Monday, November 18, 2024

ఇది గిరిజనుల విజ్ఞతకు పరీక్ష

- Advertisement -
- Advertisement -

ఖనిజ సంపదకు నెలవైన గిరిజన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం ఈసారి హోరాహోరీగా ఉండే పరిస్థితి ఏర్పడింది. గతంలో ఒకసారి ఎదురైన పరాజయంతో బిజెపి ఈసారి ఎలాగైనా జార్ఖండ్ కోటపై జెండా ఎగురవేయాలన్న గట్టి పట్టుదలతో ఉంది. మరోవైపు అధికారంలో ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చా కాంగ్రెస్ కూటమి ఆదివాసీల హక్కులను పరిరక్షించుకోవడమే కాక, ప్రాంతీయ స్వయం ప్రతిపత్తిని నిలబెట్టుకోవాలని ఆకాంక్షిస్తోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 81 స్థానాల్లో 72 చోట్ల బిజెపి పోటీ చేసి 37 స్థానాలను దక్కించుకోగలిగింది. మిత్రపక్షం ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఎజెఎస్‌యు) దక్కించుకున్న ఐదు స్థానాలను కలుపుకుని మెజార్టీ మార్కుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. కానీ స్వయంకృతాపరాధాలతో నిలదొక్కుకోలేక 2019లో పరాజయం పాలైంది.

2015 2020 మధ్య గిరిజనేతర నాయకత్వంతో దెబ్బతిన్న బిజెపి ఈసారి స్థానిక వర్గాలతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఎజెఎస్‌యుతో మిత్రత్వం పెంపొందించుకుని గిరిజన తెగల్లో ప్రధానమైన కుర్మీ ఓట్లను కొల్లగొట్టడానికి పావులు కదుపుతోంది. జార్ఖండ్‌లో కుర్మీ, సంథాల్ పరగణా గిరిజన తెగల ప్రభావం ఎక్కువ. వీరి ఓట్లే విజయం నిర్ణయించడంలో కీలక పాత్ర వహిస్తాయి. సంథాల్ పరగణా రీజియన్‌లో 18 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ రీజియన్‌లో మొదటి నుంచి జెఎంఎంకు గట్టిపట్టుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రీజియన్‌లో జెఎంఎం 9 స్థానాలు, కాంగ్రెస్ 5, బిజెపి 4 స్థానాలు దక్కించుకున్నాయి. అయితే ఇక్కడ బలమైన కుర్మీలు ప్రస్తుతం వెనుకబడిన వర్గాల జాబితాలోనే ఉన్నారు. తమను షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చాలని గత కొన్నేళ్లుగా వీరు డిమాండ్ చేస్తున్నారు. 2004, 2015లో అప్పటి జార్ఖండ్ ప్రభుత్వాలు కుర్మీలను షెడ్యూల్డ్ తెగగా గుర్తించాలని కేంద్రానికి సిఫార్సు చేసినా, కేంద్రం వ్యతిరేకించింది.

ఈసారి బిజెపికి ఇది ప్రధాన సమస్య కానుంది. అవినీతి కేసులో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కొన్నాళ్లు జైలు జీవితం గడిపినా, ఆ ప్రభావం రాష్ట్రంలో కనిపించడం లేదు. గిరిజన వర్గాల్లో సోరెన్‌కు ఉన్న పలుకుబడి తగ్గలేదు. అక్రమ ఆస్తుల కేసులో హేమంత్ అరెస్ట్ వ్యవహారం చూపించి, గిరిజనుల ఆత్మగౌరవ అంశాన్ని ఈ ఎన్నికల్లో బలంగా లేవనెత్తాలని జెఎంఎం ప్రయత్నిస్తోంది. సంథాల్ పరగణా లాంటి గిరిజన మారుమూల ప్రాంతాల్లో తమకు ఢోకా లేకున్నా పట్టణ ప్రాంతాల్లో బిజెపిని గట్టిగా ఢీకొట్టేందుకు కాంగ్రెస్ సహాయం తనకు ఉపయోగపడుతుందని జెఎంఎం నాయకత్వం విశ్వసిస్తోంది. అయితే రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయిన గిరిజన నాయకుడు బాబూలాల్ మరాండీ ప్రతిపక్ష నేతగా బిజెపికి గట్టి మద్దతు ఇస్తుండడం బిజెపికి కలిసివచ్చిన అంశం.

జార్ఖండ్ ఆదివాసీల, బలహీన వర్గాల ఉనికిని, హక్కులను రక్షించుకోవడమే తమ ప్రధాన లక్షంగా జెఎం ఎం ప్రచారం సాగిస్తోంది. ఇదే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజకీయ సిద్ధాంత పునాదిగా ఉంటోంది. బిజెపి హిందుత్వ, కార్పొరేట్ అనుకూల విధానాలను ఎండగడుతున్నారు. మహిళా ఓటర్లను ఆకట్టుకోడానికి మయ్యా సమ్మాన్ యాత్ర ప్రారంభించారు. మయ్యా సమ్మాన్ యోజన పథకం కింద 18 నుంచి 50 ఏళ్ల మహిళలకు నెలకు రూ. 1000 నగదు పంపిణీ అవుతుందని స్పష్టం చేశారు. 2021 జనాభా లెక్కల్లో సర్నా అనే ప్రత్యేక గిరిజన మతస్థులను చేర్చడానికి వీలుగా సర్నాకోడ్‌పై 2020లో అప్పటి జార్ఖండ్ ముక్తిమోర్చా ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి పంపించినట్టు గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా బిజెపి తన ‘పంచ్‌ప్రాణ్ ’ పేరిట వాగ్దానాలు చేసి సంక్షేమ పథకాల ప్రచారం సాగిస్తోంది. జెఎంఎం ప్రభుత్వం ఎంతవరకు తన హామీలను నెరవేర్చిందో చెప్పాలని ఓటర్లను ‘మిలా క్యా’ (హామీలు ఏమైనా నెరవేరాయా) అని ప్రశ్నిస్తోంది.

రాష్ట్ర ఖనిజ సంపద సమర్ధ నిర్వహణ, సంరక్షణ, రాయితీల పంపిణీ, ఆర్థికాభివృద్ధి తమ ప్రధాన లక్షాలుగా చెబుతోంది. జెఎంఎం నేతృత్వంలోని ఖనిజ వనరుల అజమాయిషీ అస్తవ్యస్తంగా సాగుతోందని, తాము అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్‌గా పని చేసి అభివృద్ధిని చూపిస్తామని బిజెపి చెబుతోంది. అయితే రాష్ట్రానికి అక్రమ వలసలు తీవ్ర సమస్యగా తయారైంది. ఈ విషయంలో జెఎంఎం ఘోరంగా విఫలమైందని బిజెపి ధ్వజమెత్తుతోంది. దీనికి తోడు యువకులకు ఉద్యోగాల కల్పనలో వెనుకబాటుతనం, అవినీతిని నివారించలేకపోవడం ఇవన్నీ జెఎంఎం లోపాలుగా కనిపిస్తున్నాయి. జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 13, 20 తేదీల్లో జరుగుతాయి. నవంబర్ 23న వెలువడనున్న ఫలితాల్లో ఓటర్లు మళ్లీ ఇదే ప్రభుత్వాన్ని గెలిపిస్తారో లేదా మార్పును కోరుకుంటున్నారో గిరిజనుల విజ్ఞతకే ఇది పరీక్షగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News