ఫారెస్ట్ అధికారిపై పెట్రోల్ పోసిన గిరిజన మహిళ రైతు
పోడు భూముల్లో హరితహారం వివాదం
గిరిజనులు ఫారెస్టు అధికారులు మధ్య వాగ్వివాదం
మొక్కలు నాటడానికి వెళ్లిన అధికారులను అడ్డుకున్న గిరిజనలు
ఘటనా స్థలికి ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్
ఫారెస్ట్ అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే
పెట్రోల్ దాడి చేసిన వారిపై ఫిర్యాదు
నాగర్‌కర్నూల్: అటవీ పోడు భూముల పంచాయితీ, అటవీ శాఖ అధికారులపై పెట్రోల్ దాడికి దారి తీసింది. అడవులను నరికి సాగు చేసుకుంటున్న భూముల విషయంలో అటవీ శాఖ అధికారులు, రైతుల మధ్య వివాదాలు ముదురుతున్నాయి. తాజాగా నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచవరం గ్రామంలో గిరిజనులు గత కొన్ని సంవత్సరాల నుంచి అడవిని నరికి సాగుకు యోగ్యంగా భూములు మలుచుకొని పంటలు పండించి జీవనం కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం అటవీ శాఖ అధికారలు మాచారం అటవీ భూముల్లో మొక్కలు నాటడానికి వచ్చారు. అటవీ హద్దులలో సున్నం మార్కులు వేస్తూ కందకాలు తీయడానికి సమాయత్తం కాగా కొందరు గిరిజన రైతులు అధికారులుతో వాగ్వివాదానికి దిగారు. అందులో ఓ మహిళ తనవెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్‌తో ఒక్కసారిగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌పై చల్లింది. అంతటితో ఆగకుండా వాగ్వివాదానికి దిగిన మరో వ్యక్తి నుంచి అగిపెట్టెను తీసుకొని నిప్పు పెట్టడానికి యత్నించగా అక్కడే ఉన్న అటవీ శాఖ సిబ్బంది అడ్డుకున్నారు.
ఈ వివాదం కాస్త సోషల్ మీడియా వైరల్ కావడం , గిరిజనులు విషయాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజుకు చెప్పడంతో ఆయన హుటాహుటిన సంఘటనస్థలానికి పోడుభూముల సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వీలైనంత తొందరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని, రైతులకు హామీనిచ్చారు. ఇదిలావుండగా అటవీ భూముల్లో సాగు చేస్తున్న రైతుల వద్ద ఆర్‌ఓఆర్ పట్టాలు లేవని ఆ భూములన్నీ 2005 తర్వాత సాగు చేసుకుంటున్న కారణంగా వారికి ఆర్‌ఓఆర్ పట్టాలు ఇంత వరకు రాలేదని అటవీ శాఖ అధికారులు ఆరోపించారు. అటవీ శాఖ అధికారులు , సిబ్బంది తమ పనులు తాము చేసుకుంటుండగా గిరిజన మహిళ ఫారెస్ట్ అధికారిపై పెట్రోల్ పోయడం జరిగిందని, బేస్ లైన్ వేయడానికి తీసుకెళ్లిన సున్నం బస్తాలను పగలగొట్టడం జరిగిందని, అటవీ శాఖ అధికారులను అసభ్యకరమైన మాటలతో దూషించడం జరిగిందని అటవీ శాఖ అధికారులు అన్నారు.