Friday, December 27, 2024

పిసాతోనే గిరిజన సాధికారత

- Advertisement -
- Advertisement -

ఐదవ షెడ్యూల్ ప్రాంతం పరిధిలోని భూములు, సహజ వనరులు, అటవీ సంపదతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక, అక్రమ మైనింగ్, భూగర్భగనులు, సంఘాలు, వ్యాపారాలు, ఇతరత్రా అభివృద్ధి కార్యాక్రమాలన్నీ పిసా చట్టం ప్రకారం పూర్తి ఆదివాసీలతో నిండిఉన్న గ్రామసభ ఆమోదం తప్పనిసరిగా ఉండాలి అదే చట్టబద్ధత. షెడ్యూల్ ప్రాంతాలలో నివసించే ప్రజలు గ్రామసభల ద్వారా స్వయం పాలనకు భారత ప్రభుత్వం రూపొందించిన షెడ్యూల్ ప్రాంతాలకు పంచాయతీ విస్తరణ (పెసా) చట్టం 1996 డిసెంబరు 24వ తేదీన అమలులోకి వచ్చింది. ఐదవ షెడ్యూల్ ప్రాంతాలలో నివసించే ప్రజలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి, పార్లమెంటు రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ఎం(4) (బి) ప్రకారం ‘పంచాయతీల నిబంధనల (షెడ్యూల్ ప్రాంతాలకు పొడిగింపు) చట్టాన్ని 1996లో రూపొందించింది.

పిసా రాజ్యాంగంలోని IX భాగాన్ని పంచాయితీలకు సంబంధించి, ఐదవ షెడ్యూల్ ప్రాంతాలకు, కొన్ని మార్పులు, మినహాయింపులతో విస్తరించడం. ఐదవ షెడ్యూల్ ప్రాంతాలను కలిగి ఉన్న రాష్ట్రాలు ఈ ప్రాంతాల కోసం పంచాయతీ చట్టాలను రూపొందించడానికి అధికారం కలిగి ఉన్నాయి. పంచాయతీల నిబంధనలు (షెడ్యూల్ ప్రాంతాలకు పొడిగింపు), చట్టం 1996 (పిసా), ఐదవ షెడ్యూల్‌లోని పంచాయితీలకు సంబంధించిన రాజ్యాంగంలోని IX భాగం యొక్క నిబంధనల పొడిగింపుకు సంబంధించిన అన్ని చట్టాలను రూపొందించడానికి రాష్ట్ర శాసనసభలకు అధికారం ఇవ్వబడింది. ప్రాంతాలు, చట్టంలోని సెక్షన్ 4లో అందించబడిన మినహాయింపులు, సవరణలకు లోబడి ఉంటాయి. పిసా అనేది పంచాయితీలకు సంబంధించిన రాజ్యాంగంలోని IXలోని పార్ట్‌లోని నిబంధనలను షెడ్యూల్ ప్రాంతాలకు పొడిగించడానికి కల్పించే చట్టం. ఈ చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం షెడ్యూల్ ప్రాంతాలు అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 244లోని క్లాజ్ (1)లో సూచించిన షెడ్యూల్ ప్రాంతాలు.

ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణలు తమ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టాల ప్రకారం తమ రాష్ట్ర పిసా నిబంధనలను రూపొందించి నోటిఫై చేశాయి. పిసా చట్టం, అటవీ ప్రాంతాల్లోని అన్ని సహజ వనరులకు సంబంధించి నియమాలు, నిబంధనలపై నిర్ణయం తీసుకునేందుకు గ్రామసభలకు అధికారం ఇస్తుంది. పిసా చట్టం గిరిజన ప్రజలు నివసించే అటవీ ప్రాంతాల నుండి సహజ వనరుల ప్రయోజనాలను పొందేందుకు మరిన్ని రాజ్యాంగ హక్కులను ఇస్తుంది. 1996 పిసా చట్టం సెక్షన్ 4(ఎ)(బి)(డి)(ఇ)(ఎం-1) చట్టం ప్రకారం ఏజెన్సీ గ్రామాల్లో ఆదివాసీల ఆచారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు, సామాజిక న్యాయం మతపరమైన పద్ధతులు, సామాజిక వనరుల నిర్వహణ, పరిరక్షణ, సాంప్రదాయ పద్ధతుల్లో వివాదాలు పరిష్కరించుకోవడానికి, అధికారాలను అమలు చేసుకోవడంతో పాటు లబ్ధిదారులను ఎంపిక చేసే అధికారం, రద్దు చేయడంలో అంతిమ అధికారాలు పిసా చట్టం ప్రకారం గ్రామసభకు మాత్రమే ఉంటుంది.

పిసా గ్రామసభ ఆమోదం, తీర్మానం అత్యంత కీలకమైనది. రాజ్యాంగంలోని 9వ భాగంలో పంచాయతీలకు సంబంధించి పొందుపరిచిన అంశాలను షెడ్యూల్ ప్రాంతాలకు వారి అవసరాలకి అనుగుణంగా వర్తింపచేయడం, షెడ్యూల్డ్ తెగల జనాభా కూటమికి స్వయం పాలన అవకాశాలు కల్పించడం, భాగస్వామ్య ప్రజాస్వామిక విధానం ద్వారా గ్రామ పరిపాలనను కొనసాగేలా చూడడం, గ్రామసభను అన్ని కార్యక్రమాలకు కేంద్రంగా చేయడం, షెడ్యూల్డ్ తెగల వారి సాంప్రదాయ ఆచారాలకు అనుగుణంగా ఉండే పాలనా కార్యచట్టాన్ని రూపొందించడం, షెడ్యూల్డ్ తెగల సమాజం సాంప్రదాయాలను, ఆచారాలను పరిరక్షించడం, వివిధ స్థాయిలలోని పంచాయతీరాజ్ వ్యవస్థలకు షెడ్యూల్డ్ తెగల అవసరాలకు అనుకూలమైన విధంగా వ్యవహరించటానికి అధికారాలను కల్పించడం, షెడ్యూల్ ప్రాంతాలలోని పంచాయతీరాజ్ కోసం రూపొందించే రాష్ట్ర శాసనాలు, సాంప్రదాయిక చట్టాలు, సామాజిక, మతపరమైన అలవాట్లు సాంప్రదాయక నిర్వహణ, సామాజిక వనరులు మొదలైన వాటికి అనుగుణంగా ఉండాలి. ప్రతి గ్రామసభ ప్రజల గ్రామ సాంప్రదాయాలను, ఆచారాలను, సాంస్కృతిక గుర్తింపును సమాజ వనరులను పరిరక్షించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి.

గ్రామ పంచాయతీలో సామాజిక ఆర్ధిక ప్రణాళికలు, పథకాలు వాటి రూపకల్పన, అమలుకు సంబంధించిన విషయాలలో సమ్మతిని తెలియజేయాలి.గ్రామస్థాయిలో ప్రతి పంచాయతీ ప్రణాళికలు, పథకాలు, నిధుల వినియోగం కోసం గ్రామసభ సమ్మతిని పొందాలి. షెడ్యూల్ ప్రాంతాలలో భూమి ఆక్రమణను నిరోధించాలి. షెడ్యూల్ ప్రాంతాలలో అభివృద్ధి పథకాల కోసం భూమిని స్వాధీనం చేసుకునే ముందు సంబంధిత పంచాయతీని సంప్రదించాలి. సర్వోన్నత న్యాయస్థానం చాలా తీర్పులలో దీనిని వెల్లడించింది. షెడ్యూల్ ప్రాంతాలలోని చిన్ననీటి వనరుల బాధ్యత పంచాయతీరాజ్ వ్యవస్థలకు అప్పగించాలి. షెడ్యూల్ ప్రాంతాలలోని గనులను, ఖనిజ వనరులను అద్దెకు ఇచ్చే ముందు తగిన స్థాయి పంచాయతీ లేదా గ్రామ సభ సిఫారసులు తప్పనిసరి. అల్ప ప్రాధాన్యత కల్గిన గనులు లేదా ఖనిజాల తవ్వకానికి రాయితీలను వేలం ద్వారా మంజూరు చేయుటకు ముందస్తుగా గ్రామసభ సిఫారసులు తప్పనిసరిగా ఉండాలి. పాలక పక్షాలు పిసా చట్టం పకడ్బందీగా అమలు చేయడం ద్వారా గిరిజన వర్గాల సాధికారత మూలం అవుతుంది. ఇది ఆదివాసీ ప్రజల ముఖ్యమైన, కీలకమైన చట్టంగా భావించి దీనిని రాజ్యాంగంగా భావిస్తూ షెడ్యూల్ ప్రాంత పరిధిలోని పని చేస్తున్న ఉద్యోగులు, ప్రజలు పిసా చట్టానికి అనుగుణంగా ప్రవర్తించాలి. అప్పుడే ఈ చట్టం ఆశయం నెరవేరుతుంది, అప్పుడే ఆదివాసీ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.

ఎన్.సీతారామయ్య
9440972048

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News