Sunday, November 24, 2024

గిరిజనులే అడవుల నిజమైన యజమానులు: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

వాయ్‌నాడ్ : ఆదివాసీలను అన్ని విధాలుగా అడవులకే పరిమితం చేయాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం యత్నిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. వాయ్‌నాడ్ లోక్‌సభ సభ్యత్వ పునరుద్ధరణ తరువాత తొలిసారిగా రాహుల్ ఎంపిగా ఈ ప్రాంతంలో మూడు రోజుల పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంపై విరుచుకుపడ్డారు. మోడీ ప్రభుత్వం చాలా తెలివిగా ఆదివాసీలను అణచివేసేందుకు యత్నిస్తోందని, గిరిజనులు , ఆదివాసీలు వనవాసీలు అంటూ వారి స్థావరాలను అడవులకు పరిమితం చేస్తోందన్నారు. వారిని ఆదివాసీలని పిలవాల్సి ఉంది. కానీ ఉద్ధేశపూరితంగానే వారిని వనవాలని సంబోధిస్తున్నారని ఇదేం న్యాయం అని ప్రశ్నించారు. రాజస్థాన్‌కు చెందిన గిరిజనుల అటవీ భూములను కేంద్ర ప్రభుత్వం లాక్కుని,

బడా పారిశ్రామికవేత్తలకు తక్కువ ధరలకు కట్టబెడుతోందని, వనవాసీలకు అటవీభూములు ఎందుకు అని నిలదీస్తోందని, దీనిని తాను అక్కడ ఎండగట్టినట్లు తెలిపిన రాహుల్ దేశంలో ఎక్కడా గిరిజనులకు అన్యాయం జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. గిరిజనులను అటవీ భూముల నిజమైన పట్టాదార్లుగా ప్రకటించాల్సి ఉంది. తరాలుగా ఈ భూములు వారివే. అయితే కేంద్రం వారి భూములు వారి హక్కులు, వారి జీవనాధారాలు, చివరికి వారి ఆచార వ్యవహారాలు, వేషభాషలపై కూడా దాడికి దిగుతూ వారిని కేవలం జంగిల్స్‌కు పరిమితం చేస్తున్నారని మండిపడ్డారు. తన సొంత నియోజకవర్గంలో పర్యటన దశలో రాహుల్ పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. స్థానికంగా డాక్టర్ అంబేద్కర్ జిల్లా స్మారక క్యాన్సర్ చికిత్సా కేంద్రంలో హెచ్‌టి కనెక్షన్ ఆరంభం తరువాత రాహుల్ మాట్లాడారు. కేంద్రం కేంద్రంలోని పెద్దలు తరచూ గిరిజనులను వనవాసిలని పిలవడం వెనుక చాలా విషపూరిత విషయం ఉందని విమర్శించారు.

అటవీభూముల సొంతదార్లనుంచి భూములు లాక్కోవడం పైగా వారిని అడవులకు పరిమితం చేసేలా మాట్లాడటం వంటి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని తెలిపారు. విస్తారిత అడవుల భూములను కావాలనే పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టే యత్నాలు జరుగుతున్నాయని, ఇదో పెద్ద కుట్ర అని విమర్శించారు. చివరికి గిరిజనులు అడవులకు పరిమితం , అడవిమనుష్యులు అడవులకే పరిమితం కావాలనే కట్టడి చేయడం దారుణం అన్నారు. అడవుల్లో వారి జీవనాధారాలు మీకు కావాలా? వారి ఉనికి అయిన భూములను మీరు లాక్కుంటారా? కానీ వారిని దిక్కులేకుండా వనవాసీలుగా అడవుల్లో ఉండమంటారా? ఇదేం పద్మవ్యూహం అని రాహుల్ మోడీని ప్రశ్నించారు. బిజెపి పాటిస్తోన్న వనవాసీ పద్ధతిని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని, దీనికి వ్యతిరేకంగా పోరాడుతుందని స్పష్టం చేశారు. వనవాసీ అని వ్యవహరించడం చరిత్రను వక్రీకరించడమే, గిరిజనుల సంప్రదాయాలను కాలరాయడమే, దేశంతో వారి సంబంధాలను తుంపివేయడమే అవుతుందన్నారు.

కాంగ్రెస్‌కు సంబంధించి గిరిజనులు ఆదివాసీలు, వీరికే అటవీ భూమి దక్కుతుంది. అంతేకాకుండా వీరు కేవలం ఒక్క ప్రాంతానికే నిర్ధేశితులు అయి ఉండాల్సిన అవసరం లేదని, మొత్తం భూగోళం వీరి ప్రయోజనాలకు ఉపయోగపడాల్సి ఉందన్నారు. ఇప్పటికే దండిగా అడవులను దహించి వేసి, వనసంపదలను నాశనం చేసి, తీరిగ్గా ఇప్పుడు కాలుష్యం ఏర్పడిందని చెప్పి తరచూ పర్యావరణం, పర్యావరణ పరిరక్షణ అంటూ పడికట్టు పదాలకు దిగడం కొందరి తంతు అయిందన్నారు. ఆదివాసీలు వేల సంవత్సరాలుగా తాముండే అడవులను పరిరక్షిస్తూ , పర్యావరణకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారని, వారే నిజమైన పర్యావరణ పరిరక్షకులు అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News