Monday, December 23, 2024

తండాలకు పంచాయతీల హోదాతో గిరిజనులకు పాలనాధికారం

- Advertisement -
- Advertisement -

రఘునాథపాలెం: గిరిజనుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కెసిఆర్ ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని, తండాలకు పంచాయతీల హోదాతో గిరిజనులకు పాలనాధికారం కల్పించిన ఘనత సిఎం కేసీఅర్‌దే అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకుని గిరిజన దినోత్సవం సందర్భంగా రఘునాథపాలెం మండలం లచ్చిరాం తండా గ్రామం, దొనబండ గ్రామం, మంగ్య తండా గ్రామం, కెవి బంజర గ్రామం, మూలగూడెం గ్రామం, ఎన్‌వి బంజర గ్రామం, రజబల్లి నగర్ గ్రామం ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.20 లక్షలు చొప్పున మొత్తం రూ.1.40 కోట్ల విలువైన నిర్మాణ పనులకు మంత్రి పువ్వాడ శంకుస్థాపన చేశారు.

ఆయా గ్రామాల్లో గిరిజన మహిళలు తమ సంప్రదాయ నృత్యాలతో మంత్రి పువ్వాడకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ తండాలకు గ్రామ పంచాయతీ హోదా కల్పించి బంజారాల చిరకాల వాంఛను నెరవేర్చారని, దీనివల్ల తండాలను గిరిజనులే సర్పంచులు, వార్డ్ మెంబర్లుగా ఎన్నికై పాలించుకుంటున్నారని తెలిపారు. రఘునాథపాలెం మండలంలో 17గ్రామ పంచాయతీలు ఉండగా వాటిని 37 గ్రామాలకు పెంచుకున్నామని, టిలో 20 తండాలను కొత్త గ్రామాలుగా మార్చి స్వయం పాలనా చేసుకునే విధంగా అవకాశం కల్పించడం జరిగిందన్నారు. నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పడిన తండాలలో రూ. 20 లక్షల చొప్పున నిధులతో నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవనాలు అభివృద్ధికి బాటలు వేస్తాయి పేర్కొన్నారు. దేశంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బంజారాల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీఠ వేస్తోందని, హైద్రాబాద్ లో బంజారా లకు ఆత్మగౌరవం కల్పించే విధంగా ప్రభుత్వం బంజారా భవన్ నిర్మిస్తున్నదని, గిరిజనుల అభ్యున్నతే ధ్యేయంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వివరించారు.

అడవి బిడ్డలైన బంజారాల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. గిరిజనులకు పాలనాధికారం కల్పించాలనే లక్ష్యంతో 500 జనాభా కలిగిన ప్రతి తండాను గ్రామ పంచాయతీ హోదా కల్పించారని అన్నారు. గ్రామ పంచాయతీలకు పక్కా భవనాల నిర్మాణాల కోసం ఒక్కో జీ.పీ కి రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రతి తండాకు రోడ్డు సదుపాయం ఏర్పడిందని, 100 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తున్న గిరిజన కుటుంబాలకు ఉచిత విద్యుత్ అమలవుతోందని గుర్తు చేశారు. అన్నింటికి మించి గిరిజన బిడ్డలకు అధునాతన సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్యా బోధన అందాలనే తాపత్రయంతో కొత్తగా ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వ సంకల్పంతో ప్రస్తుతం ప్రతి ఏటా సుమారు లక్ష మంది వరకు గిరిజన బిడ్డలు ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో నాణ్యమైన విద్యను అభ్యసిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఆరు శాతానికి పరిమితమైన గిరిజన రిజర్వేషన్ ను జనాభా ప్రాతిపదికన పది శాతానికి పెంచిన ఫలితంగా విద్యా, ఉద్యోగావకాశాలు మెరుగుపడ్డాయని అన్నారు. అన్నింటికీ మించి గిరిజన తండాల్లోని ప్రతి గుడిసె, ప్రతి ఇంటికి ప్రభుత్వం కుళాయిల బిగించి మిషన్ భగీరథ ద్వారా రక్షిత మంచినీటిని అందిస్తోందని, దీనివల్ల అడవి బిడ్డలకు విష జ్వరాలు, అనారోగ్యాల బారిన పడే పరిస్థితి దూరమయ్యిందని అన్నారు. అభివృద్ధికి పాటుపడుతున్న ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని మంత్రి కోరారు.గత పాలకుల కాలంలో గ్రామాలు వెనుకబడిపోయాయని, బిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల ముఖ చిత్రాలు మారిపోయాయని అన్నారు. గ్రామ పంచాయతీలకు నేరుగా నెలనెల నిధులు మంజూరు చేస్తూ మన గ్రామాలను మనమే అభివృద్ధి చేసుకునే సౌలభ్యం కలిగిందన్నారు. నేడు గ్రామాలు పట్టణాలకు దీటుగా అభివృద్ధి చెందాయి అని, గ్రామాల్లో రోడ్లు, మంచినీరు, విద్యుత్, ప్రాథమిక విద్యా, ప్రాథమిక ఆరోగ్యం వంటి అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. నేడు గ్రామాలు పట్టణాలతో అభివృద్ధితో పోటీపదుతున్నయని, అభివృద్ధి చెందిన గ్రామ పంచాయతీలను కేంద్ర ప్రభుత్వమే గుర్తించి అవార్డులు అందజేస్తున్న స్థాయికి మన గ్రామాలు ఎదిగాయని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ పెద్దపీఠ వేస్తూ అత్యధిక నిధులు కేటాయిస్తూ, అభివృద్ధి పనులను చేపడుతున్నామన్నారు. గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తున్నమని.. గ్రామ గ్రామాన వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డుల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసి వాటిని పూర్తి చేసిందన్నారు.అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఏజెన్సీ మారుమూల గ్రామాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయమని.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రహదారుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తుందన్నారు. మారుమూల గ్రామాలలో సైతం రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు కోట్లాది రూపాయల నిధులను కేటాయించిందన్నారు. పల్లెల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం పాటుపడుతుందని తెలిపారు. అనంతరం గిరి వికాస్ పథకం ద్వారా రైతులకు వంద శాతం సబ్సిడీతో మోటార్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీర్‌ఎస్‌పార్టీ మండల అధ్యక్షులు అజ్మీర వీరు నాయక్, మార్కెట్ మాజీ చైర్మన్ మద్దినేని వెంకటరమణ,సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News