Monday, December 23, 2024

అపూర్వ సాహితీ సింగిడి

- Advertisement -
- Advertisement -

సాధారణంగా గిరిజన సాహిత్యం అనగానే మౌఖిక మైనది అనే మాట పూర్వకాలం నుంచి మనకు అలవాటు. కానీ కాలంతో పాటు మానవ మనుగడలో వచ్చిన మార్పులు కారణంగా మన మూలవాసులైన ఆదివాసుల జీవన విధానంలో కూడా అనేక మార్పులు వచ్చాయి. వాటికి కారణం గిరిజన విద్యా వికాసమే. గత నాలుగు దశాబ్దాలకు గిరిజనుల్లో అక్షరాస్యత రేటు గణనీయంగా పెరుగుతోంది, దరిమల గిరిజన యువత విద్యాధికులై ఉద్యోగాలు సాధించి ఉపాధి పొందడంతో పాటు తమ జాతి మూలాల్లోకి తొంగి చూసి వాటిని భావితరాల కోసం అందించాలనే ఆరోగ్యకరమైన ఆశయంతో ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే ఆధునిక ఆదివాసి యువత విశ్వవిద్యాలయ స్థాయి చదువులతో ప్రామాణికమైన పరిశోధకులుగా, రచయితలుగా, సృజన కారులుగా, ఎదుగుతున్నారు.ఈ ఒరవడిలో ఎదిగిన ఆదివాసీ వ్యాసుడే…‘గుమ్మడి లక్ష్మీనారాయణ’ విద్యార్థిగా సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ ఉంది. ఉపాధ్యాయ వృత్తిలో జీవనం గడుపుతూ ప్రవృత్తిగా వ్యాసరచన కొనసాగిస్తున్నారు.

ఆయన వ్రాసిన వ్యాసాలను ఒక చోట చేర్చి ‘ఆదియోధులు – అజరామరులు‘ అనే పేరుతో పుస్తకం ప్రచురించారు. మొత్తం 68 వ్యాసాలు గల ఈ ప్రామాణిక గ్రంథంలోని వ్యాసాలను రచయిత సౌలభ్యం కోసం నాలుగు వర్గాలుగా విభజించారు. ఆదివాసీ వీర యోధులు, ఆదివాసి ఆత్మ బంధువులు, అజరామరులు, పురాణ ఆదివాసులు. వీటికి తోడు అనుబంధంగా ఆరు చిరు వ్యాసాల్లో గిరిజన ఉద్యమాలు, వాటి కారణాలు, అంతరిస్తున్న గిరిజన జనాభా, ఐదవ షెడ్యూల్ లో రక్షణలు, నెహ్రూ పంచశీల సూత్రాలు, చరిత్రలో ఆదివాసి ఘట్టాలను చేర్చారు.ఈ పుస్తకం రాయడంలో రచయిత పాటించిన నియమాలు విషయ వివరణలను గమనిస్తే ఇది పక్కా పరిశోధక రచన అనుకోవడంలో సందేహం లేదు. తమ గిరిజన జాతి ఉద్ధరణ కోసం జీవితాలను త్యాగం చేసి వీరత్వం పొందిన ‘ఆదివాసి వీరయోధుల‘ త్యాగాల చరిత్రను నేటి తరంకు తెలిపే పరంపరలో భాగంగా ఆదివాసీ ధీరవనితలైన సమ్మక్క – సారక్కలు మొదలు నక్సల్బరీ పోరాట వనిత ‘శాంతి ముండా‘ వరకు 25 మంది గిరిజన వీరుల విశేషాలు ఇందులో మనం చదువుకోవచ్చు. వీరిలో ప్రాచుర్యం పొందిన బిర్సా ముండా, రాంజీ గోండు, కుమరం భీమ్, దుర్గావతి, రాణిమా గైడిన్ల్యూ, గంటందొర, మల్లుదొర వంటి వారి పోరాట విశేషాలతో పాటు మర్రి కామయ్య, కుమరం సూరు, సోయం గంగులు, కుంజా రాము వంటి నేటి తరానికి తెలియాల్సిన గిరిజన వీరుల వివరాలు కూడా ఇందులో ఉన్నాయి.

ఇక రెండవ వర్గంలో గిరిజనుల అభివృద్ధి కోసం తన జీవితాలను అర్పించిన గిరిజనేతర వ్యక్తులతో పాటు, మరికొందరు గిరిజన చరితార్ధులను, వారి వారి కృషిని గురించి కూలంకషంగా సహేతుకంగా ఆధారాలతో వివరించారు లక్ష్మీనారాయణ. అంబేడ్కర్, హైమన్ డార్ప్ మొదలుకొని జైపాల్ సింగ్ ముండా, మహశ్వేతా దేవి, గిడుగు, బాలగోపాల్, బి.డి.శర్మ వంటి పెద్దలు అడవి బిడ్డల ఉన్నతి కోసం ఏ విధంగా కృషి చేశారో ఇందులో వివరణాత్మకంగా వివరించారు. మూడవ వర్గం అయిన ‘అజరామరులు – ఆదర్శ మహనీయులు‘ లో అల్లూరి మొదలు ఇటీవల పద్మశ్రీ పొందిన ‘సకిన రామచంద్రయ్య‘ వరకు12 మంది స్ఫూర్తి ప్రదాతల కృషిని గురించిన వివరణ చేశారు. గిరిజన సామాజిక వర్గం నుండి తొలిసారిగా కలెక్టర్ ఉద్యోగం పొందిన మడవి తుకారాం, గిరిజనుల పాలిట ఆశాజ్యోతి గా వెలుగొంది న జంగుబాయి, గుస్సాడీ నృత్యానికి గురువుగా నిలిచిన కనకరాజు మొదలైన వారి జీవన విశేషాలు గణాంకాలతో పాటు వివరించి చెప్పారు. వ్యాసం అంటేనే విస్తృతమైన సమాచార ప్రవాహాన్ని స్వీకరించి, అవసరమైనంత మేర మాత్రమే సంక్షిప్తంగా, సూటిగా, సహేతుకంగా పాఠకులకు ఆసక్తికరంగా అందించడం, మరి ఇలాంటి ఉత్తమ లక్షణాలన్నీ మన ‘గుమ్మడి‘ వారి ప్రతి వ్యాసంలో కనిపిస్తాయి.

వాక్య నిర్మాణం, భాష, గణాంకాలు, నిబద్ధత పాటించడంలో వ్యాసకర్త తీసుకున్న శ్రద్ధ ఆదర్శనీయంగా ఉంది. విషయం సేకరించడంలో లక్ష్మీనారాయణ గారి కృషి నూతన వ్యాసకర్తలకు, పరిశోధక విద్యార్థులకు, అత్యవసరం అని చెప్పాలి. ఆదిలాబాద్ గిరిజన పోరాటం అనగానే వెంటనే కుమరం భీమ్ పోరాటం, అమరత్వం, గుర్తుకు వస్తాయి. కానీ వాటికంతటికి అసలు కారకుడు, పోరాట వ్యూహకర్త కుమరం సూరు మాత్రం కొందరికే తెలుసు. గుమ్మడి గారి ఈ ‘వ్యాస సంపుటి‘ ద్వారా ఇలాంటి చాలామంది ఆజ్ఞాత వ్యక్తులు చేసిన కృషిని తెలుసుకోవచ్చు. అణగారిన వర్గాలైన ఆదివాసుల గురించి పరిశోధనలు, వార్తలు, విశ్లేషణలు, మొదలైనవి తరచూ చూస్తూనే ఉంటాం. ఈ విషయంలో గిరిజనేతరులు చేస్తున్న నిస్వార్థ కృషిని సైతం గుర్తించిన సహృదయ రచయిత లక్ష్మీనారాయణ అనవచ్చు.అందులో భాగంగానే ఆదివాసి ఆత్మబంధువుగా, మలిదశ తెలంగాణ పోరాట మార్గదర్శిగా నిలిచిన ‘బియ్యాల జనార్ధన రావు‘ అక్షర కృషిని కూడా ఇందులో వివరించారు. 1985లో‘గిరిజన భూముల పరాయీకరణ‘ అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేటు అందుకున్న జనార్ధన్ రావును ఆదివాసులపై పరిశోధన చేసిన ‘తొలి గిరిజనేతర పరిశోధకుడు‘ గా సూత్రీకరించారు వ్యాస రచయిత.

గిరిజనులు అంటే పోరాటాలు, త్యాగాలే కాదు చక్కని సంస్కృతి సాంప్రదాయాలకు చిరునామాదారులు. అందులో భాగంగానే పురాణాల్లో అడవి బిడ్డల స్థానం గురించి కూడా ఆసక్తికరంగా వివరించారు లక్ష్మీనారాయణ. భారతీయ చరిత్ర, సంస్కృతిలో ఆచార సంప్రదాయాల మేళవింపు లో అంతర్భాగమైన ఆదివాసీలకు చెందిన పదకొండు పాత్రలను ఎంచుకొని వివరించారు. వాల్మీకి నుండి నరకాసురుడు వరకు గల వ్యక్తులను వారి వారి గుణగణాలు, చారిత్రక నేపథ్యాలు ఆధారంగా అభివర్ణించారు. భద్రాద్రి రామాలయం నిర్మాణానికి ప్రేరకురాలు అయిన రామ భక్తురాలు పోకల దమ్మక్క గిరిజన స్త్రీ కాగా ఆమె పూర్వ జన్మలో శబరి అని అక్కడి గిరిజనుల విశ్వాసంగా పేర్కొన్నారు. అందుకు ప్రత్యేకంగానే ప్రతి ఏడాది ఆశ్వీజ మాసంలో భద్రాచలంలో ‘శబరి సంస్కృతి యాత్ర‘ చేస్తున్నట్టుగానే ఆషాడ మాసం లో పోకలదమ్మక్క కి ఆధ్యాత్మిక పండుగ జరపాల్సిన బాధ్యత ఆ ప్రాంత వాసులది అని విలువైన సూచన చేశారు వ్యాసకర్త. అలాగే భారతంలోని భీముని భార్యగా చెప్పబడే ‘హిడింబి‘ త్యాగశీలం, ఏకలవ్యుడి గురుభక్తి, ఎంతటి కోపా వేశాలనైనా తన శాంత గుణంతో మార్చే మహిమగల చెంచులక్ష్మి శాంత స్వభావం వివరిస్తాడు.

దుష్టుడైన హిరణ్యకశిపుని అంతంమొందించడానికి ఉగ్ర నరసింహ అవతారం ఎత్తిన నారాయణమూర్తి ఉగ్రత్వాన్ని నివారించి అతడినే మనువాడిన చెంచులక్ష్మి శాంత స్వరూపం గురించి ఇందులో సహేతుకంగా వివరించారు. ఇలా… ఎన్నో ఆసక్తికర విషయాలు ఆధారంగా సచిత్రంగా అందించబడ్డ ఈ పుస్తకం పరిశోధక విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మానవ జాతికి ఆధారమైన మూలవాసులు గా చెప్పబడే గిరిజనుల విశేషాలు తెలుసుకోవాలి అనుకునే వారికి కూడా ఈపుస్తకం ద్వారా అనేక విషయాలు, విశేషాలు లభ్యమవుతాయి.

ఆది యోధులు అజరామరులు
(వ్యాస సంపుటి), పేజీలు: 180, వెల: 200, ప్రతులకు: గుమ్మడి లక్ష్మీనారాయణ, 94913 18409.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News