సమావేశ పిలుపుకు భిన్నంగా గిరిజనుల సాంప్రదాయ హక్కులను మోడీ ప్రభుత్వం కాలరాస్తున్నది. అటవీ హక్కుల సవరణ చట్టంచేసి అటవీ భూములను బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టే విధానాలను చట్టంలో చేర్చింది. గ్రామసభల నిర్ణయాలను పక్కనపెట్టింది.అటవీ భూముల్లో ఏవైనా మార్పులు జరిగే ముందు గ్రామ సభల లిఖితపూర్వక అనుమతి పొందాలని నిర్ధారిస్తూ 2009 లో సర్క్యులర్ జారీ చేయబడింది. ఈ సర్క్యులర్ భిన్నంగా ప్రధాని మోడీ కార్యాలయం అన్ని సందర్భాల్లోనూ గ్రామ సభల అనుమతి అవసరం లేదని సంబంధిత మంత్రిత్వ శాఖకు సూచించటం ద్వారా చట్టాన్ని నీరుగార్చటానికి పూనుకుంది. పర్యావరణ, గిరిజన మంత్రిత్వ శాఖలు ఈ మార్పులను అంగీకరించాయి.

అయితే సుప్రీం కోర్టు దాన్ని వ్యతిరేకించి గ్రామసభల హక్కులను తిరిగి పేర్కొంది. భారతదేశ అటవీ పాలన విధానం, అటవీ సంక్షోభాన్ని మరింత తీవ్రం చేసింది. ఇటీవల సంవత్సరాల్లో అటవీ, పర్యావరణ చట్టాలను నీరుగార్చటం వల్ల పారిశ్రామిక, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పేరుతో గత 15 సంవత్సరాల్లో 3 లక్షల హెక్టార్లకు పైగా అటవీ భూమిని కేంద్ర ప్రభుత్వాలు మళ్లించాయి. 60 వేల హెక్టార్లు భూమిని మైనింగ్ తవ్వకాలకు పారిశ్రామిక వేత్తల కేటాయించారు. అటవీ హక్కుల చట్టానికి వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేసిన వారంతా తరతరాలుగా అడవిపై గిరిజనుల హక్కును వ్యతిరేకిస్తూ, బడా పారిశ్రామికవేత్తల దోపిడీ కి మద్దతుగా నిలబడుతున్నారు. తద్వారా అడవి విధ్వంసకారులతో చేతులు కలుపుతున్నారు.

2- ఏప్రిల్, 2025 మరలా అటవీ హక్కుల చట్టం సుప్రీం కోర్టు విచారణకు వచ్చింది. వెనకబడిన అమాయక గిరిజనులకు భూమి పత్రాలు పొందాలన్నది తెలియదు. సాగు చేసుకుంటున్న భూమి తనదే గదా అన్నది మాత్రమే తెలుసు. ఇలాంటి అమాయక గిరిజనులు భూమి హక్కులు నిరూపించుకోలేదనే పేరుతో అడవినుంచి తొలగించటానికి సుప్రీం కోర్టు నిరాకరించటం న్యాయబద్ధగా ఉంటుంది. గ్రామసభల ద్వారా భూమి హక్కుల నిర్ధారించాలని, గిరిజనేతర అటవీ ఆక్రమణదారులను భూములనుండి తొలగించాలని, అడవిపై గిరిజనుల హక్కును గుర్తించాలని యావన్మంది గిరిజనులు ఉద్యమించాలి.

– బొల్లి ముంత సాంబశివరావు- 98859 83526

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News