హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రూ. 12 కోట్లతో బాలికల కోసం గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు ఇచ్చింది. ఇందులో ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తరగతులు కొనసాగనున్నాయని, ఒక్కో తరగతిలో 40మందికి చదువుకునే అవకాశం ఉందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. సుమారు 400మంది గిరిజన విద్యార్థులకు గురుకుల విద్య అందనుందని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచే గురుకులాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మూల తాండాలో జన్మించిన మంత్రి సత్యవతి రాథోడ్ తాను జన్మించిన ఊరిలో కనీసం ఒక బడి కూడా అందుబాటులో లేక పోవడంతో చదువుపై ఉన్న ఆసక్తితో పక్కనే ఉన్న గుండ్రాతి మడుగుకు కాలినడకన వెళ్లి అక్కడ ఏడవ తరగతి వరకు చదువుకున్నారు.
ఆడపిల్లలను దూర ప్రాంతాలకు చదువులకు పంపించే ధైర్యం చేయని తల్లిదండ్రులకు మంత్రి నచ్చ జెప్పి తాను వరంగల్ లోని గురుకుల పాఠశాలలో చేరానని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు గురుకుల విద్యాలయాలలో కనీస సౌకర్యాలు కలిపంచకపోవడంతో ఇబ్బందులు పడ్డామని, భోజనం, వసతి కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో మంత్రి అక్కడనుండి తిరిగి పెద్దతండ చేరుకున్నట్లు తెలిపారు. అనేక కష్టాలు, ఒడిదుడుకులను ఎదుర్కొంటు సర్పంచ్ గా, జడ్పిటిసిగా, ఎంఎల్‌ఎగా ఎంఎల్‌సిగా, ఇప్పడు మంత్రిగా అంచలంచలు ఎదుగుతూ వచ్చారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలను అనుసరిస్తూ రాష్ట్రవ్యాప్తంగా గిరిజన సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు.గతంలో చదువు కోసం మంత్రి సత్యవతి రాథోడ్ తన చిన్నవయసులో ఎదుర్కొన్న సమస్యలు ఈ ప్రాంత వాసులు పడకూడదనే ఆలోచనతో, గిరిజన ప్రాంతాల్లో గురుకులాల ఏర్పాటు చేస్తున్న ముఖ్యమంత్రికి మహబూబాబాద్ లో సైతం బాలికలకు ప్రత్యేకంగా గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలని కోరారు.
అందుకు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి మహబూబాబాద్ జిల్లాకు బాలికల గురుకుల విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి మంజూరు ఇచ్చారు.గిరిజన పిల్లలు సైతం ఉన్నత చదవులు చదవాలనే ఉద్దేశంతో బిఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని మండలాలకు గురుకుల పాఠశాలను మంజూరు చేస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్న చోట గురుకుల పాఠశాల తరగతులను ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రైవేట్‌కు దీటుగా గిరిజన గురుకుల పాఠశాలను నిర్మించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. గురుకుల పాఠశాల్లో చదివిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధిస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అనేక గురుకులాలను ఏర్పాటు చేసి, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, వసతి సౌకర్యాలు కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.
విద్యా రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిస్తుందని తెలిపారు. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గురుకులాలు విద్యార్థుల ఉజ్వల భవితకు బంగారు బాటలు వేస్తున్నాయన్నారు. గతంలో గిరిజన గురుకులాలు కేవలం 91 ఉంటే రాష్ట్రం ఏర్పడ్డ అనతి కాలంలోనే అదనంగా మరో 92 గురుకులాలను ఏర్పాటు చేయడంతో వాటి సంఖ్య 183 కు చేరిందని మంత్రి స్పష్టం చేసారు. ఇప్పుడు మరో 3 గురుకులాలకు మంజూరు ఇవ్వడంతో గిరిజన గురుకులాల సంఖ్య 186 కు చేరిందన్నారు. మహబూబాబాద్‌లో ఒకటి, సంస్థాన్ నారాయణపురం ఒకటి, కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం హన్మాజీపేట- కోనాపూర్‌లో మరో గురుకుల విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంజరిగిందని తెలిపారు.