Thursday, January 23, 2025

తెలంగాణలో గిరి వికాసం

- Advertisement -
- Advertisement -

గ్రామపంచాయితీలుగా 3,146 తండాలు, గూడెంలు
ఎస్‌టిలకు గృహ, వ్యవసాయ విద్యుత్ ఉచితం
యువ పారిశ్రామిక వేత్తలకు ఆర్థిక ప్రోత్సాహం
గురుకులాలతో విద్యాభివృద్ధి


మన తెలంగాణ / హైదరాబాద్ : ఆదివాసి, గిరిజనుల సమగ్రాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది. గిరిజన తండాలు, గూడెంలకు గ్రామ పంచాయితీ హోదా కల్పించడం, గిరిజన గురుకులాలతో విడ్యావికాసం, ఉచితంగా గృహ, వ్యవసాయ విద్యుత్, యువ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఆర్థిక సహకారం అందించడం, పల్లె ప్రగతి ద్వారా ఎస్‌టి గ్రామ పంచాయితీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దే కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. గిరిజన ఆవాసాలకు బిటి రోడ్లు, మౌలిక వసతుల కల్పన ద్వారా గిరిజన జీవితాల్లో వెలుగులు తేవడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఏజెన్సీ ఏరియాల్లో ఆరోగ్య పరిరక్షణకు, విషజ్వరాల కట్టడికి ప్రభుత్వం ప్రాధాన్యత నిచ్చింది. గిరిజన అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి రూ.75,450 కోట్లు కేటాయించింది. అందులో ఇప్పటి వరకు రూ.47,258 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. గిరిజన గూడాలు, తండాలను గ్రామ పంచాయితీలుగా గుర్తించాలని దశాబ్దాలుగా చేస్తున్న పోరాటాలకు తెలంగాణ ప్రభుత్వం ముగింపు పలికింది. గిరిజనుల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో 3,146 తండాలు, గూడెంలను గ్రామ పంచాయతి హోదా కల్పించడం జరిగింది. దీని ద్వారా 3,146 మంది గిరిజన సర్పంచులు, 24,682 మంది వార్డ్ సభ్యులు పరిపాలనలో పాలుపంచుకుంటున్నారు. గిరిజన గ్రామ పంచాయితీల్లో రూ.1,837.08 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. గ్రామ పంచాయితీ భవనాల నిర్మాణాలకు రూ. 300 కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించారు.

ఆదర్శవంతంగా గిరిజన గ్రామ పంచాయయితీలు

Big platform for tribal culture in Telangana

పల్లె ప్రగతిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌టి గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్లను సమకూర్చింది. పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డ్, వైకుంఠధామాలు తదితర వసతులను కల్పించడం జరిగింది. 1,682 ఆవాసాలలో రూ.1,276 కోట్లతో బిటి రోడ్లను నిర్మించారు. ప్రస్తుత సంవత్సరం 2,090 గిరిజన పల్లెల్లో రోడ్ల అభివృద్ధికి రూ.1000 కోట్ల కేటాయించారు. ఆదివాసి తెగలు నివసిస్తున్న గ్రామాల్లో అంతర్గత సిసి రోడ్లు, మురుగు నీటి పారుదలకు ప్రత్యేక నిధుల కింద రూ.133 కోట్లు కేటాయించారు.

గిరిజన ఆవాసాలకు ఉచిత విద్యుత్తు

గిరిజన సామాజిక వర్గాల నివాస గృహాలకు తెలంగాణ ప్రభుత్వం 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తోంది. రూ. 221 కోట్ల ఖర్చుతో ఆదివాసి గిరిజనుల వ్యవసాయానికి కావాల్సిన మెరుగైన విద్యుత్ సరఫరా కోసం మూడు ఫేజ్ లైన్లను అభివృద్ధి చేయడం జరిగింది.

ప్రత్యేక గురుకులాలతో విద్యావికాసం

 

విద్యా రంగంలో గిరిజన వికాసం కోసం తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రత్యేకంగా 92 గురుకులాలను ఏర్పాటు చేశారు. వాటిలో రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు, ఫైన్‌ఆర్ట్ కాలేజీలు, లా కాలేజీ, సైనిక్ స్కూల్, కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్నాయి. గురుకులాల్లో శిక్షణ పొందిన 918 మంది ఎస్‌టి విద్యార్థినీ విద్యార్థులు ఐఐటి, ఎన్‌ఐటి, ఐఐఐటి, ఇతర వృత్తిపరమైన కోర్సుల్లో ప్రవేశాలు పొందడం గమనార్హం. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద గిరిజన విద్యార్థుల విదేశీ విద్యకు రూ.20 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ.33.49 కోట్లతో 237 మంది విద్యార్థులు లబ్దిపొందారు.

ఏజెన్సీ ఏరియాల్లో ఆరోగ్య పరిరక్షణ

మిషన్ భగీరథ ద్వారా రక్షిత తాగునీటిని అందించడం వల్ల విషజ్వరాల మరణాలు అరికట్టడంలో తెలంగాణ ప్రభుత్వం సఫలీకృతం అయ్యింది. కెసిఆర్ కిట్ పథకం ద్వారా 2,28,089 ఎస్‌టి సామాజిక వర్గానికి చెందిన మహిళలు రూ.151 కోట్ల మేర లబ్దిపొందారు. ఆదివాసి గిరిజనుల్లో పౌష్టికాహార లోపం నివారించేందుకు గిరి పొషణ పథకాన్ని అమలు చేస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 821 ఆవాసాలలో పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతోంది.

యువ పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం

ఆదివాసి గిరిజనులు పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి ప్రభుత్వం సిఎం ఎస్‌టి ఎంటర్‌ప్రిన్యూర్ షిప్ అండ్ ఇన్నోవేషన్ పథకాన్ని అమలుచేస్తోంది. ఇందు కోసం ప్రత్యేక శిక్షణనిస్తున్నారు. పారిశ్రామిక యూనిట్లు నెలకొల్పేందుకు భారీ ఆర్థిక మద్దతు అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 162 మంది ఎస్‌టి పారిశ్రీమికవేత్తలకు లబ్ది చేకూరింది. డ్రైవర్ ఎంపవర్‌మెంట్ కార్యక్రమం రూరల్ ట్రాన్స్‌పోర్ట్ పథకం కింద రూ.101.50 కోట్ల ఖర్చుతో 1424 మంది గిరిజన యువకులకు వాహనాలను సమకూర్చడం జరిగింది. ఆదివాసి యోధుడు కొమరం భీమ్, బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహరాజ్‌ల జయంతులను, సమ్మక్క సారలమ్మ జాతరను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఆదివాసీల కోసం కొమురం భీమ్ స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆసిఫాబాద్ జిల్లాకు కొమురంభీమ్ జిల్లాగా నామకరణం చేయడం జరిగింది. సారలమ్మ మ్యూజియాన్ని మేడారం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్‌లో ఆదివాసి, బంజారా భవన్‌లను నిర్మించడం జరిగింది. రైతుబంధు పథకంద్వారా ఎస్‌టి వర్గానికి చెందిన 8 లక్షల 23 వేల 780 మంది రైతులకు 7,354 కోట్ల పెట్టుబడి సహాయాన్ని అందించడం జరిగింది. ఆసరా పించన్లు, కళ్యాణలక్ష్మి పథకాలను గిరిజ ఆడబిడ్డల వివాహలకు ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News